
విజయవాడ : అధికారం చేపట్టిన వారం రోజుల్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పిన జగన్ మాట తప్పి మోసం చేశారని ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితుల ఆక్రందన సభ విజయవాడలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ''అధికారం చేపట్టిన వారం రోజుల్లో బాధితులకు న్యాయం చేస్తామని జగన్ ఇచ్చిన హామీ మర్చిపోయారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్ చేసి వారి ఆధీనంలో ఉంచుకున్నారు. వాటిని విడిపించి బాధితులకు ఎందుకు ఇవ్వరు. మోసం చేసిన వారికి సీఎం జగన్ పది సార్లు అపాయింట్‌మెంట్ ఇస్తారా? బాధితుల పక్షాన మేము వెళితే కలవరా? ఇదేనా మాట తప్పం, మడమ తిప్పం అంటే?. మోసం చేసిన వాడు దర్జాగా తిరుగుతున్నాడు. మోసపోయినవారు కాలిన కడుపులతో కన్నీరు పెడుతున్నారు. సీఎస్ అధ్యక్షతన వేసిన కమిటీ ఏం చేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాము '' అని ముప్పాళ్ల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి బాధితులు హాజరయ్యారు.