
ఇప్పుడు ఎక్కడ విన్నా చాట్ జిపిటీ గురించే. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఒక అప్లికేషన్ ఈ చాట్ జీపిటీ. వ్యాపారం ఏదైనా దానికి కూసింత సృజనాత్మకత జోడిస్తే.. దాని లెక్కలే మారిపోతాయి. ఓ వ్యాపారి కూడా అంతే సృజనతో 'చాయ్ జీపిటీ' అంటూ చాయ్ దుకాణానికి పేరు పెట్టాడు. అంతేకాదు... 'ఇది చాట్‌బాట్ కాదు... కప్పు టీ తెచ్చే చాయ్ షాప్' అంటూ ఒక క్యాప్షన్ కూడా జత చేశాడు. చాయ్ వాలా సృజనాత్మకత ఇప్పుడు చాయ్ ప్రియులను అమితంగా ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలే చాయ్ అంటే పడిచచ్చిపోయే మన జనాలకు 'చాయ్ జీపిటీ' టీ రంగు, రుచి, వాసనకు ఫిదా అవ్వాల్సిందే అంటున్నారు. చెమటలు కక్కే వేడిలోనూ పొగలుకక్కే చాయ్ తాగాల్సిందే. 'ఛాయ్ చటుక్కున తాగరా భాయ్.../ ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్/ ఛాయ్ ఖుషీలనే చూపురా భాయ్' అంటూ చాయ్ చమక్కులను... చాయ్ కలిగించే కిక్కులను పేద, ధనిక వ్యత్యాసం లేకుండా ఆస్వాదిస్తుంటారు. ఎంత పేదలైనా ఇంటికి వెళ్లామంటే...ఓ గ్లాసు మంచినీళ్లు, ఓ కప్పు టీ ఇవ్వాల్సిందే. ఇది అనాదిగా వున్న అలవాటు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు టీ అత్యంత ఇష్టమైన పానీయం. ఉదయాన్నే కాఫీ, టీ తాగకపోతే బుర్ర పనిచేయదనేవారు చాలామంది వున్నారు. నిద్ర మత్తు వదలాలన్నా...నరాల్లో సన్నాయి మోగాలన్నా... గరం గరం చాయ్ తాగాల్సిందే. అంతేకాదు... అలసిన శరీరానికి మాంచి జోష్ కావాలన్నా... ఓ కప్పు చాయ్ పడాల్సిందే. 'కాఫీ సమారాధనలో వున్న మజా...కాశీ సమారాధనలో గూడా లేదు' అంటాడో కవి. టీ, కాఫీలకు ఇంత మహత్తు వుంది గనుకనే... చాయ్ వాలా నంటూ దేశ ప్రజల ముందుకొచ్చాడు నరేంద్రమోడీ.
ఇప్పుడు కార్పొరేట్ టీ కొట్లు కూడా వచ్చేశాయి. చిన్నచిన్న పట్టణాల నుంచి పెదపెద్ద నగరాల వరకూ టీ ఔట్‌లెట్స్ ట్రెండ్ విస్తరిస్తోంది. ఒకప్పుడు నాలుగైదు రకాల బ్రాండ్‌లకు మించి వుండేవి కావు. కానీ, ఇప్పుడు రకరకాల టీ కంపెనీలు మార్కెట్‌లోకి వచ్చేశాయి. ప్రపంచ టీ ఉత్పత్తిలో చైనా తర్వాతి స్థానం భారత్‌దే. అంతేకాదు... అంతర్జాతీయంగా 30 శాతం టీ పొడిని ఒక్క భారతీయులే వాడేస్తున్నారు. మనవాళ్లు కాఫీ కంటే టీయే పదిహేను రెట్లు ఎక్కువ తాగుతున్నారని ఒక జాతీయ సర్వే అంచనా. ప్రపంచ జనాభాతో పాటు టీ తాగేవారి సంఖ్య కూడా పెరుగుతూనే వుంది. ఆధునికుల అభిరుచులతో పాటు రకరకాల ఫ్లేవర్లతో తయారుచేసే టీ లు కూడా వచ్చేశాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3వేల రకాల టీలు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ప్రతి సెకనుకు 25 వేల కప్పుల టీని తాగుతున్నారని ఒక అంచనా. అంటే రోజుకు రెండు వందల కోట్ల కప్పుల కంటే ఎక్కువ టీ తాగేస్తున్నారు. వాస్తవానికి కాఫీ, టీ తోటలన్నీ ఉష్ణ దేశాల్లోనే పెరుగుతాయి. 1853లో తొలిసారిగా టీ తోటలను సాగు చేశారు. ఇప్పుడు లక్షలాది ఎకరాల్లో తేయాకు పండిస్తున్నారు. టీ తోటలు పెంచేది మనం...వాటిని మార్కెట్ చేసి, డబ్బు సంపాదించుకుంటున్నది కార్పొరేట్లు. ఔట్‌లెట్స్ రూపంలోనూ విస్తరిస్తూ... సొమ్ము చేసుకుంటున్నారు.
కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ఇది. టీ తయారు చేయడంలోనే కాదు... తేయాకు కత్తిరించడం, టీ పొడి తయారు చేయడంలోనూ ఎంతోమంది మహిళల శ్రమ వుంది. అన్ని రంగాల్లో మాదిరిగానే ఈ రంగంలోనూ దోపిడీ వుంది. సాగుచేసేది ఒకరు...కత్తిరించిన ఆకులను టీ పొడిగా మార్చేది మరొకరు... పెత్తనం చేసేది, అనుభవించేది మాత్రం వేరొకరు. 'ప్రొద్దు ప్రొద్దున్నే నీ పొందు లేకున్న/ మూడంతా పాడయ్యి టైమంత వేస్టయ్యి/ కచ్చెక్కి పిచ్చెక్కి అశ్లీల సంభాషణల్ చేసి/ కాంటాక్ట్సు సర్వంబు నాశమ్ము కావించుకొంటారుగా...' అని కవి జొన్నవిత్తుల చెబుతారు. అలాగే, టీ తాగితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావచ్చునని కొందరు డాక్టర్లు హెచ్చరిస్తుంటారు. ఏదైనా 'అతి సర్వత్రా వర్జయేత్' కదా! అంతేగాక ఆయా సమస్యలను బట్టి వైద్యులు చెప్పే ఆహార, విహార నియమాలను జనం పాటించాల్సిందే. అప్పుడే, ప్రతి ఏడాది మే 21న జరుపుకునే 'అంతర్జాతీయ టీ దినోత్సవాని'కి మాంచి మసాలా టీ తాగినంత కిక్కు వస్తుంది.