ప్రజాశక్తి-అమరావతి : కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 12 మంది దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఓ కారు వేగంగా వచ్చి ఢకొీట్టింది. ఆ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... మరో 8 మంది ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. ఈ ఘోర ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన ప్రయాణికులు దుర్మరణం చెందడం ఎంతో కలచివేసిందన్నారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని అన్నారు. ప్రమాదంలో గాయపడి విషమంగా ఉన్న మరో వ్యక్తికి మెరుగైన వైద్యం అందేలా చేస్తున్నామని వెల్లడించారు.










