Nov 09,2022 14:35

అమరావతి: నకిలీ ఎన్‌ఓసీ సమర్పించి 0.16 సెంట్ల జలవనరుల శాఖ భూమిని కబ్జా చేశారంటూ టిడిపి నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై సీఐడీ అధికారులు దర్యాప్తు కొనసాగించొచ్చని ఎపి హైకోర్టు తెలిపింది.వివరాల్లోకి వెళితే..తనపౖౖె నమోదు చేసిన భూఆక్రమణ కేసును కొట్టివేయాలంటూ అయ్యన్న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై బుధవారం ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది.
అయ్యన్నపై కావాలనే సెక్షన్‌ 467 నమోదు చేశారని, అసలు ఈ కేసులో సెక్షన్‌ 467 చెల్లదని విచారణ సందర్భంగా అయ్యన్న తరపు న్యాయవాది కోర్టు దఅష్టికి తీసుకెళ్లారు. కావాలని ఫోర్జరీ చేశారని, దీనిపై ఈఈ ఫిర్యాదు చేస్తే ఆయనను భయపెట్టడం, బెదిరించడం లాంటివి చేసినందున సెక్షన్‌ 467 వర్తిస్తుందని సీఐడీ తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించి అయ్యన్నపై నమోదైన కేసులో సెక్షన్‌ 467 వర్తించదని స్పష్టం చేసింది. సీఆర్‌పీసీ నిబంధనల ప్రకారం 41ఏ కింద నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. అయ్యన్నపై సీఐడీ దర్యాప్తు కొనసాగించుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది.