
దేశ వ్యాప్తంగా పటిష్టమైన మూఢ నమ్మకాల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని జన విజ్ఞాన వేదిక వంటి సైన్స్ ప్రచార సంస్థలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వాల నుండి ఆశించిన విధంగా సానుకూల స్పందన రావడం లేదు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లోనూ మూఢ నమ్మకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని చెప్పడంలో ఏ మాత్రమూ సందేహం లేదు.
సాక్షాత్తూ మంత్రిగా పనిచేసిన పాలేటి రామారావు తన మరణ తేదీని తానే నిర్ణయించుకుని, దానికి సంబంధించిన వేడుకలు ఘనంగా చేసుకోవాలని అందరికీ ఆహ్వాన పత్రాలు పంపడం, హైదరాబాద్ లో ఓ వ్యక్తి తన ఇంట్లోనే తన సమాధిని నిర్మించు కోవడం, ఇంకో మత ప్రభోధకుడు తాను జీవించి ఉండగానే సమాధి చేయమని అడగటం, ఏసుక్రీస్తులా తాను కూడా మూడవ రోజు తిరిగి సమాధి నుండి బయటకు వస్తానని చెప్పడం, తోడి కోడళ్ల హత్యకేసులో నాటువైద్యురాలి పాత్ర ఉండటం తదితర ఘటనలను పరిశీలిస్తే మూఢ నమ్మకాలు పరాకాష్టకు చేరాయని అనిపిస్తుంది. గతంలో బాబాలు, స్వామిజీలు, కొందరు మత ప్రచారకులు ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం అయ్యేవారు.ప్రజలకు కొంత వరకు నైతిక విలువలు కూడా బోధించేవారు. ఇప్పుడు వీరిలో కొందరు వివిధ వ్యవస్థల్లోకి జొరబడి ప్రత్యక్షంగా రాజకీయాలని శాసిస్తున్నారు. పాలకులు కూడా వీరిని తరచుగా కలుస్తున్నారు. టీవీల్లో ఇటువంటి వారి ప్రసంగాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇంకో వైపు భూత వైద్యం వంటి కోర్సులను కొన్ని విశ్వ విద్యాలయాల్లో ప్రవేశ పెడుతున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు కూడా వివిధ ఉపగ్రహాలను పంపించే సమయంలో దేవతలకు పూజలు చేస్తున్నారు.
ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతున్న మూఢ నమ్మకాలని నియంత్రణ చేయాలంటే పటిష్టమైన మూఢ నమ్మకాల నియంత్రణ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి. మూఢ నమ్మకాల గురించి పాఠ్యపుస్తకాలలో పొందుపరచాలి. వీటిపై అవగాహన తరగతులు నిర్వహించాలి.నమ్మకానికి, మూఢ నమ్మకానికి మధ్య తేడా ఉంటుంది. దైవాన్ని నమ్మేవారు కూడా మానవ ప్రయత్నం ద్వారానే వివిధ కార్యకలాపాలు సజావుగా జరుగుతాయని విశ్వసించి పని చేస్తారు. అయితే తరచుగా సరైన కార్యాచరణ లేకపోవడంతో వివిధ పనుల్లో విఫలమైన కొందరు సులభ మార్గాలని ఎంచుకుంటారు. ఈ క్రమంలో వారు మూఢ నమ్మకాలని ఆశ్రయిస్తారు. అలాగే వివిధ ఆర్ధిక,కుటుంబ,సామాజిక సమస్యలతో బాధపడే వారు కూడా ఉపశమనం కోసం మూఢ నమ్మకాలని ఆశ్రయిస్తారు. ఈ క్రమంలో వారు మరింతగా నష్టపోతున్నారు.
దైవాన్ని నమ్మడం, వివిధ సంప్రదాయాలని, ఆచారాలని పాటించడం, తీర్ధయాత్రలు చేసుకోవడం, పండుగలను జరుపుకోవడం వంటివి ప్రజలకు మత స్వాతంత్య్రపు హక్కులో భాగంగా వస్తాయి. ఆ మేరకు వారికి రాజ్యాంగ పరమైన రక్షణ కూడా ఉంటుంది. కానీ వివిధ పండుగల పేరుతో శబ్ద తాము నమ్మిన భావజాలాన్ని ఎదుటి వారిపై బలవంతంగా రుద్దటం, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసే వారిపై దాడులు చేసేందుకు ప్రయత్నం చేయడం వంటివి సరైన చర్యలు అనిపించుకోవు. మూఢ నమ్మకాల నియంత్రణ కు పటిష్టమైన చట్టాలతో పాటు, ప్రజల్లో చైతన్యం పెంచడానికి నిరంతరం కార్యక్రమాలు చేపట్టాలి.అయితే దైవం,మతం వంటి విషయాలు సున్నితమైన విషయాలుగా మారిన ప్రస్తుత కాలంలో సైన్స్ వాదులు, నాస్తికులు తాము చెప్పే విషయాల పట్ల కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ప్రసంగాలలో ఎక్కడా కూడా అవహేళన, ఎగతాళి చేసే మాటలు లేకుండా చూసుకోవాలి. అలాగే ప్రజలు ఎదుర్కొనే వివిధ సమస్యలకు ప్రభుత్వాలు సరైన పరిష్కార మార్గాలు చూపించాలి. మూఢ నమ్మకాల నియంత్రణ కోసం దీర్ఘకాలిక ఉమ్మడి కృషి అవసరమని అందరూ గుర్తించాలి.అప్పుడే ప్రజలు మూఢ నమ్మకాల ప్రవాహంలో కొట్టుకొని పోకుండా ఉంటారు.
-యం. రాం ప్రదీప్, తిరువూరు
9492712836