Sep 21,2022 10:53

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : ప్రజలపై బిజెపి ప్రభుత్వ దాడులను ప్రతిఘటించే క్రమంలో సిపిఎం తలపెట్టిన దేశరక్షణ భేరికి సంబంధించిన పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం మద్దిలపాలెం లోని సిపిఎం నగర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గు నాయుడు మాట్లాడుతూ ... కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రజలపై ఎడాపెడా దాడులు చేస్తోందని అన్నారు. వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, జిఎస్టి భారీగా పెంచిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేస్తోందని దుయ్యబట్టారు. నిరుద్యోగాన్ని పెంచుతోందని, నూతన విద్యా విధానంతో పేదలకు విద్యను దూరంచేస్తోందని ధ్వజమెత్తారు. కార్మిక చట్టాలపై వేటు వేసిందన్నారు. ప్రజల సంపదను అదానీ, అంబానీ వంటి బడా కార్పొరేట్లకు దోచిపెడుతోందని మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులను హరిస్తోందన్నారు. భారత రాజ్యాంగంపై దాడిని తీవ్రం చేసిందని విమర్శించారు. వైసిపి ప్రభుత్వం కరెంటు, ఆర్టిసి ఛార్జీలు, ఆస్తి పన్ను, చెత్తపన్నులు పెంచి బిజెపికి తోడయ్యిందని, ఆదాయాలు తగ్గి భారాలు పెరిగి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ఆరోపించారు. బిజెపి, వైసిపి పాలకులు ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, మోడీ ప్రభుత్వం నుండి దేశ ప్రజలను, దేశాన్ని కాపాడుకోవడం కోసం సిపిఎం సెప్టెంబరు 14 నుండి 27 వరకు దేశ రక్షణ భేరి నిర్వహిస్తోందని తెలిపారు. దీని ముగింపు కార్యక్రమం సెప్టెంబర్‌ 27న మధ్యాహ్నం 3 గంటలకు సరస్వతి పార్కు నుండి ఆర్టీసి కాంప్లెక్స్‌ వరకు మహా ప్రదర్శన, అనంతరం సభ నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఈ సభకి ముఖ్యవక్తగా సిపిఎం పొలిట్‌ భ్యురో సభ్యులు బివి.రాఘవులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో విశాఖ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గనాలని సిపిఎం విశాఖ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తున్నదని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వర్గసభ్యులు ఆర్కేఎస్వీ కుమార్‌, కార్యదర్శి వర్గసభ్యులు 78వ వార్డ్‌ కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగరావు, జిల్లా కమిటీ మెంబర్‌ కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.