Nov 06,2023 08:25

ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి, రంపచోడవరం విలేకరి :మోడీ మూడోసారి ప్రధాని కావాలని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రకటనపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఫైర్‌ అయ్యారు. ప్రజారక్షణ భేరి బస్సు యాత్రలో భాగంగా ఆదివారం రంపచోడవరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ మూడోసారి ప్రధాని కావాలని పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రకటనపై స్పందిస్తూ, రాష్ట్రానికి అన్యాయం చేసినందుకా? విభజన హామీలు అమలు చేయనందుకా? స్టీల్‌ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టినందుకా? వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు నిలిపివేసినందుకా? మళ్లీ మోడీ ప్రధాని కావాలని పవన్‌ కోరుకుంటున్నారు అని ప్రశ్నించారు. మోడీ ఎందుకు మళ్లీ ప్రధాని కావాలని పవన్‌ కోరుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. ఎవరిని ఉద్ధరించడానికి మోడీ మూడోసారి ప్రధాని కావాలని ప్రశ్నించారు. వైసిపి, బిజెపి, టిడిపి, జనసేన పార్టీలు నాలుగు స్తంభాలాట ఆడుతూ ప్రజలను మోసగిస్తున్నాయని విమర్శించారు. ఈ ఆటలో బిజెపి సూత్రధారి కాగా, మిగిలిన మూడు పార్టీలూ పాత్రధారులుగా ఉన్నాయన్నారు. స్వతంత్రను కోల్పోయి బిజెపి ప్రాపకం కోసం రాష్ట్రంలోని మూడు పార్టీలూ పాకులాడుతున్నాయని విమర్శించారు. సొంత రాజకీయ అజెండా కోసం రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నాయన్నారు. మోడీని మోసినంత వరకూ రాష్ట్రం అభివృద్ధి జరగదని తెలిపారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి వైసిపి ప్రభుత్వ మద్యం కుంభకోణంపై లెటర్‌ రాయడంపై శ్రీనివాసరావు స్పందిస్తూ, బిజెపి సర్కారు జగన్‌కు బెయిల్‌ రద్దు చేసి ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలపై ఎందుకు విచారించడం లేదో ప్రజలకు ఆమె వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.