
గ్రంథకర్త, వ్యాకరణవేత్త, నిఘంటు నిర్మాత, తెనుగు భాషాపోషక ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ...డేవిడ్ బ్రౌన్ - కౌలే దంపతులకు కలకత్తాలో (10.11.1798) జన్మించాడు. కలకత్తాలో తను చదువుకున్న విద్యా సంస్థతోపాటు తండ్రి ప్రోత్సాహంతో గ్రీకు, లాటిన్, సిరియన్, అరబిక్, పారసీ, హిందుస్థానీ ప్రత్యేకించి స్థానిక భాషా పండితుల ద్వారా సంస్కృత భాషను నేర్చుకున్నాడు. అమూల్య గ్రంథ సేకరణ, పరిష్కరణ, పాఠాంతరాలను గుర్తించటం లాంటివి తన తండ్రి నుంచి నేర్చుకున్నాడు.
తండ్రి మరణించటంతో (1812 జూన్ 14న) బ్రౌన్ కుటుంబం లండన్ చేరుకుంది. ఐతే ఈస్టిండియా కొలువులో ఉండి మరణించిన వారి పిల్లలను సర్వీసులలో చేర్చుకొని ఉద్యోగాలు ఇవ్వటం కంపెనీ నియమం. అలా సి.పి. బ్రౌన్‌ని మద్రాసుకు, అతని సోదరుని బెంగాల్‌కు పంపింది ఈస్టిండియా కంపెనీ. బ్రౌన్ అక్కడ ఫోర్టు సెయింట్ జార్జి కాలేజిలో చేరాడు. వెలగపూడి కోదండరామ పంతులు గారి దగ్గర తెలుగు అక్షరాభ్యాసం చేశాడు. కాలేజి నియమం ప్రకారం ఏదైనా రెండు దక్షిణ భారతదేశ భాషలు నేర్చుకోవాలి. బ్రౌను తెలుగును, హిందుస్థానీని ఎంచుకున్నాడు.
సివిల్ సర్వీసు శిక్షణానంతరం ఇరవయ్యేళ్ళ ప్రాయంలో కడప అసిస్టెంటు కలెక్టరుగా (1820 ఆగష్టులో) ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు బ్రౌను. కడప కలెక్టరు హన్‌బరికీ తెలుగులో అనర్గళ వాక్పటిమ ఉంది. అతనిని మించి పోవాలనే కోరికతో బ్రౌను తెలుగు నేర్చుకోవటం ప్రారంభించాడు. కోర్టులోని వాదులు-ప్రతివాదులు, నేరస్తులు, పరిచారకులు తనకు పరోక్ష గురువులని బ్రౌను తన ఆత్మకథలో రాసుకున్నాడు. 1822, అక్టోబరు 22న బ్రౌను మచిలీపట్నం జిల్లా కోర్టుకు రిజిస్టారుగా బదిలీ అయ్యారు. కడపలో వలే మచిలీపట్నంలో కూడా రెండు ధర్మ బడులు స్థాపించి విద్యార్థులకు తెలుగు, హిందుస్థానీ, పారసీ భాషలు నేర్పించాడు. స్వయంగా బెంగాలీ వ్యాకరణం, సంస్కృత సాహిత్య పఠనం చేసేవాడు. బ్రౌన్ ఇంటిని 'బ్రౌన్ కాలేజి' అనేవారనీ, అది ఎప్పుడూ పండితులతో, పరిష్కర్తలతో, లేఖకులతో, దుబాసీలతో వెలిగిపోయిందని ప్రఖ్యాత పరిశోధకుడు బంగోరె పేర్కొన్నారు.
ఫ్రెంచి మతగురువు అబే దుబారు (1770-1848) రచించిన ''హిందూ మేనర్స్, కస్టమ్స్ అండ్ సెరిమనీస్'' అనే గ్రంథం చదివినప్పుడు బ్రౌన్ తొలిసారిగా వేమన గురించి తెలుసుకున్నాడు. వేమన 17వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి అని, తాను పనిచేసిన కడప ప్రాంతం వాడేనని తెలిసి, సంతోషించి వేమన పద్యాల సేకరణ మొదలు పెట్టాడు. మిత్రులు, శ్రేయోభిలాషులెందరో బ్రౌనుకు తోడ్పడ్డారు. 1824లో వేమన పద్యాలను బ్రౌను ఆంగ్లం లోనికి అనువదించి స్వంత ఖర్చులతో ముద్రించాడు.
