Dec 04,2022 06:48

భారతదేశ చరిత్రలో మరచిపోకూడని రాజకీయ దురంతానికి గుర్తు 1992 డిసెంబరు ఆరవ తేదీ. రామ జన్మభూమి/బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలంగా పేరొందిన కట్టడాన్ని మతోన్మాద మూకలు నేలమట్టం చేసిన రోజు. భారత రాజ్యాంగ మౌలిక విలువలైన ప్రజాస్వామ్యం లౌకికతత్వం, శాసనబద్ధ పాలన కుప్పకూల్చిన రోజు. అప్పటి నుంచి ఈ మూడు దశాబ్దాలలో జరిగిన పరిణామాలన్నీ కూల్చిన ఆ కట్టడం పునాదులపై సాగుతున్న రాజకీయ విన్యాసాలే. ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వమూ దానికి ముందు పాలన చేసిన వాజ్‌పేయి ప్రభుత్వమూ ఆ శిథిలాలపై లేచిన మతోన్మాద సౌధాలే. వామపక్ష లౌకిక శక్తులు మినహాయిస్తే దేశంలోని అవకాశవాద అధికార దాహపూరిత రాజకీయ రాజ్యాంగ న్యాయ వ్యవస్థలు దీన్ని అనుమతించి కొనసాగనిచ్చాయి. ఇదంతా చేసిన బిజెపి దేశం నెత్తిన కూచుంటే వారలా చేసేందుకు అవకాశమిచ్చిన కాంగ్రెస్‌ అస్తిత్వం కోసం తంటాలు పడుతున్నది. ఇప్పుడు ఆ మసీదు కూలిన చోట సరికొత్త రామ మందిరం వెలసింది. ఏ ఎన్నిక వచ్చినా ప్రధాని మోడీ, యు.పి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అక్కడ పూజలతోనే ప్రారంభిస్తున్నారు. కానీ డిసెంబరు ఆరు మాత్రం ఘోషిస్తూనే వుంది. అయిదు వందల ఏళ్ల చరిత్రను మలుపు తిప్పిన అవకాశవాద చరిత్ర అనుక్షణం దేశాన్ని హెచ్చరిస్తూనే వుంది. బాబ్రీ విధ్వంసానికేగాక సరళీకరణ అమలుకు కూడా మూడు దశాబ్దాలు కావడం యాదృచ్ఛికం కాదు. ప్రపంచీకరణపేర ప్రజాప్రయోజనాలను ఫణంగా పెట్టడంలో మతవాదులు ముందుంటారు. ఆ విధానాల విషమ ఫలితాలను విభజన విద్వేషాల వైపు మరలిస్తారు. ఇదో కపట ద్వంద్వ నీతి.
రాముడి పేర రాజకీయం
అయోధ్య అంటే యుద్ధం లేనిది అని అర్థం. అదే పెద్ద రణ రంగ స్థలిగా మారిపోవడం రాజకీయ క్రీడల ఫలితమే. గతంలో తెల్లజాతి పాలకులూ తర్వాత ఆరెస్సెస్‌, బిజెపి కూడా ఈ సమస్యను విభజన రాజకీయాలకు సాధనంగానే చేసుకోవడం వాస్తవం. హిందూ మత గ్రంథాలు గాని, బాబర్‌ పాలించిన నాడు భారత దేశం సందర్శించిన యాత్రీకుల కథనాలు గాని, ఆయన స్వంత జ్ఞాపకాలలో గాని అక్కడ మందిరాన్ని పడగొట్టిన ఊసు లేదు. నాటి పురాణాల్లో అయోధ్యకు అంత ప్రాధాన్యత ఇచ్చిందీ లేదు. ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం అనబడే 1857 వరకూ అయోధ్యలో వివాదాస్పద స్థలానికి సంబంధించి ఎలాంటి సమస్యా లేదు. ఉన్న స్వల్ప వివాదాలు పెరిగిందీ లేదు. తర్వాత బ్రిటిష్‌ అధికారులు వ్యూహాత్మకంగా ఈ చిచ్చు రాజేశారు. 1855 వరకూ అక్కడ హిందూ ముస్లింలు కలిసే పూజలు చేసుకుంటుండేవారు. 1886లో కూడా మసీదు ద్వారం వెలుపల వున్న చబూత్రా వున్న చోటనే రాముడు జన్మించాడంటూ కోర్టులో వ్యాజ్యం నడిచింది. ఆ వ్యాజ్యాన్ని ఆనాడే కోర్టు తోసిపుచ్చింది. కనక బాబ్రీ మసీదు వున్న చోటనే రాముడు జన్మించాడంటూ దాన్ని పడగొట్టి గుడి కడితేనే రామభక్తి అవుతుందని చెప్పడం ప్రతీకార రాజకీయాల పర్యవసానమే. అయోధ్యలో పదికి పైగా రామాలయాలుంటే ప్రతి చోటా రాముడి జన్మస్థానమనే చెబుతుంటారు. కౌసల్యా మందిరం కూడా వుంది గనక ఆయన జననం అక్కడే జరిగిందని కూడా భావించే అవకాశం వుంది. ఇంతా చేసి రాముడు పూజలందుకునే పురాణ పురుషుడే గాని చారిత్రిక కోణాలతో తేల్చదగిన రాజు కాదు. అలాగాక పురాణాలలో లెక్కల ప్రకారం త్రేతాయుగం అను కుంటూ ఎనిమిది లక్షల ఏళ్ల కిందటి కాలానికి వెళ్లాలి. అప్పుడు ఈ భూమండలం ఏ రూపంలో వుందో కూడా తెలియదు. కనక మౌలికంగా భక్తి విశ్వాసాలకు సంబంధించిన ఈ సమస్యను చరిత్రతో రాజకీయాలతో ముడివేయడమే పెద్ద వ్యూహం. 1949లో చీకటిరాత్రి రహస్యంగా రామ లక్ష్మణుల విగ్రహాలను ఆ ఆవరణలో ప్రతిష్టించిన తర్వాత కూడా నాటి ప్రధాని నెహ్రూ, హోంమంత్రి సర్దార్‌ వల్లభారు పటేల్‌ సరిగ్గానే స్పందించారు. అది ఎలాంటి ఉద్రిక్తతలకు దారి తీయకుండా తాళాలు వేయించారు. అప్పటి నుంచి వివా దం కొత్త మలుపులు తిరుగుతూ ఎనభైలలో బిజెపి మత రాజకీయాలతో పాటు మరింత తీవ్రమవుతూ వచ్చింది. 2010లో బిజెపికి అనుకూలంగా తీర్పునిచ్చిన లక్నో హైకోర్టు కూడా విగ్రహాలను అక్రమంగా అక్కడకు చేర్చారనే వ్యాఖ్యానించింది.
అవకాశవాద రాజకీయాలు
1986లో బిజెపి పాలంపూర్‌లో అయోధ్య సమస్యను కీలకమైందిగా చేపట్టిన తర్వాతే సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. శిలాన్యాస్‌లు, రథయాత్రలూ దాన్ని మరింత వేడెక్కించాయి. రాజగురువుల్లా సాధుసంతులను ముందు పెట్టుకుని రాజకీయ ప్రహసనం నడిచింది. ఇంతటి ఉద్రిక్తత నేపథ్యంలో రాజీవ్‌గాంధీ ఫైజాబాద్‌ (అయోధ్య) మేజిస్ట్రేట్‌ ఇచ్చిన అరకొర తీర్పును ఆధారం చేసుకుని ఆఘమేఘాల మీద వివాదాస్పద కట్టడం తలుపులు తెరిపించారు (షాబానూ కేసులో ముస్లిం మత ఛాందసులను సంతృప్తి పరచిన దానికి విరుగుడుగా హిందూ ఛాందసులను సంతృప్తి పరచేందుకు ఇదొక ఎత్తుగడగా భావించారు). అందుకే 1989లో రాజీవ్‌గాంధీ ఎన్నికల ప్రచారం కూడా రామరాజ్యం నినాదంతో అయోధ్య నుంచే ప్రారంభించాడు. ఈ రాజకీయాలు ఆయన కన్నా బిజెపికే ఎక్కువ మేలు చేయడంతో బిజెపి బలం రెండు సీట్ల నుంచి దాదాపు 90కి చేరింది. అయినా వామపక్షాల కారణంగా బిజెపి అధికారానికి దూరంగా వుండి వి.పి.సింగ్‌ నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని బయిట నుంచే బలపర్చవలసి వచ్చింది. ఆ పరిస్థితి తట్టుకోలేక ఆపైన మండల్‌ సిఫార్సుల అమలును ఆమోదించలేక బిజెపి నేత అద్వానీ రామ రథయాత్ర రాజకీయ దావానలం రగిలించారు. అత్యాధునికమైన టయోటా కారులో గుజరాత్‌ లోనే మొదలైన ఆ రథయాత్ర నిర్వహణ తొలి బాధ్యత మోడీ చేపట్టారు. రాముడిని దేవుడి స్థాయి నుంచి తమ పార్టీ రాజకీయ చిహ్నంతో పాటు రథంపై చిత్రించుకుని ఉత్తరాది రాష్ట్రాలలో దారుణమైన మత కలహాలకు కారణమైనాడు. స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలోనే ఒక ప్రముఖ జాతీయ నాయకుడు మతపరమైన వివాదాన్ని విస్త్రుత ప్రచారానికి వాడుకోవడం అది మొదటి సారి. చివరకు ఆయనను అరెస్టు చేయగానే కాంగ్రెస్‌తో కలసి బిజెపి వి.పి.సింగ్‌ ప్రభుత్వాన్ని కూలదోసింది. ఈ ప్రచారంలో హిందీ పత్రికా ప్రపంచం కూడా యథాశక్తి పాత్ర వహించింది. ఇన్ని కారణాల వల్ల 1991 ఎన్నికలలో బిజెపి బలం మరింత పెరిగి 1992 డిసెంబరు 6న బాబ్రీ మసీదును కూలదోసే స్థితి వచ్చింది. నాటి ప్రధాని పి.వి.నరసింహారావుకు దీన్ని నిరోధించేందుకు అన్ని పార్టీలూ కలిపి అధికారం ఇచ్చినా చిటికెన వేలు కదల్చకుండా కూల్చివేతను అనుమతించారు. పదవీ విరమణ తర్వాత దీనిపై బృహద్గ్రంథాలు వెలువరించి మరీ సమర్థించుకోడానికి పాకులాడాడు. అయినా ఆ నాటి కళంకం చెదిరిపోయేది కాదు. అయితే అసలు అపరాధం మాత్రం ఆరెస్సెస్‌, బిజెపి, సంఘ పరివార్‌దేనన్నది చారిత్రిక సత్యం. దాని వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోవడమే కాక అంతర్జాతీయంగానూ దేశ ప్రయోజనాలకు హాని కలిగింది. మీడియా కూడా దాడులకు గురైంది. మరో పదేళ్లకు 2002లో రగిలిన గుజరాత్‌ మారణకాండ నరేంద్ర మోడీని దేశాధినేతగా తీసుకొచ్చే పరిస్థితి కల్పించింది.

babri


ముదిరిన మత విద్వేషం
ఈ మూడు దశాబ్దాలను తీసుకుంటే బాబ్రీ మసీదును బూచిగా చూపి పెరగడం తొలి దశ, మలి దశాబ్దంలో గుజరాత్‌ మారణకాండతో ఫాసిస్టు తరహా రాజకీయాలు తేవడం, 2019 ఎన్నికల ప్రాంగణంలో అయోధ్య తీర్పు సంఘ పరివార్‌ శక్తులను అనుగుణంగా సుప్రీం కోర్టు తీర్పు రావడం దీనికి పరాకాష్ట. మూడవ దశాబ్దంలో అత్యధిక కాలం వారి రాజ్యమే సాగుతుండడం ఒక చరిత్ర క్రమం. మోడీ హయాంలో అసహన రాజకీయాలూ, రాష్ట్రాల హక్కులపై ప్రత్యక్ష దాడి, రాజ్యాంగ ముసుగు లోనే మత చిహ్నాలను ప్రతిష్టించడడం చూస్తున్న వాస్తవమే. అయోధ్య పహలీ ఝాంకీ హై, కాశీ మధుర బాకీ హై అన్న సంఘ పరివార్‌ ఇప్పుడు వారణాసి లోని జ్ఞానవాపి మసీదు విషయంలోనూ ఇదే రాజకీయ ఎత్తుగడ అనుసరిస్తున్నది. బాబ్రీ విధ్వంసానికి ముందే పి.వి ప్రభుత్వ హయాంలోనే పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన ప్రార్థనా స్థలాల చట్టం కూడా కొరగాకుండా పోయింది. లక్నో హైకోర్టులో మొదలైన ఆ కేసు సుప్రీం కోర్టు వరకూ వచ్చింది. ఆ చట్టం ప్రకారం అయోధ్య వివాదం సుప్రీం తీర్పు ప్రకారం పరిష్కరించాలని, మిగిలిన అన్ని ఆలయాలలోనూ 1947 ఆగష్టు 15న వున్న యథాతథ స్థితి కొనసాగాలని నిర్దేశించింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో సహా చాలా చోట్ల ఆలయాల చుట్టూ రాజకీయ వివాదాలు ముసురుతున్నాయి. ఎ.పి లో మాట్లాడితే తిరుపతి, రామతీర్థం, అంతర్వేది అంటూ ఏకరువు పెడుతున్నారు. తెలంగాణలో బిజెపి...చార్మినార్‌లో కట్టిన భాగ్యలక్ష్మి ఆలయం దగ్గరే సగం రాజకీయం నడిపిస్తున్నది. అయోధ్యలో అక్కరకు వచ్చిన సుప్రీం తీర్పు శబరిమల విషయంలో సహించరానిదైపోయింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాజ్యాంగ పదవిలో వున్న ఉపరాష్ట్రపతి కూడా జడ్జిల నియామక ప్రక్రియపై ప్రత్యక్షంగా దాడి చేయడం న్యాయ వ్యవస్థను లొంగదీసుకునే ప్రయత్నమేనని వేరే చెప్పనక్కరలేదు.
అయోధ్య రామమందిరం గర్భగుడి పని 2023 అఖరుకు 15 శాతం పూర్తవుతుందని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్‌రామ్‌ ప్రకటించారు. మిగిలిన గుడితో కలిపి చూస్తే మొత్తం సగం నిర్మాణం అయిపోయినట్టేనన్నారు. 