
అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని యథాప్రకారం కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చి ఆరు మాసాలు. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు అఫిడవిట్లు దాఖలు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. దీనిపై నిరంతరం పరిశీలించడానికి వీలుగా కంటిన్యువస్ మాండమస్ కింద అనేక పిటిషన్లు అట్టిపెట్టుకుంది. తీర్పును వైసిపి మినహా అన్ని పార్టీలూ స్వాగతించాయి. తీర్పు ప్రకారం పునరుద్ధరించబడిన సిఆర్‌డిఎ జగన్ ప్రభుత్వం నిర్ణయం మేరకు అక్కడ కొన్నినిర్మాణాలు పూర్తిచేయడానికంటూ అప్పు ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించింది. రోడ్లు, మౌలిక సదుపాయాల నిర్మాణం చేపడతానన్నది. మరోవైపున మూడు రాజధానుల విధానం మారలేదని కూడా చెబుతూ వస్తోంది. ఈ మధ్య కాలంలో రైతులు వేసిన పిటిషన్లు హైకోర్టు ముందుకు వచ్చినపుడు తమ దగ్గర నిధులు లేవనీ, గత మాష్టర్ ప్లాన్‌ను యథాతథంగా పూర్తిచేయడానికి ఈ వ్యవధి చాలదని కోర్టుకు చెప్పింది. తాము గత తీర్పుపై సమీక్ష కోరుతూ ఇక్కడ పిటిషన్ లేదా సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పి వేయనున్నామని తెలియజేసింది. ఈ పూర్వరంగంలోనే రైతులు తమ దీక్షలు వెయ్యి రోజులకు చేరుతున్న సందర్భంగా అమరావతి టు అరసవల్లి యాత్ర చేయడానికి పోలీసుల అనుమతి కోరగా జవాబు రాలేదు. దానిపై వారు కోర్టును అభ్యర్థించగా సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వానికి ఓకరోజు గడువు ఇచ్చింది. సరిగ్గా ఆ రోజు రాత్రే పోలీసులు అనుమతి నిరాకరిస్తూ వారికి నోటీసులు ఇచ్చారు. దాంతో హైకోర్టు అనుమతినిన్తూ తగు భద్రతా ఏర్పాట్లు చేయవలసిందిగా పోలీసులను ఆదేశించింది.
మరోసారి తీవ్ర వివాదం
రాజధాని సమస్యపై మరోసారి క్రమంగా పెరుగుతూ వస్తున్న వేడి హైకోర్టు అనుమతితో పరాకాష్టకు చేరింది. ప్రజాస్వామ్యబద్దంగా అనుమతి లభిస్తుందని ముందే తెలిసినా జీర్ణించుకోలేని ప్రభుత్వం మళ్లీ మూడు రాజధానుల పల్లవి ఎత్తుకుంది. గతంలో కంటే గట్టిగా తీవ్రంగా మంత్రులు, మాజీ మంత్రులు విశాఖను పాలనా రాజధానిగా చేసి తీరతామని ప్రకటిస్తున్నారు. ఈ తీర్పునకు ముందు రోజే రాజధానికి సంబంధించిన ఒక పుస్తకావిష్కరణ సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ పార్టీల నాయకులు, జెఎసి మాట్లాడారు. మిగిలిన అంశాలు అలా వుంచి చంద్రబాబు అమరావతి రాజధాని సంకల్పం తాను ఎందుకు తీసుకున్నానో నొక్కి చెప్పారు. మహానగరం వుంటేనే అభివృద్ధి, ఉపాధి సాధ్యమని పునరుద్ఘాటించారు. తాను రాజధానితోపాటు వివిధ జిల్లాల్లో కేంద్రం ఇచ్చిన సంస్థలు ఏర్పాటు చేయించినట్టు జాబితా ఇచ్చారు. మొత్తంపైన తన ప్రణాళికలోనూ ఆచరణలోనూ లోపం లేనట్టు ఇతరుల వల్లనే ప్రతిష్టంభన వచ్చినట్టు పూర్తిగా సమర్థించుకున్నారు. శంకుస్థాపన సమయంలో ప్రధాని మోడీ మట్టి, నీరు తేవడం కూడా విశిష్టమైన విషయంగా ప్రస్తావించారు. ఆ రోజుల్లో అది తీవ్ర అపహాస్యానికి గురైన సంగతి కావాలనే మర్చిపోయారనుకోవాలి. 