Jun 29,2023 06:36

ఈ నెల 11వ తేదీన ఆంధ్రజ్యోతిలో చెరుకూరి సత్యనారాయణ గారు రాసిన వ్యాసం చదివాక ఇలా రాయవలసి వచ్చింది. కమ్యూనిస్టు ఉద్యమాల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను, పిల్లలను కమ్యూనిస్టులు పట్టించుకోవటం లేదంటూ చేసిన తీవ్ర ఆరోపణలు నన్ను ఎంతో బాధించాయి. శ్రీకాకుళం గిరిజనోద్యమంలో మా అమ్మా, నాన్నలు పంచాది నిర్మల, పంచాది కృష్ణమూర్తి అమరులయ్యారు. నాకు ఐదేళ్లు నిండగానే మా నాన్నను 1969 మే 27న ఆ నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పోలీసులతో కాల్పించింది. ఆ తరువాత కొద్ది వారాల తరువాత మా అమ్మ నన్ను, మా తమ్ముడ్ని మా తాతగారి ఇంటివద్ద ఉంచి తిరిగి ఉద్యమంలో పాల్గొనడానికి వెళ్లింది. పోలీసులు ఆమెను అదే ఏడాది డిసెంబర్‌ 22న పొట్టనబెట్టుకున్నారు. అప్పటికి మా తమ్ముడు ఏడాది బాలుడు. మాలాగే ఇంకెంతో మంది తల్లిదండ్రు లిద్దరినీ లేదా ఏ ఒకరినో కోల్పోయినవారున్నారు. తల్లిదండ్రులను, ఎదిగిన బిడ్డలను కోల్పోయిన వారి బాధ, ఆవేదన వర్ణనాతీతం. ఎవరూ తీర్చలేనిది, పూడ్చలేనిది కూడా.
అయితే అటువంటి బిడ్డలను, ఆ యా కుటుంబాలనూ కమ్యూనిస్టు పార్టీలు పట్టించుకోవ టంలేదని నిందించడం ఎంతవరకు సబబు? నా వరకు నా అనుభవం చూస్తే ఇది పనిగట్టుకొని కమ్యూనిస్టు పార్టీలపై అక్కసు వెళ్లగక్కే ప్రయత్నం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 1962 నుండి 1978 వరకు కమ్యూనిస్టులకు గడ్డురోజులే. కమ్యూనిస్టు ఉద్యమం రెండు సార్లు నిలువునా చీలిపోయిన కాలమది. నగ్జలైట్‌ ఉద్యమ అణచివేత పేరిట 1969-71 మధ్య ప్రభుత్వం వారిపై తీవ్ర నిర్బంధం ప్రయోగించింది. ఎమర్జెన్సీ కాలంలో కేవలం కమ్యూనిస్టులేగాక యావత్‌ ప్రజాతంత్ర శక్తులకూ రాష్ట్రం ఓ బందిఖానాలా మారింది. 1969-71 మధ్య దొరికినవారిని దొరికినట్టుగా కొండల్లోకి అడవుల్లోకి తీసుకెళ్లి చెట్లకు కట్టి మరీ కాల్చివేయించింది. వేలాదిమందిని జైళ్లల్లో కుక్కింది. సమాజంలో స్వేచ్ఛగా తిరగలేని అతి క్లిష్టమైన పరిస్థితులను ఆ నాడు కమ్యూనిస్టులు ఎదుర్కొన్న సంగతి అందరికీ తెలిసినదే.
అట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణాలను కోల్పోయిన తమ సహచరుల కుటుంబాలకు, పిల్లలకు చేయూతనందించాలని చాలామంది కమ్యూనిస్టు నేతలు కృషి చేశారు. కామ్రేడ్‌ తరిమెల నాగిరెడ్డి గారు, మరికొంతమంది నేతలు (నాకు పేర్లు గుర్తులేవు) అజ్ఞాతవాసంలో ఉంటూ కూడా మా వివరాలు తెలుసుకొని మమ్మల్ని కలవాలనుకున్నారట. కొరియర్‌ నన్ను ఒరిస్సా లోని ఒక రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ నన్ను చూసి మా గురించిన వివరాలన్నీ తెలుసుకొని మేము మా తాతగారింట్లో క్షేమంగా ఉన్నామని తెలిశాక కుదుటపడ్డారు. కామ్రేడ్‌ చౌదరి తేజేశ్వరరావు, సంపూర్ణమ్మలు జైలులో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు మా సమాచారం తెలుసుకునేవారు. పెరోల్‌పై వచ్చిన సందర్భంలో కూడా సంపూర్ణమ్మ నన్ను కలిసేవారు. కావలసిన వస్తువులు కొనిచ్చేవారు. ఒకసారైతే విశాఖపట్నం తీసుకుపోయి 'మా భూమి' సినిమా చూపించారు. తేజేశ్వరరావు గారు జైలు నుంచి విడుదలయ్యాక శ్రీకాకుళంలో వారింట్లో ఉంచి నన్ను డిగ్రీ చదివించి అండగా నిలిచారు. ఆ సమయంలో మా గురించి తెలుసుకున్న కామ్రేడ్‌ ఎల్‌.బి.గంగాధరరావు గారు (ఆనాటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి), కామ్రేడ్‌ డి.బిక్షావతి గారు (రాష్ట్ర మహిళా నాయకురాలు) మాకు బట్టలు పంపించారు.