2023 ఆఖరుకు ఆలయం పూర్తి చేసి 2024 మకర సంక్రాంతి నాడు రాముడి విగ్రహ ప్రతిష్టాపన పూర్తిచేసి భక్తులను అనుమతిస్తామని చెప్పడం రాబోయే ఎన్నికల షెడ్యూలుతో సరిగ్గా సరిపోతుంది. కనుక దేశంలో అయోధ్య పరిణామాల ప్రభావం ఆగిపోయిందనుకుంటే పొరబాటు. దాన్ని ఒక సరికొత్త మతోన్మాద ముప్పు పెరుగుదలకు ఆరంభం లాగానే చూడవలసి వుంటుంది. అయితే వామపక్షేతర పార్టీలలో అనేకం, అలాగే సాధారణ సమాజంలో చాలామంది కూడా మత రాజకీయాలు రాజ్యాంగానికి విరుద్ధమనీ, వ్యక్తిగత స్వేచ్ఛకు కూడా భంగకరంగా మారాయని గుర్తిస్తున్నారా? వ్యక్తుల ఆహార విహారాది విషయల్లోనూ వస్త్రధారణ లోనూ, మహిళలపై మైనార్టీలపై వివక్షలోనూ ఆంక్షలు గుప్పిస్తున్నారు. ఆఖరుకు కరోనా కరాళ వేళలోనూ ఈ మత విద్వేషాలు రగిలించే కుటిలత్వానికి పాలకులు పాల్పడగలిగారు. చాప కింద నీరులా ప్రజల మెదళ్లలో మతతత్వాన్ని జొప్పిస్తున్న ఈ శక్తులే రాజకీయ రంగంలో బాహాటంగానే హిందూత్వను ప్రయోగిస్తున్నారు. అయోధ్య విషయంలో చేసినట్టే ఇప్పుడు దేశ చరిత్రనంతటినీ తిరగరాయాలని మోడీ పిలుపునిస్తున్నారు. అంటే అవాస్తవాలతో కొత్త తరాల బుర్రలు కలుషితం చేయబోతున్నారు. అందుకు అంగీకరించని అధ్యయనశీల మేధావులను, రాజకీయ శక్తులను వేటాడి వేధిస్తున్నారు. రాష్ట్రపతి భవనంలోనూ విందుల్లో మాంసాహారం వుండొద్దని బిజెపి ఎం.పి బిల్లు తెస్తున్నారు. కాషాయాంబరధారులైన దళారులు ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు దిగిపోతున్నారు. ఒకప్పుడు రామాయణ్‌ సీరియల్‌ను ఆరెస్సెస్‌ వారు ఉపయోగిస్తే ఇప్పుడు భారీ తెరపై తెలుగు బాహుబలి ఆదిపురుషుడుగా అవతరిస్తున్నారు. ఆ అవతారం మోడీజీ మూడో పాదం మోపే ప్రచార సన్నాహంలో భాగమే. జి20 సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడమే గాక మోడీ మా ప్రాణమిత్రుడని అమెరికా అధ్యక్షుడు ప్రకటిస్తున్నాడు. అప్పటి అద్వానీని మించిన అధికార బలంతో ఆధ్యాత్మిక వత్తాసుతో మోడీ సమస్త రంగాలను మతతత్వ పూరితం చేస్తున్నారు. నాడు లౌకిక పార్టీల ఉపేక్ష, పి.వి.నరసింహారావు సర్కారు అవకాశవాదం ఈ పరిస్థితికి కారణమైందని గుర్తుచేసుకుంటే ఇప్పుడు అప్రమత్తత అవసరం తలకెక్కుతుంది. ఏ మాత్రం ఉపేక్షించినా అప్పటి బాబ్రీ మసీదు విధ్వంసాన్ని మించి ఇప్పుడు భారత దేశ మత సామరస్య పునాదులనే పెకిలించే ప్రమాదం విరుచుకు పడుతుంది. అదే డిసెంబరు ఆరు ప్రత్యేక హెచ్చరిక.

తెలకపల్లి రవి

 

 

 

 

 

తెలకపల్లి రవి