Aug 03,2023 21:56

ఆ పార్టీకి తొత్తుగా వైసిపి, టిడిపి, జనసేన పార్టీ ఉండడం సరికాదు
వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపిగా పోటీ : కెఎ పాల్‌
ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బిజెపికి తొత్తులుగా రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీ ఉండడం సమర్థనీయం కాదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఎ.పాల్‌ అన్నారు. తెలుగు జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యాన విజెఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బిజెపి తీరని ద్రోహం చేసిందని, ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్‌ ఇవ్వలేదని అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టడం సరికాదని తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ భూములను తీసుకున్న గంగవరం పోర్టు... స్టీల్‌ప్లాంట్‌కు అడ్డంకులు సృష్టించడం భావ్యం కాదన్నారు. గంగవరం పోర్టును అదానీకి అప్పగించడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర ఉందని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు మోడీతో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నాయని, దీంతో, రాష్ట్రం సర్వనాశనమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోవడానికి జగన్మోహన్‌రెడ్డి, చంద్రబాబు కారకులని విమర్శించారు. డిసెంబర్‌లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ 119 స్థానాల్లో పోటీ చేస్తుందని, తాను అక్కడ శాసనసభకు పోటీ చేస్తానని చెప్పారు. 2024లో ఎపిలో జరగనున్న ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపిగా పోటీ చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు జర్నలిస్ట్‌ ఫోరం అధ్యక్షుడు ఈశ్వర్‌ చౌదరి, ఎల్‌జి.నాయుడు, జార్జి పాల్గొన్నారు.