
పచ్చ అరటికాయలు టన్ను ధర రూ.22 వేల నుండి రూ.2 వేలకు పడిపోయింది. రాష్ట్రంలో చాలా చోట్ల వేసిన పంటను రైతులు దున్నివేస్తున్నారు. కరోనా కాలం నుండి అరటి రైతు నష్టాలనే చవిచూస్తున్నాడు. తియ్యని అరటి పండును పండిస్తున్న రైతుకు మాత్రం చేదు మిగులుతోంది. అరటి సాగు నష్టాలు రావడం వలన రైతులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు.
పచ్చ అరటి, కర్పూర, చక్కరకేళి, అమృతపాణి, కూర అరటి వంటి రకాలను రైతులు సాగు చేస్తున్నారు. డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని 'ఇయర్ ఆఫ్ బనానా' (అరటి సంవత్సరం)గా ప్రకటించింది. ఇలా ప్రకటించడం రాష్ట్రానికే గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వ్యాఖ్యానించారు. అరటి ఉత్పత్తిలో ప్రపంచంలో దేశం మొదటి స్థానంలో ఉండగా మన రాష్ట్రం 58.35 లక్షల టన్నుల ఉత్పత్తితో దేశంలోనే ముందంజలో ఉంది. అరటి సంవత్సరం పేరుతో అరటి సాగుపై ప్రత్యేక పరిశోధనలు చేయాలని నిర్ణయం తీసుకోవడం మంచిదే. అయితే మార్కెట్ మాయాజాలంతో నష్టపోతున్న రైతుల గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం. ధర రాక అరటి తోటలను రైతులు తొలగించేస్తున్నా ప్రభుత్వాల వైపు నుండి కనీస చలనం లేదు. ప్రస్తుతం కూలీ ఖర్చులు కూడా రావడం లేదని రైతులు కన్నీరు పెడుతున్నారు. కౌలుతో కలుపుకుని ఎకరాకు రూ. రెండు లక్షల 50 వేల నుండి రూ.3 లక్షల వరకు పెట్టుబడి ఖర్చవుతున్నది. డ్రిప్ సౌకర్యం సబ్సిడీ ఇవ్వడం లేదు. పొటాష్ ఇతర ఎరువుల ధరలు విపరీతంగా పెంచేశారు. పురుగు మందుల ధరలు దారుణంగా పెరిగిపోయాయి. అరటి చెట్టు పడిపోకుండా సపోర్టుగా కట్టే కర్రల ధరలు పెరిగిపోయాయి. ఉత్పత్తి ఖర్చులు రెట్టింపు అయ్యాయి ధర మాత్రం పెరగడం లేదు. అరటి సాగు చేసిన 95 శాతం మంది రైతులు నష్టాల్లో కూరుకుపోయారు.
ఎకరాకు 25 టన్నుల నుండి 30 టన్నుల దిగుబడి వస్తోంది. టన్ను అరటికాయలకు రూ.12 వేలు ధర ఇస్తే గట్టెక్కుతామని అరటి రైతులు మొర పెట్టుకుంటున్నా ప్రభుత్వాల వైపు నుండి స్పందన లేదు. వ్యాపారుల మోసాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో పండిన అరటి తమిళనాడు, ఒడిషా తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నది. రాష్ట్రంలోని అతి పెద్ద అరటి మార్కెట్‌గా రావులపాలెం మార్కెట్ ఉన్నది. పచ్చ అరటిని వ్యాపారులు రైతులు వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. కరోనా కాలంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని పచ్చ అరటి కాయలను మార్కెటింగ్ చేసింది. కొద్దిమంది రైతులకు కొద్దిగా మేలు జరిగింది తప్ప ఎక్కువ మంది రైతులు నష్టపోయారు. ప్రధానంగా అరటి మార్కెట్‌పై ప్రభుత్వం నియంత్రణ లేదు. వ్యాపారులు చెప్పిందే ధరగా ఉంది. కనీస ధర నిర్ణయం జరగకపోవడం వలన వ్యాపారులు వారికి బాగా లాభాలు వచ్చే సమయంలో మాత్రమే రైతుకు కాస్త ధర ఇస్తున్నారు.
మార్కెట్ అవసరాలకు మించి సరుకు ఉత్పత్తి జరిగిన సందర్భంలో ధర ఉండడం లేదు. రైతు నిల్వ పెట్టుకోవడానికి అవకాశం లేదు. కోతకు వచ్చిన అరటికాయలను పచ్చి సరుకు కాబట్టి అయిన కాడికి అమ్ముకోవాల్సిందే. పండగలు, పెళ్లిళ్లు వంటి సందర్భాలలోనే అరటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. కేరళ వంటి రాష్ట్రాల్లో అరటి చిప్స్ తయారు చేస్తున్నారు. దీని ద్వారా వినియోగం ఎక్కువగా ఉంటుంది. అరటి ఎగుమతుల కోసం ఇతర దేశాలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటున్నది. అయినా రైతుకు కనీస ధర రావడం లేదు. ఎన్నో ఆశలతో సాగు చేస్తున్న రైతుకు నష్టాలే మిగులుతున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం విత్తనం నుండి విక్రయం వరకు అని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. కాని అరటి రైతులకు భరోసా కల్పించలేకపోతున్నారు.
తుఫాన్లు, ఈదురు గాలులు వంటి ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ఎక్కువగా నష్టపోయేది అరటి రైతులే. నష్టాలకు ప్రభుత్వాల వైపు నుండి సాయం అందడం లేదు. పంటల బీమా వంటి పథకాలు అరటి రైతుల దరి చేరడం లేదు. ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీలు ఇవ్వడం లేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోతున్న అరటి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలి. కనీస ధరలు ప్రకటించి అమలు జరిగేలా చూడాలి. ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీలు అందించాలి. 90 శాతం సబ్సిడీపై డ్రిప్ సౌకర్యం కల్పించాలి.
కె.శ్రీనివాస్
(వ్యాసకర్త:ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి,
సెల్: 9490098574)