- వైసిపి, టిడిపిల తీరుపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు లోకనాథం
ప్రజాశక్తి - కలెక్టరేట్ (విశాఖపట్నం) : రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీవ్ర ద్రోహం చేస్తున్నా వైసిపి, టిడిపిలు నోరుమెదపకపోవడం దారుణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం అన్నారు. విశాఖలోని జగదాంబ దరి ఎన్‌పిఆర్ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న బిజెపిని అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిఘటించకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రా, తెలంగాణ పార్లమెంట్ సభ్యులు వేసిన ప్రశ్నలకు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరారు సమాధానమిస్తూ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు రూ.106.89 కోట్లు గత నవంబరులో కేటాయించినట్లు తెలిపి, ఈ బడ్జెట్‌లో రూ.10 కోట్లు మాత్రమే కేటాయించినట్లు చెప్పారన్నారు. దీన్ని బట్టి విశాఖ రైల్వే జోన్ పట్ల బిజెపి చిత్తశుద్ది ఏమిటో ఇట్టే అర్థమవుతోందని తెలిపారు. జాతీయ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ.946 కోట్లు కేటాయించాల్సి ఉండగా మొదట ఏడాదిలో రూ.7.5 కోట్లు, ఇప్పుడు రూ.24.34 కోట్లు మాత్రమే కేటాయించిందని తెలిపారు. జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు పట్ల కేంద్రం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించి గిరిజనులకు తీవ్ర ద్రోహం చేస్తోందని విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో స్టాటిజిక్ సేల్ పేరుతో అమ్మకానికి పూనుకుంటున్నట్లు మరోసారి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామ్ ప్రకటించారని, ఇది దుర్మార్గమైన చర్యని పేర్కొన్నారు. అదానీ గంగవరం పోర్టు నుంచి స్టీల్‌ప్లాంట్‌కు రావాల్సిన ముడిసరుకు ఇవ్వకుండా అనేక ఆంక్షలు పెడుతున్నారని తెలిపారు. గంగవరం పోర్టు నిర్మాణానికి 1100 ఎకరాల భూమిని స్టీల్‌ప్లాంట్ నుంచి తీసుకుని, ఇప్పుడు ఆ కర్మాగారాన్ని నష్టాల్లోకి నెట్టడం నమ్మకద్రోహం కాదా? అని ప్రశ్నించారు. ప్లాంట్ విషయమై కనీసం పార్లమెంట్‌లో చర్చించి నివారణా చర్యలకు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. విశాఖలో ఇఎస్‌ఐ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్‌ప్లాంట్, రామాయపట్నం పోర్టులకు కేంద్రం పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే రాష్ట్రంలోని వైసిపి, టిడిపిలు నోరుమెదకపోవడంపై మండిపడ్డారు. సమావేశంలో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్, జిల్లా కమిటీ సభ్యులు వి.కృష్ణారావు పాల్గొన్నారు.