1951లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమయంలోనూ విజయవాడ రాజధాని కావాలని ప్రయత్నించినా కావాలని అడ్డుకున్న సందర్భాన్ని గుర్తుచేశారు. అమరావతి ఒక కులానికి సంబంధించింది కాదని ఒకవైపు అంటూనే కొందరు వక్తలు ఓ కులం వల్ల సేవలు గొప్పగా లభించినట్టు వ్యాఖ్యానించారు. ఈ సభలో ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారుగానీ గత ప్రభుత్వ జాప్యం, అతిశయోక్తి ప్రచారాలు సింగపూర్ ఆశల వైఫల్యం గురించి కనీస ఆత్మ విమర్శ కనిపించలేదు. మహా నగరాలు చరిత్ర క్రమంలో ఆవిర్భవిస్తాయి. దేశంలోని అయిదు మహా నగరాలలో నాలుగింటికి సుదీర్ఘ చరిత్ర వుంది. ఇప్పటికిప్పుడు ఏర్పడలేదు. హైదరాబాద్ వుంది గనకే ఆయన సైబరాబాద్ విస్తరించారు తప్ప శూన్యం లోంచి కాదు. విజయవాడను రాజధానిగా కమ్యూనిస్టులు చెప్పినప్పుడు వారి గురించిన భయంతోనే అప్పటి పాలక వర్గాలన్నీ కలసి అడ్డుకున్నాయి. ఆ ఘట్టాన్ని అమరావతితో పోల్చి మాట్లాడ్డం వాస్తవికత కాదు. కనుక చంద్రబాబు చెప్పే దాంట్లో ఇప్పటికైనా వాస్తవికత లేదు. అప్పుడూ ఇప్పుడూ కేంద్ర బిజెపి అవకాశవాదాన్ని, అలక్ష్యాన్ని కనీసంగా మాట్లాడక పోగా వారి మాజీ అధ్యక్షుడిని పిలిచి మరీ పీట వేశారు. ఈ కారణంగానే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఈ సభలో మాట్లాడతారని ప్రకటనలో వున్నా ఆయన హాజరు కాలేదు. రాజధానిపై పలు కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు, అంతకు మించి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజధాని దుస్థితికి కారణమని సూటిగా విమర్శ చేశారు. హైకోర్టు తీర్పును అమలు చేసి రాజధానిని పూర్తి చేయాలన్నారు.
ప్రభుత్వ పెడ ధోరణి, మంత్రుల ఎదురు దాడి
ఈ తీర్పు వచ్చిన రోజున సమావేశమైన మంత్రివర్గం సిఆర్‌డిఎ చట్టానికి కొన్ని సవరణలు ప్రతిపాదించింది. రాజధానిలో భూములిచ్చిన రైతులకు మాత్రమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెబుతున్న నిబంధనను సవరించి ఇతర ప్రాంతాల వారికి కూడా అవకాశం వుండేలా చేస్తామన్నది. అమరావతి మెట్రో అథారిటీగా గతంలో ప్రకటించికోర్టు తీర్పుతో వెనక్కు తగ్గిన పరిస్థితి పోయి మునిసిపాలిటీ చేస్తామన్నది. దీనిపైనా పదిరోజుల్లో గ్రామస్తుల అభిప్రాయాలు తీసుకోవాలని కార్యక్రమం ప్రకటించింది. 29 గ్రామాలలో కొన్నిటిని మినహాయించింది. రాజధానిని మునిసిపాలిటీ స్థాయికి తెచ్చారని విమర్శలు రాగా రాజధానులైన ముంబాయి, కోల్‌కతా, మద్రాసు వంటి మహా నగరాలకు కూడా కార్పొరేషన్లు వున్నాయని ఎదురుదాడి చేసింది. అంతకన్నా కీలకంగా మంత్రులు మూకుమ్మడిగా విశాఖ పాలనా రాజధానిగా మూడు రాజధానులు చేసి తీరతామని ప్రకటించారు. మొత్తం నిధులు ఒకచోటే పెడితే మిగతా ప్రాంతాలు ఏం కావాలని ఎదురు ప్రశ్నలు వేశారు. టిడిపి, వైసీపీ దూషణలు పక్కన పెడితే వికేంద్రీకరణ కోసమే ఇదంతా చేస్తున్నట్టు ప్రభుత్వం వాదించింది. ప్రభుత్వం పైన, తన కుటుంబంపైనా దాడి చేస్తున్నా మంత్రులు స్పందించడం లేదని ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గ సమావేశంలో ఆగ్రహం వెలిబుచ్చిన నేపథ్యంలో వీరు అవసరాన్ని మించి మరీ ఆవేశకావేశాలు ప్రదర్శిస్తున్నారు. గతంలో ఈ శీర్షికలో చెప్పుకున్నట్టుగా దీన్ని రాజకీయ వివాదంగా ప్రాంతీయ ఎజెండాగా చేసే ప్రయత్నం ప్రస్ఫుటమవుతున్నాయి. అమరావతిలో నిజంగా జరిగిన నష్టం చక్కదిద్ది రాజధానిని పూర్తిచేసే బదులు వివాదాన్ని సాగదీయడమే వారి లక్ష్యంగా అర్థమవుతుంది. మూడు రాజధానులనకుండానే విశాఖలో కీలకమైన కొన్ని కార్యాలయాలు, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం పెట్టి పరిశ్రమల ఒప్పందాల కేంద్రంగా చూసుకుంటారని వచ్చిన సూచనలు వెనక్కుపోయాయి.
అమరావతి దురవస్థ, హైకోర్టు తీర్పు
అమరావతిలో రాజధాని నిర్మించడం కోసం శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అందుకోసం ఎపిసిఆర్‌డిఎను నెలకొల్పింది, అభివృద్ధి చేసిన ప్లాట్లు, వాణిజ్య ప్లాట్లు కేటాయించడం, కౌలు ఇవ్వడం ప్రాతిపదికగా రైతుల నుంచి 34 వేల ఎకరాలు సేకరించింది. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామనీ, పదేళ్ల నాటికి ప్రపంచ స్థాయి నాణ్యతతో దాన్ని పెంపొందిస్తామని మాట ఇచ్చింది. ఎపిసిఆర్‌డిఎ 9.14 కింద జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జిపిఎ) చేసుకుని ఆ భూమిని స్వాధీన పర్చుకుంది. కాని ఇప్పటికీ వారికి ప్లాట్లు అప్పగించడం పూర్తికాలేదు. మౌలిక సదుపాయాలు, భవనాల నిర్మాణం జరగలేదనీ హైకోర్టు పేర్కొంది. మూడు రాజధానుల విధానంతో ప్రామిసరీ ఇస్టోపిల్ సూత్రం ప్రకారం సిఆర్‌డిఎ ప్రభుత్వం చేసిన వాగ్దానం భగమైంది. తన చేతిలో శాసనాధికారం వుందని ఇష్టానుసారం దుర్వినియోగం చేసి ఒప్పందం కట్టుబాటును ఉల్లంఘించకూడదు. ఈ ఏడేళ్లలో వివిధ రోడ్లు భవనాలు మౌలిక సదుపాయాల కోసం ఇంచుమించు 15 వేల కోట్లు ఖర్చు అయింది. అర్ధంతరంగా వదిలివేయడంతో ఆ ప్రజాధనం వృథా అవడమే గాక భూములిచ్చిన రైతుల జీవనోపాధి దెబ్బతినిపోయింది. ఆస్తిహక్కుకు విఘాతం