
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు... టీవీలో పాటొస్తోంది. చూడను గాక చూడను...ముందే కళ్ళకలక నడుస్తోంది. అసలు కళ్ళలోకి చూడకున్నా కూడా వస్తోందట ఈ ఎరుపు కళ్ళ రోగం. ఇది కరోనా కంటే ముందరిదే కాని దాదాపు దానికి తీసుకునే జాగ్రత్తలే దీనికీ తీసుకోవాలి. చేతులు కడుక్కుంటూ ఉండాలంట, కళ్ళు కూడా అప్పుడప్పుడూ మంచి నీటితో కడుక్కోవడం ప్రత్యేకం. ఎవరో బాగుపడుతుంటే ఓర్వలేక...లేదంటే కోపంగా ఉన్నప్పుడు కళ్ళెర్ర చేశారంటారు. కాని ఇప్పుడు ఏ ఫీలింగు లేకనే నేత్రములు రుధిరవర్ణంలోకి పోతున్నాయి. అసలు ఈ కళ్ళ కలక లేకుండానే మన కళ్ళు ఎర్రగా ఉండాలెప్పుడూ. ఎందుకు అని మీరడుగుతారని ముందే తెలుసు, అందుకే చెబుతున్నా.
గ్యాస్ బండ రేటు పైపైకి, పెట్రోలు డీజలు ఇంక చెప్పొద్దు. వాటివల్ల అన్నీ పెరిగాయి. ఇక జి.ఎస్.టి బాదుడు, నల్లధనం చూస్తేనా ఇంకా వెనక్కి రాలేదు. నోట్ల రద్దు ఓ హుళక్కి. ఇక తినే అన్ని వస్తువుల ధరలు ఏం తినేటట్టు లేదు అన్నట్టే ఉన్నాయి. టొమాటోలకు ఒక ఫోటో తీసి ఆహా నా భోజనమంట అనుకుంటూ తినవలసిన రోజులు. ఇక మణిపూర్ మంటలు చూడనట్టు మౌన నటన. సోదరులను ఎప్పటికప్పుడు చీల్చే బిల్లులు. ఒకరిమీద ఒకరు బురద జల్లుకునేవారు పెద్దాయనంటే మాకు అతి గౌరవం అని నిరూపించుకునేందుకు ప్రతి బిల్లుకు మద్దతు పలికి మెచ్చుకోలు కోసం తహతహలు.
ఇలా వీటన్నింటికీ కళ్ళెర్ర చేయలేని జనాలకు ఈ కళ్ళకలక ఓ ఛాన్సు అనే చెప్పాలి. నాకూ కోపమొచ్చింది, నా కళ్ళూ ఎర్రబడ్డాయి అని అరవమని చెప్పాలి. అసలు ఆ ఎర్రటి కళ్ళను ఫోటో తీసి భద్రపరచుకొమ్మని చిన్న విన్నపం. కోపం వచ్చినప్పుడు లేదా రావలసిన కోపం రానప్పుడు ఈ ఫోటో చూసుకొని తృప్తిపడవచ్చు. ప్రయత్నించండి.
- జంధ్యాల రఘుబాబు,
సెల్ : 9849753298