Sep 24,2022 12:31

విజయవాడ : సిపిఎం ఆధ్వర్యంలో ' దేశ రక్షణ భేరి ' భారీ బహిరంగ సభ శనివారం విజయవాడలోని జింఖానా మైదానంలో ప్రారంభమైంది. సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబురావు మాట్లాడుతూ ... బిజెపి ప్రజా వ్యతిరేక విధానాల నుండి దేశ ప్రజలను రక్షించేందుకు సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు గత 10 రోజుల నుండి ప్రచారాందోళన జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దేశ రక్షణ భేరి పాదయాత్రలు, ఆందోళనలు, ప్రచార కార్యక్రమాలు, ఇంటింటికి ప్రచారం వంటి కార్యక్రమాలు గత కొద్దిరోజులుగా జరిగాయన్నారు. పలుచోట్ల భారీ బహిరంగ సభలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజలను చైతన్యవంతం చేసి, బిజెపి ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టడానికి, ప్రజల రక్షణ కోసం దేశ రక్షణ భేరి ఉద్యమాన్ని చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను అడ్డుకొని ప్రజా ప్రయోజనాలను కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వైసిపి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి కేంద్రానికి దాసోహం అంటున్నాయని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం 75 సంవత్సరాల స్వాతంత్య్ర ఉత్సవాలను జరిపి అభివృద్ధి సాధించామని చెబుతోందని.. బిజెపి ఏం అభివృద్ధి సాధించిందో చెప్పాలి ? అని ప్రశ్నించారు. అభివృద్ధి అంటే ధరలలో, పన్నుల్లోనే జరిగిందని ఎద్దేవా చేశారు. ప్రజలకు కష్టాలు పెరిగాయని, వారిపై దాడులు పెరిగాయని అన్నారు. మతోన్మాదం పెరిగిందన్నారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే విద్వేష రాజకీయాలు పెరిగాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశంలో అప్పులు పెరిగాయని అన్నారు. రాష్ట్రంలోనూ అప్పుల భారం పెరిగిందన్నారు. అధిక ధరలు, పన్నుల భారాలు, కార్మికులపై పని భారం దేశవ్యాప్తంగా పెరిగిందన్నారు. ఈ దేశంలో పెరగకుండా ఆగిపోయిందేదైనా ఉందా అంటే.. ప్రజల ఆదాయం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక వేతనాలు పెరగలేదని అన్నారు. ఆత్మహత్యలు పెరిగాయన్నారు. ప్రజలకు ఉపాధి కరువయ్యిందన్నారు. మరోవైపు నిరుద్యోగం పెరిగిందన్నారు. ఉపాధి తగ్గుతోందన్నారు. గ్యాస్‌ రేట్లను పెంచి మంట రగిల్చారన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమం మొదలుకొని బెజవాడ రైల్వే స్టేషన్‌ వరకు అన్నిటినీ ప్రైవేటుపరం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు ప్రజల మధ్య మత చిచ్చు రేపి, విద్వేషాలను రగిల్చి ప్రజల సమైక్యతపై దాడి చేస్తూ.. పౌరహక్కులపై దాడి చేస్తూ... ఫెడరిలిజంపై దాడి చేస్తూ... రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూడా ప్రజల వ్యతిరేక చర్యలే చేపడుతున్నారని ఆరోపించారు. బిజెపి ప్రారంభించిన ప్రజాపోరు ప్రజలపైపోరు అని ఎద్దేవా చేశారు. ప్రజలపై ధరల యుద్ధం, పన్నుల యుద్ధం చేస్తున్నారని అన్నారు. పౌరహక్కులను హరించి నిరంకుశం అనే యుద్ధం చేస్తున్నారని అన్నారు. ఫెడరిలిజంపై దాడి చేస్తున్నారని అన్నారు. అమరావతిని విచ్ఛిన్నం చేస్తున్న జగన్‌ ప్రభుత్వానికి మోడీ రక్షణగా నిలబడ్డారని నిప్పులు చెరిగారు. అమరావతితోపాటు వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అంతా ఎదుర్కోవాలని సిహెచ్‌.బాబూరావు పిలుపునిచ్చారు.