కలిగింది. సుక్షేత్రాలయిన వారి భూములు పడావు పడ్డాయి. అభివృద్ధి పనులులేక ఈ ప్రాంతం వెనకబడిపోయింది. రాజ్యాంగం లోని 21వ అధికరణం కింద జీవించే హక్కుతో సహా ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే. అమరావతిని శాసన రాజధానిగా పరిమితం చేసేట్టయితే భూసమీకరణ ఒప్పందం ప్రకారం ఆర్థిక లబ్ధి గాని జీవనోపాధి గాని లభించవు. ఇప్పుడు ఆ బిల్లును వెనక్కు తీసుకున్నాము గనక విచారణ అవసరం లేదని ప్రభుత్వం, సిఆర్‌డిఎ వాదిస్తున్నా భవిష్యత్తులో తెచ్చే వికేంద్రీకరణ శాసనం ఎలా వుంటుందో తెలియకుండా కేసు విచారణ ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాజధాని ఎక్కడ పెట్టాలో తాము చెప్పడంలేదని కూడా స్పష్టం చేసింది. ఎపిసిఆర్‌డిఎ చట్టం, 9.14 జిపిఎ ప్రకారం అమరావతిలో గతంలో అనుకున్న విధంగానే రాజధానిని నిర్మించాలని, ఏ కార్యాలయాన్ని ఏ విభాగాన్ని ఎక్కడికి తరలించరాదని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఇప్పుడు మంత్రుల తాజా ప్రకటనలతో మూడు రాజధానుల సమస్య మళ్లీ ముందుకు వచ్చింది.
గత అనుభవాలు, భవిష్యత్తు
ముందే చెప్పినట్టు ఈ దుస్థితికి గత ప్రస్తుత ప్రభుత్వాలు, అంతకు మించి కేంద్రం బాధ్యత వహించాల్సి వుంటుంది. తెలుగుదేశం హయాంలో మొదటి జాప్యం జరిగింది. దాంతో కలిసి రాష్ట్రాన్ని పాలించిన, ఇప్పటికీ కేంద్రాన్ని పాలిస్తున్న బిజెపి మరింత అన్యాయం చేసింది. మూడు రాజధానుల ముచ్చటతో ప్రస్తుత ముఖ్యమంత్రి మొత్తం తలకిందులు చేశారు. ఫలితంగా ఎనిమిదో ఏట కూడా రాజధానిపై అస్పష్టత ఆందోళన కలిగిస్తుంది. నష్టం చేస్తుంది. ఇప్పటికైనా దాన్ని ముగించడం ప్రభుత్వాల బాధ్యత. వికేంద్రీకరణ తప్పనిసరిగా జరగాల్సిందే. ఆ పేరుతో కట్టాల్సిన రాజధాని నిలిపేయడం ఏం న్యాయం? దానిపై ఆందోళనలను అడ్డుకోవడం ఎంత అప్రజాస్వామికం? రాజధానిలో దళితులకు భూములివ్వడం బాగానే వుందిగాని ముందు కడితే కదా, మేలు జరిగేది? కట్టిన భవనాలు పూర్తిచేయకుండా మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఎవరికి ఇళ్ల స్థలాలు ఇస్తే ఏం లాభం? జగన్ ప్రభుత్వ వాదనలు, వ్యూహాలు సమర్థనకు, ఎదురుదాడికి మాత్రమే...విశాఖతో సహా ఉత్తరాంధ్రను కర్నూలులో హైకోర్టుతో సహా రాయలసీమను అభివృద్ధి చేస్తే ఎవరు కాదంటారు? వాటికోసం అమరావతి నిలిపివేయడం ఎందుకనేదే ప్రశ్న. స్వయంకృతాపరాధమైన ఈ సంక్షోభాన్ని ప్రజాస్వామికంగా పరిష్కరించకపోతే పాలక పక్షానికే నష్టం. దాన్ని ప్రాంతీయ వివాదంగా మార్చి లాభం పొందాలనుకుంటే అప్పుడు ఈ విభజిత రాష్ట్రానికి మరింత చేటు. ఇప్పటికైనా అందరితో చర్చించి వాస్తవిక రాజధాని నిర్మాణం జరిపితేనే ప్రజలు హర్షిస్తారు.
తెలకపల్లి రవి