Dec 07,2022 09:27

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : అరటి ధరలు నేలను తాకడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని ప్రధాన మార్కెట్లలో రైతుల నుంచి అరటి గెల రూ.80 నుంచి రూ.100కు మించి వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. ఈ ఏడాది గోదావరి వరదలు అరటి రైతులను నట్టేట ముంచాయి. అరటి చెట్లు కూలిపోవటం, తెగుళ్ల విజృంభణతో దిగుబడులు పడిపోయాయి. కార్తీక మాసంలో కొద్దిగా డిమాండ్‌ పెరిగి ధరలు ఆశాజనకంగా ఉండడంతో కాస్తంత ఊరట లభించింది. సీజన్‌ ముగియడంతో ధరలు మళ్లీ నేలను తాకాయి. అరటి గెలలు నిల్వ చేసే సౌకర్యాలు లేకపోవడంతో ఎప్పుడు కోసిన గెలలు అప్పుడే అమ్ముకోవాల్సి వస్తోంది.
 

                                               ఉమ్మడి జిల్లాలో 45 వేల ఎకరాల్లో సాగు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 45 వేల ఎకరాల్లో అరటిని సాగు చేస్తున్నారు. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట, అంబాజీపేట మండలాల్లో విస్తారంగా సాగవుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు, పెరవలి, ఉండ్రాజవరం, తాళ్లపూడి మండలాలతో అరటి సాగు అధికంగా ఉంది. కర్పూర, తెల్ల చక్రకేళి, కూర అరటి రకాలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రత్యక్షంగా 25 వేల మంది రైతులు, పరోక్షంగా ఐదు వేల మంది హోల్‌సేల్‌ రిటైల్‌ వ్యాపారులు అరటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రధాన మార్కెట్లకు ప్రతి రోజూ సుమారు 300 లారీల అరటి వస్తోంది.
 

                                     రైతుల నుంచి గెల రూ.80 నుంచి రూ.100కు కొనుగోలు

ప్రస్తుతం కోనసీమలోని రావులపాలెం, తూర్పుగోదావరిలోని పెరవలి మార్కెట్లలో పది టన్నుల అరటి గెలలను రైతుల నుంచి వ్యాపారులు రూ.65 వేలకు కొనుగోలు చేస్తున్నారు. టన్నుకు సైజును బట్టి 60 నుంచి 70 వరకూ గెలలు పడతాయి. ఈ లెక్కన గెల ఒక్కటికి రూ.80 నుంచి రూ.100 లోపుగానే ధర పలుకుతోంది. కార్తీక మాసం ప్రారంభంలో పది టన్నులకు రూ.1.20 లక్షల వరకూ ధర పలికింది. గెలకు రూ.200 వరకూ ధర లభించింది. ఎకరా విస్తీర్ణంలో అరటి సాగుకు సుమారు రూ.50 వేల వరకూ పెట్టుబడి అవుతోంది. అరటి చెట్టు పడిపోకుండా వెదురు గెడల ఏర్పాటు ఖర్చు దీనికి అదనం. ఒక్కొక్క వెదురు గెడ ఖరీదు సుమారు రూ.100 వరకు ఉంటోంది. ఎకరానికి 400 వెదురు గెడలకు రూ.40 వేలు అదనపు ఖర్చవుతోంది. ఎకరాకు సుమారు 500 వరకు గెలలు దిగుబడి వస్తోంది. గెల రూ.200కు పైగా అమ్మితే రూ.లక్ష వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం గెలకు వంద రూపాయలలోపే ధర వస్తోంది.
 

                 అప్పులే మిగులుతున్నాయి - నందమూరి నారాయణరావు, అరటి రైతు, తీపర్రు, పెరవలి మండలం

అరటి రైతులకు అప్పులే మిగులుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల తెగుళ్లు ఆశించడం, దిగుబడులు తగ్గిపోవడం పరిపాటిగా మారింది. సీజన్‌లో 20 రోజులు మాత్రమే ధరలు ఉంటున్నాయి. మిగిలిన రోజుల్లో పది టన్నుల గెలలకు రూ.65 వేలు మించట్లేదు. అరటిని నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం సౌకర్యాలు కల్పించాలి.