Jul 25,2023 12:36

అమరావతి : మణిపూర్‌ హింసను అదుపుచేయడంలో అక్కడున్న బిజెపి ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ పూర్తిగా విఫలమయ్యారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం వి.శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ... బిజెపి నియమించిన జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వయంగా మాట్లాడుతూ ... మణిపూర్‌లో తాము ఎన్ని ఉత్తరాలు రాసినా కనీసం స్పందించడం లేదని, ఏం పట్టించుకోవడం లేదని బహిరంగంగా చెప్పారని అన్నారు. అక్కడ జరుగుతున్న పరిణామాలను బయటకు రానీయడం లేదనీ... ప్రభుత్వం స్పందించి దానిపై ఎలాంటి చర్య తీసుకోవడం లేదనీ అన్నారు. వారిపై ఒత్తిడి తెచ్చి అయినా దాన్ని పరిష్కరించాలనే దిశగా కేంద్రంలోని హోం మినిస్టర్‌ కూడా ఏమీ చేయలేదని ఆరోపించారు. నిన్న ప్రధానమంత్రి మోడీ స్పందించారని అన్నారు. మణిపూర్‌ హింసను గురించి పార్లమెంటులో అడిగినప్పటికీ ప్రధాని ఏమాత్రం స్పందించలేదని చెప్పారు. ఆ విషయమై పార్లమెంటులో అంతా స్టాల్‌ చేసినప్పుడు ప్రధాని ఆ చెప్పేదేదో అక్కడే చెప్పి ఉంటే చర్చ జరిగి ఉంటే బాగుండేదనీ.. కానీ ప్రధాని బయటకు వచ్చి స్పందించడం విడ్డూరంగా ఉందన్నారు. అన్యాయం జరిగిపోయింది.. ఘోరం జరిగిపోయింది అంటూ.. సామాన్య ప్రజలు అన్నట్లు ప్రధాని చెప్పడం శోచనీయమన్నారు. మరి అన్యాయం-ఘోరం జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. అక్కడున్న బిజెపి ఏం చేస్తుందీ ? ఇక్కడ కేంద్రంలో ఉన్న హోం మినిస్టర్‌ ఏం చేస్తున్నారు ? ప్రధానమంత్రి ఏం చేస్తున్నారు ? అని ప్రశ్నించారు. టెలిగ్రాం పత్రికలో వేసినట్లు.. 56 ఇంచులు మందమైన చర్మం ఉన్న ఆయనకి మహిళలపై జరుగుతున్న దారుణాలను తెలుసుకోవడానికి 72 గంటలు పట్టిందా ? అని ప్రస్తుతం అంతర్జాలంలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. ఇలాంటి ప్రధాని దేశంలో ఉన్నారని మండిపడ్డారు. మణిపూర్‌లోని హింసకు ప్రధాన కారణం బిజెపినేనన్నారు. వారి రాజకీయ అవసరాల కోసం తెగల మధ్య తగాదాలు పెట్టారనీ, ఆ అగ్గి రాజుకొని దేశమంతా ఆ మంటలు వ్యాపించాయని వి.శ్రీనివాసరావు వివరించారు.