మా తమ్ముడు పంచాది ప్రభాకరరావు (విశ్వం) గుండె జబ్బుకు గురయ్యాడు. ఒక వాల్వు పూర్తిగా పాడయింది. ఆ పరిస్థితుల్లో వాల్వు మార్పిడి కోసం ఆనాడు సిపిఎం ప్రకాశం జిల్లా కార్యదర్శిగా ఉన్న కామ్రేడ్‌ తవనం చెంచయ్య గారు చాలా కృషి చేశారు. కేర్‌ హాస్పటల్‌ సర్జన్‌ డాక్టర్‌ ప్రసాదరావు గారితో మాట్లాడి 1999లో ఉచితంగా వాల్వు మార్పిడి, బైపాస్‌ శస్త్ర చికిత్స చేయించారు. ఆయన ఎంతో నాణ్యమైన విదేశీ వాల్వును అమర్చారు. మా వద్ద డైట్‌ చార్జీలు మినహా హాస్పటల్‌కు సంబంధించిన ఖర్చులేవీ లేకుండా ఉచితంగానే చేశారు. పార్వతీపురం కుట్ర కేసు వాదించిన ప్రముఖ న్యాయవాది పి.ఎల్‌ నాయుడు గారు (విశాఖపట్నం) మా చిన్నతనంలో మా తమ్ముడిని పెంచుకుని బాగా చదివిస్తానని అడిగారట (అందుకు మా తాతగారు, ఇతర కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.). నా చిన్నతనంలో పెరిగిన బొడ్డపాడు గ్రామస్తులు ఇప్పటికీ నన్ను (వారు ఏ గ్రూపులు, పార్టీలకు చెందినవారైనా) వారి బిడ్డగా చూసుకుంటారు. మా పెళ్లికి బట్టలు కూడా పెట్టారు. నేను రాష్ట్ర కేంద్రంలో సిపిఎం కార్యకర్తగా చురుకుగా పని చేసిన సమయంలో వివిధ ఎం.ఎల్‌ పార్టీల రాష్ట్ర నాయకులు ముఖ్యంగా కోటయ్య గారు, సాంబశివరావు గారు, విజయకుమార్‌ గారు ఇలా చాలా మంది కలిసినపుడు మా యోగక్షేమాల గురించి ఎంతో ఆప్యాయంగా తెలుసుకునేవారు. ప్రత్యక్షంగా మాతో మాట్లాడకపోయినా ఆ యా సందర్భాల్లో మా గురించి ఫలానా జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు భోగట్టా చేశారని నేను కలిసినపుడు చాలామంది చెబుతుండేవారు. ఆ రకంగా మేమిద్దరం తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ చాలామంది కుటుంబ సభ్యుల మధ్య పెరిగాము. ఇప్పటికీ ఆ అనుబంధాలు, ఆప్యాయతలు కొనసాగుతున్నాయి. వారందరితో మాకు కమ్యూనిస్టు ఉద్యమం తప్ప ఇంకే రక్త సంబంధం ఉంది? అయితే అందరికీ మాలాంటి అనుభవాలే ఉండకపోవచ్చు. కష్ట సమయాల్లో కొందరికి ఏ సహాయమూ అందకపోవచ్చు. ఎన్నో ఇబ్బందులు పడివుండవచ్చు కూడా.
మాలాగే తల్లిదండ్రులను కోల్పోయిన చాలామందికి ఏదో ఒకరకంగా కమ్యూనిస్టు పార్టీలు, నాయకులు అండగా నిలిచారు..నిలుస్తున్నారు...నిలుస్తుంటారు. అయితే ఇవేవీ ఎవరూ బయటకు చెప్పరు. కాని ఆ వ్యాసం చూశాక నా అనుభవాలు కొన్నయినా చెప్పాల్సి వచ్చింది. ఎవరేమనుకున్నా కమ్యూనిస్టులు గొప్ప మానవతావాదులు. ఇది తిరుగులేని వాస్తవం.
మరో బాధాకరమైన విషయం కమ్యూనిస్టు పార్టీలను పాలకవర్గ పార్టీలతో పోల్చటం. నిరంతరం పేదల కోసం, ప్రజల సంక్షేమం కోసం తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడుతున్న త్యాగ చరిత్ర కమ్యూనిస్టు పార్టీలది. పాలకవర్గ పార్టీలు సంపన్నుల కొమ్ము కాస్తాయన్నది జగమెరిగిన సత్యం. ప్రజా ఉద్యమాలపై నిర్బంధం ప్రయోగించటం, ప్రజల హక్కులను కాలరాయటం పాలకవర్గ పార్టీల నిత్యకృత్యం. మహిళలని కూడా చూడకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ నడిబొడ్డున 2000 సంవత్సరంలో అంగన్‌వాడీ ఉద్యోగులను గుర్రాలతో తొక్కించిన పార్టీతో ఆ పాశవిక నిర్బంధానికి గురైన కమ్యూనిస్ట్టులను పోల్చటం సముచితమా? టిడిపి పట్ల ప్రేమాభిమానాలు, ఆ నాయకుల పట్ల గౌరవాన్ని వ్యక్తం చేయడానికి అనేక మార్గాలున్నాయి. అందుకోసం ఆ వ్యాస రచయిత కమ్యూనిస్టుల్ని నిందించడం తగునా?

roja

 

 

 

 

 

వ్యాసకర్త ఎ.పి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పూర్వ కార్యదర్శి, పంచాది రోజా
సెల్‌ : 9490098028 /