రాజమండ్రి కలెక్టరుకు హెడ్ అసిస్టెంట్ మేజిస్ట్రేట్‌గా బ్రౌను 1825లో చేరాడు. అక్కడే ఆంధ్ర మహా భారతం చదివి ఆకళింప చేసుకున్నాడు. ఆంధ్ర, గీర్వాణ ఛందో రీతులను వివరిస్తూ బ్రౌను ఒక గ్రంథాన్ని రాశాడు. 1829లో 16000 పదాలతో నిఘంటువును పూర్తిచేశాడు. శ్యామ్యూల్ జాన్సన్ ఇంగ్లీషు నిఘంటువును తెలుగులోకి తర్జుమా ప్రారంభించాడు. 1841లో బ్రౌను మద్రాసు యాక్టింగ్ పోస్టుమాస్టర్ జనరల్‌గాను, అనంతరం మద్రాసు యూనివర్సిటీ బోర్డు సభ్యునిగాను, మద్రాసు కాలేజి లిఖిత పుస్తకాల గ్రంథాలయానికి క్యూరేటర్‌గా పనిచేశాడు. ప్రభుత్వ ఉద్యోగిగా తెలుగు, హిందుస్థానీ భాషల నుంచి ఇంగ్లీషు లోకి, ఇంగ్లీషు నుండి ఆయా భాషల్లోకి అనువదించాడు.
మద్రాసు లిటరరీ సొసైటీ వారికి 1845లో తన సొంత గ్రంథాలయం నుండి 2,440 రాతపత్రులను బహూకరించాడు. బ్రౌను ఇచ్చిన గ్రంథాలే మద్రాసు ఓరియంటల్ మేన్యుస్క్రిప్టు లైబ్రెరీకి మూలాధారాలు. మద్రాసులో ఉన్నప్పుడు శిథిలమౌతున్న వేలాది కైఫీయత్తులను దళసరి కాగితంపై శుద్ధప్రతులుగా సొంత ఖర్చులతో కాపీ చేయించి - చరిత్ర రచనకు ఎంతగానో తోడ్పడ్డాడు. మద్రాసు రాష్ట్రాల్లో చెందిన జ్యుడీషియల్ రెవిన్యూ పదాలను వేలాదిగా సేకరించి లండన్ కోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల కోరిక మేరకు జిల్లా డిక్షనరీని ప్రచురించాడు. 1854లో అనారోగ్య కారణంగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి లండన్ వెళ్ళిపోయాడు. లండన్‌లో కూడా అవిశ్రాంతంగా భాషాసేవ కొనసాగించాడు. 1863లో కర్నాటక క్రోనాలజీని ప్రచురించాడు. 1865లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్ అయ్యాడు. అమూల్యమైన తాళపత్ర గ్రంథాలను సేకరించి, పరిష్కరించి తిరగ రాయించి ముద్రించాడు.
పండితులను గ్రామాలకు పంపి, గ్రంథసేకరణ చేయించి, పరిష్కరించి ప్రచురించాడు. దాదాపు 36 పురాణేతిహాస గ్రంథాలను, 80 శతకాలను సేకరించినట్లు తెలుస్తున్నది. ఆంధ్రులకు ప్రీతిపాత్రమైన మను, వసు చరిత్రలకు మొదటగా వ్యాఖ్యానం రాయించి ప్రచురించిన కీర్తి బ్రౌనుకే దక్కుతుంది. బ్రౌనుకు అజరామరమైన కీర్తిని తెచ్చిపెట్టింది వారు రచించిన నిఘంటువే. బ్రౌన్ కంటే ముందు ఎ.డి. కాంబెల్, మారిన్, మామిడి వెంకయ్యలు తెలుగులో నిఘంటువులు సమకూర్చినా...పండిత పామర ప్రశంసలు పొందిన నిఘంటువు బ్రౌను నిఘంటువే. తెలుగు భాషకు బ్రౌను చేసిన సేవ అమూల్యం, అనిర్వచనీయం. నేడు సి.పి.బ్రౌన్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించటం, వారి భాషా సేవకు కృతజ్ఞతలు తెల్పటం తెలుగు వారి కర్తవ్యం.
- కె. జోసఫ్, అధ్యాపకులు, సెల్: 79954 95154