Nov 05,2023 08:11

-కంటి తుడుపుగా భూ పంపిణీ
-నిరాశపరిచిన కేబినెట్‌ నిర్ణయాలు
-కరువు నివారణకు రూ.10 వేల కోట్లు కేటాయించాలి : వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి- చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):శుక్రవారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశపరిచాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. కార్పొరేట్లకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని విమర్శించారు. సిపిఎం ఆధ్వర్యాన చేపట్టిన ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర అల్లూరి జిల్లాలోని చింతపల్లికి వచ్చిన సందర్భంగా శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాజా కేబినెట్‌లో డిఎస్‌సిపైనా, గిరిజనులకు వంద శాతం ఉద్యోగ రిజర్వేషన్‌ కల్పించే జిఒ నెంబర్‌ 3పైనా ప్రస్తావనే లేకపోవడం శోచనీయమన్నారు. ముఖ్యంగా మెగా డిఎస్‌సిపై నిర్ణయం తీసుకోకపోవడంతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయిందని తెలిపారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కుల గణన చేస్తామని ప్రకటించడం హర్షనీయమైనప్పటికీ, దానికి చట్టబద్ధత లేకపోతే ఎన్నికల ముందు బిసిలను ఊరించడానికి చేసే స్టంటుగానే భావించాల్సి ఉంటుందన్నారు. వాస్తవానికి కులగణన జాతీయ స్థాయిలో జన గణనతోపాటు జరగాలని, అప్పుడే అన్ని కులాల ఆర్థిక, సామాజిక పరిస్థితి అర్థమవుతుందని తెలిపారు. తద్వారా రిజర్వేషన్‌, ఉద్యోగ, ఉపాధి విషయాలలో సమన్యాయం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చట్టబద్ధతా లేకుండా వలంటీర్ల ద్వారా సామాజిక ఆర్థిక సర్వే చేస్తామని చెప్పడం సరికాదన్నారు. కులగణన విషయంలో గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలని, అన్ని కుల సంఘాలతోపాటు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, అన్ని తరగతుల ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలని కోరారు. ఒక సమగ్రమైన సర్వే రూపంలో వివాదరహితంగా ఆ ప్రక్రియ నిర్వహించాలని, దీనికి చట్టబద్ధత అవసరమని అన్నారు. నవంబర్‌ 15 నుంచి భూ పంపిణీ చేస్తామని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని, 25 లక్షల ఎకరాల భూమి పంపకానికి వీలుగా ఉన్నా, 55 వేల ఎకరాలు మాత్రమే పంచుతామని ప్రకటించడం తగదని పేర్కొన్నారు. కంటి తుడుపు చర్యలా భూ పంపిణీ ప్రకటన ఉందన్నారు. నేటికీ అల్లూరి జిల్లాలోని అనేకమంది గిరిజన పోడు భూమి రైతులకు పట్టాలు ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో రెండున్నర లక్షలకుపైగా పేదలు గుడిసెలు వేసుకుని ఉంటున్నారని, వాటికి పట్టాలు మంజూరు చేయాలని స్పందన కార్యక్రమంలో మొరపెట్టుకుంటున్నా నేటికీ పట్టాలు ఇవ్వలేదని అన్నారు. పైగా, వారందరినీ తరిమేసి ఆ భూములను రియల్‌ ఎస్టేట్‌కు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, అటవీ భూముల నుంచి గిరిజనులను వెళ్లగొట్టి, ఆ భూములను కార్పొరేట్‌ కంపెనీలకు స్వాధీనం చేస్తున్నారని అన్నారు. పరిశ్రమల పేరిట భూములను కార్పొరేట్లు చేజెక్కించుకుని, బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకుని లబ్ధి పొందుతున్నారని వివరించారు. ప్రజలనూ, బ్యాంకులనూ మోసం చేస్తున్న అటువంటి శక్తులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొమ్ముకాయడం తగదన్నారు. పేదల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ, అటవీ భూములన్నిటికీ తక్షణం పట్టాలు ఇవ్వాలని, అన్యాక్రాంతమైన అసైన్డ్‌ భూములను తిరిగి పేదలకు స్వాధీనం చేయాలని కోరారు. పరిశ్రమలు పెట్టకుండా కార్పొరేట్ల ఆధీనంలో ఉన్న భూములను వెంటనే స్వాధీనం చేసుకొని పంపిణీ చేయాలని, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల అమలు సమీక్ష కోసం ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ నిర్ణయం మంచి విషయమేనని, అయితే, కాలయాపన చేయకుండా ఎన్నికల ముందే వారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని కోరారు. రాష్ట్రంలో 300 పైచిలుకు మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నా, వాటిని తగ్గించి చూపడం దారుణమని, కరువు పరిశీలనకు కేంద్ర బృందాలు రాకపోవడం శోచనీయమని అన్నారు. కరువు సహాయక చర్యలకు, రైతాంగాన్ని ఆదుకునేందుకు రూ.10 వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విలేకర్ల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర, జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్‌ తదితరులు పాల్గొన్నారు.