అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించడం సిగ్గుచేటు : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
రాష్ట్ర ప్రజలకు వైసిపి, టిడిపి సమాధానం చెప్పాలి
మణిపూర్ ఘటనపై రెండు పార్టీల వైఖరి స్పష్టం చేయాలి
పోలవరం ముంపు బాధితులను ఆదుకోవాలి
మహిళల అదృశ్యంపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరపాలి
15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు జమచేయాలి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :మణిపూర్ ఘటన నేపథ్యంలో కేంద్ర బిజెపి ప్రభుత్వంపై ఇండియా కూటమి పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించిన వైసిపి, టిడిపిలు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యాలయం దగ్గర్లోని బాలోత్సవ భవన్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. దేశంతో పాటు యావత్ ప్రపంచం వేలెత్తి చూపించిన మణిపూర్ ఘటనను సమర్థించే విధంగా వ్యవహరిస్తున్న అనాగరికమైన ప్రధానికి మద్దతిచ్చే విధంగా ఈ పార్టీలు వ్యవహరించడం అన్యాయం, ఘోరం, అవమానమని ఆయన అన్నారు.
పార్లమెంటులో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసిపి, టిడిపి ఎంపిలు అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించాయని, ఇంతకంటే సిగ్గుచేటైన విషయం మరొకటి లేదని చెప్పారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎక్కువ అన్యాయం చేసింది ఆంధ్రప్రదేశ్‌కేనని అన్నారు. రాష్ట్ర ప్రజలు బిజెపికి దిక్కులేని పరిస్థితిని తీసుకొచ్చారని, అయినా, వైసిపి, టిడిపి పూర్తి మద్దతు ఇస్తూ వెనకేసుకు రావడం గర్హనీయమన్నారు. వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఏకంగా మణిపూర్ విషయంలో ఏం జరిగిందని అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలో చెప్పాలని ప్రశ్నించారని ఇంతకంటే సిగ్గుపడాల్సిన విషయం ఇంకొకటి లేదని పేర్కొన్నారు. మణిపూర్ ఘటనలను ఆయనకు కనిపించకపోవడం దారుణమన్నారు.
ఏమీ జరగలేదని చెప్పి వెనకేసుకొస్తున్న విజయసాయిరెడ్డి సిగ్గు పడాలన్నారు. అలాగే టిడిపి ఎంపీలు కూడా బడి పిల్లల మాదిరి నోరెత్తకుండా కూర్చుని అవిశ్వాసాన్ని వ్యతిరేకిస్తున్నారని ఈ రెండు పార్టీలను బిజెపికి బి టీమ్, శాటిలైట్ టీములన్నా తప్పులేదని అన్నారు.
అవిశ్వాస తీర్మానానికి ముందు పార్లమెంటులో విభజన హామీలపై కేంద్రమంత్రి సమాధానం ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. విభజన హామీలలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చినట్లు ఆయన చెప్పలేకపోయారని, అయినా విజయసాయిరెడ్డి, టిడిపి ఎంపిలు ప్రభువును మించిన ప్రభుభక్తి ప్రదర్శిస్తున్నారని అన్నారు. కడప స్టీలు ఫ్యాక్టరీని జిందాల్ ఆధ్వర్యాన నిర్మిస్తామని సిఎం శంకుస్థాపన చేస్తే కేంద్రం సాధ్యం కాదని పార్లమెంటులో ప్రకటించిందని, దీనిపై నోరెత్తని వైసిపిని ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. ప్రత్యేక హౌదా, రాజధానికి నిధులు ఇవ్వలేదని, రామాయపట్నం పోర్టును నాన్ మేజర్ కేటగిరీలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని పేర్కొన్నారు. రైల్వేజోన్‌కు రూ.106 కోట్లు అవసరమని అంచనా వేసి గత బడ్జెట్లో రూ.10 కోట్లు ఇస్తామన్నారని, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. అయినా నోరెత్తని వైసిపి, టిడిపి పార్లమెంటు ప్రతినిధులు అసలు తెలుగు ప్రజలకు ప్రతినిధులేనా అని ప్రశ్నించారు. కేంద్రీయ విద్యాలయాలను కేంద్రం పట్టించుకోవడం మానేసిందని పేర్కొన్నారు. గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.420 కోట్లు అవసరమని అంచనా వేస్తే రూ.125 కోట్లు ఇస్తామని చెప్పి రూపాయి ఇవ్వలేదని పేర్కొన్నారు.
అనంతపురం విశ్వవిద్యాలయానికి రూ.470 కోట్లు అంచనా వేసి రూ.125 కోట్లు శాంక్షన్ చేశారని, ఒక్క రూపాయి ఇవ్వలేదని తెలిపారు. అక్కడ కనీస సదుపాయాలు లేక ఆడపిల్లలకు భద్రత లేక ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి వచ్చినా వైసిపి, టిడిపి ఎంపిలకు చీమకుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. 25 మంది పార్లమెంటు సభ్యులను ఇస్తే కేంద్రం మెడలు వంచుతామని, తోలుతీస్తామని ఉత్తర కుమార ప్రగల్బాలు పలికిన వైసిపి నాయకులు ఇప్పుడు నోరుమూసుకుని మోడీ ముందు మొకరిల్లారని విమర్శించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కుకింగ్‌కోల్ రాకుండా అదానీ ఆపేశారని, దీనివల్ల స్టీలు ప్యాక్టరీలో ఉత్పత్తి ఆగిపోతోందన్నారు. రోజుకు 11 వేల టన్నుల కోల్ కావాల్సి ఉంటే ప్రస్తుతం రెండువేల టన్నులు మాత్రమే అందుబాటులో ఉందని ఇంత నష్టం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. విశాఖ స్టీలు ప్లాంటును ఏమి చేయాలనుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. విశాఖ ఉక్కుకోసం పెట్టిన గంగవరం పోర్టును అదానీ స్వాధీనం చేసుకుని నష్టం చేస్తుంటే వైసిపి ప్రభుత్వం ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. ఇన్ని ఇబ్బందులు పెడుతున్న గంగవరం పోర్టును జాతీయం చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.
కేంద్రం విషయంలో రాష్ట్రంలోని వైసిపి, టిడిపి అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా సిపిఎం ఆధ్వర్యాన 31వతేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 30 వేలమంది మహిళలు అదృశ్యం అయ్యారని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా లెక్కలు చెప్పిందని, వీరిలో సుమారు 8000 మంది బాలికలు అదృశ్యం అయ్యారని పేర్కొనడం
ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ ప్రకటన ల్యాండ్‌మైన్ పేల్చినట్లు ఉందని, దీనిపై మహిళా కమిషన్ ఏమి చేస్తోందని ప్రశ్నించారు. ఈ విషయమై సిట్టింగ్ జడ్జితో వెంటనే విచారణ చేయించాలని కోరారు. సచివాలయ మహిళా సెక్రటరీలను మహిళల సంరక్షణ, వారి భద్రత కోసం ఉపయోగించాలన్నారు. గోదావరి ముంపు ప్రకృతి సిద్ధమైనది కాదని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఏర్పడుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే అక్కడ 32 మీటర్ల ఎత్తున వరద ఉందని, 36 మీటర్లకు చేరితే నాలుగు మండలాల పరిధిలో గ్రామాలన్నీ ముంపునకు గురవుతాయని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తక్షణం ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని తరలించి రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం నిధులన్నీ యథావిధిగా పంచాయతీలకు ఇవ్వాలని, మైనర్ పంచాయతీల బకాయిలు రద్దు చేయాలని డిమాండు చేశారు.










