ప్రజాశక్తి-కాకినాడ : కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా, అధిక ధరలు, నిరుద్యోగం, విద్యుత్ చార్జీల భారాలకు వ్యతిరేకంగా సిపిఎం నిర్వహిస్తున్న సమరభేరి ప్రచారం ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో కాకినాడ లోమెయిన్ రోడ్ మార్కెట్ లో నిర్వహించారు. మార్కెట్ కు వచ్చిన ప్రజలు సిపిఎం ప్రచారాన్ని ఆదరిస్తూ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ.. మోడీ అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ ఆచరణలో అమలు చేయలేదు సరికదా ఉన్న ఉపాధిని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆదాయాలు అంతంతమాత్రంగా ఉంటే నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఉపయోగించిన విద్యుత్ కంటే బిల్లులలో రకరకాల చార్జీల పేరుతో భారాలు వేస్తున్నారని విమర్శించారు. అలాగే మోడీ ప్రభుత్వ షరతులకు లోబడి స్మార్ట్ మీటర్లు ఏర్పాటుకు సిద్ధమవుతున్నారని ప్రజలంతా వ్యతిరేకించాలన్నారు. సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు కాకినాడ అర్బన్ తహశీల్దార్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయాలని కోరారు. సిపిఎం నగర కమిటీ సభ్యులు కె.సత్తిరాజు మాట్లాడుతూ.. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి 14 రకాల సరుకులు రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలన్నారు. 400 రూపాటలకే గ్యాస్ సిలిండర్ అందించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దుంపల ప్రసాద్, కె.నాగజ్యోతి, సిహెచ్.సతీష్, సూరిబాబు, ఆదర్శ్, జయరాం తదితరులు పాల్గొన్నారు.










