Mar 14,2023 21:36

న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్లలో ప్రీ-ఇన్‌స్టాల్‌ యాప్‌లను నిరోదించే అంశంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. పలు స్మార్ట్‌ఫోన్లలో ముందే ఇన్‌స్టాల్‌ చేసిన యాప్‌ల వల్ల గూఢచర్యం, వినియోగదారు డేటా దుర్వినియోగం గురించి ఐటి మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోందని రాయిటర్స్‌ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. వీటి కట్టడికి కేంద్రం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాలని చూస్తోందని సమాచారం. అదే జరిగితే అనేక విదేశీ స్మార్ట్‌ కంపెనీలకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. ప్రస్తుతం చాలా వరకు స్మార్ట్‌ఫోన్లలో ముందే ఇన్‌స్టాల్‌ చేసిన యాప్‌లు ఉంటున్నాయి. వీటిని డిలీట్‌ చేయడానికి కుదరదు. చైనా సహా విదేశీ కంపెనీల గూఢచర్యాన్ని నిరోధించడానికి ఈ యోచన చేస్తున్నామని ఓ అధికారి పేర్కొన్నారు. ముందుగానే ఇన్‌స్టాల్‌ చేసి ఉంచుతున్న యాప్‌లే భద్రతాపరంగా ముప్పు తెచ్చిపెడుతున్నట్లు గుర్తించామన్నారు.