- చేయూత కింద ఉపాధిని ప్రోత్సహించాలి
- 10న మహిళలకు సున్నావడ్డీ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం విశిష్టమైందని, ప్రతి గ్రామంలోనూ సర్వేయర్‌ను నియమించడం ద్వారా ఈ ప్రాజెక్టు సజావుగా ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖలపై ముఖ్యమంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. అధికారులు భూ సమగ్ర సర్వేపైనా, డిజిటల్ లైబ్రరీలపైనా దృష్టి సారించాలని అన్నారు. గ్రామీణాభివృద్ధిశాఖ కింద చేపట్టే కార్యక్రమాలపై నిరంతరం సమీక్ష నిర్వహించాలని, పనితీరుపై మదింపు చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. నివేదిక ఆధారంగా యూనిట్లు విజయవంతంగా నడిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్వయం ఉపాధి కార్యక్రమాల్లో మహిళలకు చేయూతనిచ్చి నడిపించడం కీలకమని తెలిపారు. ఆగస్టు 10న మహిళలకు సున్నావడ్డీ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. 10,943 గ్రామాల్లో ఇప్పటికే డ్రోన్ సర్వే పూర్తయిందని, సర్వే హక్కు పత్రాలు ఇస్తున్నామని అధికారులు సిఎం దృష్టికి తీసుకెళ్లగా, జగనన్న కాలనీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, మౌలిక సదుపాయాల నుంచి అన్ని అంశాలపైనా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సదుపాయాల కల్పన విషయంలో రాజీపడొద్దని తెలిపారు. జులై నెలలో గ్రామాల్లో 62,99,393 పెన్షస్లు ఇస్తున్నామని, దీనికిగాను నెలకు రూ.1,735 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. వైఎస్‌ఆర్ ఆసరా కింద ఇప్పటివరకు రూ.19,178 కోట్లు ఖర్చు చేశామని, సున్నావడ్డీ కింద రూ.4,969 కోట్లు, చేయూత కింద మూడేళ్లలో రూ.14,129 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 13 లక్షల మందికి జీవనోపాధి కల్పించినట్లు పేర్కొన్నారు. చేయూత కింద ఇస్తున్న నిధులను స్వయం ఉపాధి కోసం ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. అనంతరం మహిళా మార్టులపై అధికారులు సిఎంకు నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలో 36 మహిళా మార్టులు ఏర్పాటు చేయగా, రూ.32.44 కోట్ల వ్యాపారం జరిగిందని వివరించారు. వారికి జగనన్నతోడు పథకం ప్రయోజనాలు వర్తింపజేయాలని అధికారులకు సిఎం సూచించారు. మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, స్త్రీనిధి కింద ఇచ్చే రుణాలకు వడ్డీ తొమ్మిది శాతానికి పరిమితం చేసేలా చూడాలని సిఎం ఆదేశించారు. మహిళలు గొంతుకలేని వర్గానికి చెందిన వారని, వారి తరపున అధికారులే బ్యాంకర్లతో మాట్లాడాలని సిఎం సూచించారు.
- 18.90 కోట్ల పనిదినాలు
జాతీయ ఉపాధి హామీ పథకంపై అధికారులు సిఎంకు వివరాలు అందించారు. ఈ ఏడాది 24 కోట్ల పనిదినాలు లక్ష్యం పెట్టుకోగా 18.90 కోట్ల పనిదినాలు పూర్తి చేశామని సిఎంకు తెలిపారు. జాతీయ స్థాయిలో రాష్ట్రం ఉత్తమ పనితీరు కనబరిచిందని, మొత్తంగా రూ.9,600 కోట్లు ఖర్చు చేయనున్నామని, వాటిల్లో వేతనాల కింద రూ.2,840 కోట్లు ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు.










