Oct 05,2023 20:34

సినిమాపై ఆసక్తితో పరిశ్రమకు వచ్చి అవకాశాల వేటలో ఉన్న ఆర్టిస్ట్‌లను లక్ష్యం చేసుకుని జరుగుతున్న మోసాలపై నటుడు బ్రహ్మాజీ ట్వీట్లు చేశారు. తాము స్టార్‌ దర్శకుల వద్ద పని చేస్తున్నామంటూ కొందరు వ్యక్తులు యువ నటులకు మెసేజ్‌లు పంపిస్తున్నారని, ఆ వంకతో డబ్బు గుంజాలని చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో తస్మాత జాగ్రత్త అని బ్రహ్మాజి సూచించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. 'నటరాజ్‌ అన్నాదొరై అనే వ్యక్తి.. దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ మేనేజర్‌నని చెబుతూ పలువురు యువతీ యువకులకు మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌ చేస్తున్నాడు. లోకేశ్‌ తెరకెక్కించే తదుపరి చిత్రానికి వారి ప్రొఫైల్‌ ఎంపికైందని.. డబ్బులిస్తే ఆడిషన్‌కు అవసరమైన కాస్ట్యూమ్స్‌ తాను రెంట్‌కు తీసుకువస్తానని.. ఆడిషన్‌ పూర్తయ్యాక ఆ డబ్బులు వాపస్‌ ఇచ్చేస్తానని నమ్మిస్తున్నాడు. అలాగే సత్యదేవ్‌ అనే మరో వ్యక్తి తాను ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ జర్నలిస్ట్‌నని చెబుతూ డబ్బులు గుంజడానికి ప్రయత్నిస్తున్నాడు. సినీ పరిశ్రమలోకి రావాలని కలలుకనే కొత్తతరం నటులను టార్గెట్‌గా చేసుకుని వీళ్లు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి' అని బ్రహ్మాజీ వరుసగా ట్వీట్లు చేశారు.