- మతతత్వ బిజెపి విధానాలను వ్యతిరేకంగా కేరళలో పోరాటాలు
ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : 'ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణతో రిజర్వేషన్ల ఎట్టివేతకు బిజెపి ప్రభుత్వం అడుగులు వేసింది. మతతత్వ అజెండాతో ముందుకు పోతుంది. మతతత్వ విధానాలను కేరళ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. డిజిటల్ ఎడ్యుకేషన్ లోనూ కేరళ ముందుంది. సాంకేతిక విద్యను పేదలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతోంది' అని కేరళ రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, దళిత సోషన్ ముక్తి మంచ్ (డిఎస్‌ఎంఎం) జాతీయ అధ్యక్షులు కె.రాధాకృష్ణన్ అన్నారు. కెవిపిఎస్ రాష్ట్ర మహాసభ సందర్భంగా కర్నూలు విచ్చేసిన ఆయన 'ప్రజాశక్తి'తో మాట్లాడారు.
డిఎస్‌ఎంఎం పోరాటాలు ఎలా ఉన్నాయి ?
మంత్రి : డిఎస్‌ఎంఎం ఒక సంఘం కాదు. ప్రతి రాష్ట్రంలో కుల వివక్ష వ్యతిరేక సంఘాలు ఉన్నాయి. వాటన్నిటినీ కలిపే వేదికే డిఎస్‌ఎంఎం. జాతీయ స్థాయి ఆందోళనలను డిఎస్‌ఎంఎం చేపడుతుంది. బీహార్‌లోని బొగుసొరయాలో వచ్చే నెలలో ఆలిండియా రెండో కాన్ఫరెన్స్ జరగనుంది. అందులో ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నారు.
దేశంలో ఎలాంటి వివక్ష ఉంది ?
మంత్రి : దేశంలో కులం అనేది అంతరాలను సూచిస్తోంది. 75 ఏళ్ల స్వాతంత్రం తరువాత కూడా ఇప్పటికీ కులవివక్ష కొనసాగుతోంది. చివరికి నీటి పాత్రలను తాకడానికి కూడా కులం అడ్డు వస్తోంది. వివక్షను తీవ్రం చేసేందుకు బిజెపి ప్రయత్నాలు సాగిస్తోంది. హిందూ దేశ సాధనే ఆర్‌ఎస్‌ఎస్ అజెండా. మనుస్మృతి ఆధారంగా పాలన సాగుతోంది. ఒకే దేశం, ఒకే భాష, ఒకే నాయకుడు, ఒకే విధానం ఇవన్నీ మనుస్మృతి అమలులో భాగమే. మనుస్మృతి అమలుకు రాజ్యాంగం అడ్డు వస్తుండడంతో రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు.
రిజర్వేషన్ల ఎత్తివేతకు ఎలాంటి ప్రయత్నాలు సాగుతున్నాయి ?
మంత్రి : రిజర్వేషన్లు ఎత్తేయాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెబుతున్నారు. రిజర్వేషన్ల వల్లే దళితులు, గిరిజనులు విద్య, ఉద్యోగం, ఎన్నికల్లో ముందుకు వెళ్లేందుకు సాధ్యమవుతోంది. ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణతో రిజర్వేషన్ల ఎత్తివేతకు తొలి అడుగు పడింది. ప్రయివేటు సంస్థల్లో రిజర్వేషన్లు ఉండవు. అలా క్రమంగా రిజర్వేషన్లు తీసేస్తారు.
ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టం నిర్వీర్యం అవుతోంది కదా. దాని గురించి ఏమంటారు ?
మంత్రి : 1989లో ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టం పార్లమెంట్‌లో ఆమోదం పొందితే అది చట్టంగా 1995లో వచ్చింది. అట్రాసిటీ చట్టంలోని కొన్ని క్లాజులను తీసివేశారు. అది మతతత్వ శక్తులకు అనుకూలంగా మారనుంది. వివక్ష చూపేవారిని చట్టం నుంచి శిక్షపడకుండా తప్పించేందుకు ప్రయత్నం జరుగుతోంది. దానిపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్‌డిఎలోని కొన్ని పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. కేరళలో అట్రాసిటీ లేకుండా కొనసాగుతోంది.
కేరళలో వివక్ష నిర్మూలన ఎలా సాధ్యం అయింది ?
మంత్రి : ఒకప్పుడు దేశంలో ఎక్కడా లేనంతగా కేరళలో వివక్ష ఉండేది. ఆ సమయంలో చాలామంది సంస్కర్తలు సమాజాన్ని వివక్ష లేకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. పలు రాష్ట్రాల నుండి కూడా వచ్చి కేరళలో ఉద్యమాలు నిర్వహించారు. అదే సమయంలో స్వాతంత్ర పోరాటంతో కమ్యూనిస్ట్ ఉద్యమం రావడంతో వివక్ష లేకుండా పోయింది. ఎస్‌సి, ఎస్‌టిలు తమ పిల్లలకు చదువు చెప్పించకపోతే పనులకు రామని నిరసన తెలిపారు. దీంతో, అట్టడుగు వర్గాల పిల్లలు కూడా చదువులో రాణిస్తున్నారు. అందరూ అక్షరాస్యులయ్యారు.
కేరళలో ఎలాంటి పథకాలు అమలవుతున్నాయి? అభివృద్ధి ఎలా ఉంది ?
మంత్రి : ఎప్పుడు వామపక్ష ప్రభుత్వం వచ్చినా కొత్త ప్రణాళికలతో ముందుకు వెళుతోంది. పేదలకు విద్య, భూమి, ఇల్లు, ఉపాధి వంటి వాటి కోసమే ఒక శాఖ పని చేస్తోంది. కేరళలో గిరిజన ప్రాంతాల్లోనూ డిజిటల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. కనెక్టివిటీలేని ప్రాంతాలను గుర్తించి కనెక్టివిటీ సౌకర్యం కల్పించాం. ఇంకా 204 ప్రాంతాలకు కనెక్టివిటీ సౌకర్యం ఇవ్వాల్సి ఉంది. ఆరు నెలల్లో అది కూడా పూర్తవుతుంది. రాష్ట్రంలో 33 మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు నడుస్తున్నాయి. ఎస్‌సి, ఎస్‌టిల కోసం పైలట్, సివిల్ సర్వీస్, విదేశీ విద్య కోసం శిక్షణ ఇస్తున్నాం. పైలట్, విదేశీ విద్య కోసం ఒకొక్కరికి రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్నాం. గతేడాది గిరిజనులు ఆరుగురు పైలట్లుగా ఎంపికయ్యారు.
కేరళలో దళితులు కూడా పూజారులుగా ఉన్నారు. దానిపై మీరేమంటారు ?
మంత్రి : దళితులకు దేవాలయ ప్రవేశం కృష్ణ పిళ్లై కల్పించారు. ఆయన నాయర్ కులానికి చెందిన వారు కావడంతో నాయర్ కులస్తులు ఆయనను తీవ్రంగా కొట్టారు. 'నేను దమ్మున్న నాయర్‌ను ఆలయంలో గంట కొడతాను. ఎంగిలి తినే నాయర్లు నా వీపును కొడుతున్నారు' అని చేసిన వ్యాఖ్యలకు వారు కొట్టడం ఆపేశారు. ఆ కాలంలో దళితులను గుడి ముందు కూడా నడవనిచ్చేవారు కాదు. ఇప్పుడు అదే గుడిలో వారు పూజారులుగా ఉన్నారు. సమాజ మార్పుతో ఇది కేరళలో సాధ్యమైంది.










