అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి గాలికొదిలేశారని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. టిడిపి హయాంలో పేదల కోసం నిర్మించిన 3.13లక్షల ఇళ్లను వైసిపి ప్రభుత్వం శిథిలావస్థకు తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల పేరిట వేల కోట్ల అవినీతి చేశారని ఆరోపించారు.''పేదల సొంతింటి కలను టిడిపి చేసి చూపిస్తే, వైసిపి ప్రభుత్వం కలగానే మిగిల్చింది. 2019లో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ఉంటే 3.13లక్షల టిడ్కో ఇళ్లతో పాటు ప్రతీ పేదవాడికి సొంతిల్లు దక్కేది. టిడిపి ప్రభుత్వం 90శాతం వరకూ పూర్తిచేసిన టిడ్కో ఇళ్లను నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డిని ప్రజలంతా ద్వేషిస్తున్నారు. వైసిపి రంగులేసుకున్న టిడ్కో ఇళ్లకు చెదలు పడుతున్నా, ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. సెంటు పట్టా పేరుతో వైసిపి దోచుకున్న 7వేల కోట్ల వివరాలు ఇప్పటికే ఆధారాలతో బయట పెట్టాం'' అని బొండా ఉమ తెలిపారు.










