
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించడం కష్టమని నరేంద్ర మోడీకి, బిజెపి కి బాగానే అర్థమవుతున్నది. గత రెండు మూడు నెలలుగా చోటుచేసుకున్న ఘటనలు అందుకు నిదర్శనం. పుల్వామా ఘటనపై మాజీ గవర్నర్, బిజెపి జాతీయ ఆఫీస్ బేరర్ సత్యపాల్ మాలిక్ వెల్లడించిన అంశాలను మొదలుకొని...ప్రభుత్వాన్ని విమర్శించేవారి ఖాతాలను బ్లాక్ చేయని పక్షంలో ట్విటర్‌ను మూసేస్తామని మోడీ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందన్న వార్తల వరకు ... ఇదే అంశాన్ని తెలియచేస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తన విజయాన్ని పునరావృతం చేయగలదన్న బిజెపి విశ్వాసాన్ని దెబ్బతీసింది. అందుకే వచ్చే ఎన్నికల్లో బిజెపి పెద్దఎత్తున మతం పేరుతో ప్రజలను చీల్చేందుకు ప్రయత్నిస్తుందని పలువురు రాజకీయ పరిశీలకులు, నేతలు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలు వారు వేసిన అంచనా నిజమేనని నిరూపిస్తున్నాయి. ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, బీహార్‌లలో మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించి, ప్రజలలో చీలికలు పెంచేందుకు ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నాయకత్వం ప్రయత్నిస్తున్నాయి.
వచ్చే లోక్‌సభ ఎన్నికలలో గెలవడానికి మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం మినహా మరో మార్గం లేదన్న నిర్ణయానికి ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి వచ్చాయని అర్థంచేసుకోవాలి. మోడీ బొమ్మతో మాత్రమే లోక్‌సభ ఎన్నికల్లో గెలవలేమని, కొత్త వ్యూహాలు అవసరమని ఆర్‌ఎస్‌ఎస్ దినపత్రిక 'ఆర్గనైజర్' పేర్కొనడాన్ని మరచిపోరాదు. అంటే ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు ఉద్దేశపూర్వకంగానే మత ఘర్షణలు, అల్లర్లు సృష్టిస్తున్నాయని అర్థంచేసుకోవాలి. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్‌లో మాదిరిగా పెద్ద ఎత్తున మత ఘర్షణలుగా కాకుండా...చిన్న చిన్న మత ఘర్షణలను వ్యాప్తి చేసి జనాభాను మత ప్రాతిపదికన విభజించి మెజారిటీ హిందూ ఓట్లను కూడగట్టాలన్నది బిజెపి పన్నాగం. ఉత్తరాఖండ్‌లో గత రెండు వారాలుగా జరుగుతున్న సంఘటనలు భారత రాజ్యాంగానికి, అందులో పేర్కొన్న లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు విరుద్ధమైనవి. పద్నాలుగేళ్ల హిందూ బాలిక కిడ్నాప్‌తో కేసు మొదలైంది. బాలికను కిడ్నాప్ చేసిన మోటార్ సైకిల్ మెకానిక్ జితేంద్ర సైనీని, పురోలా వ్యాపారి ఉబైద్ ఖాన్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటనను 'లవ్ జిహాద్'గా చిత్రీకరించి పురోలా లోని సంఫ్‌ుపరివార్ శక్తులు ముస్లింల వేట ప్రారంభించాయి. బాలికను అపహరించేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకుల్లో ఒకరు హిందువు అయినప్పటికీ 'లవ్ జిహాద్'గా వర్గీకరించి రాజకీయ లబ్ధి పొందేందుకు సంఫ్‌ు పరివార్ ప్రయత్నిస్తోంది.
'ముస్లింలు లేని ఉత్తరాఖండ్' అనే అత్యంత ప్రమాదకరమైన నినాదాన్ని ఇక్కడి సంఫ్‌ు పరివార్ లేవనెత్తుతోంది. ఇక్కడ లవ్ జిహాద్‌ను 'వాణిజ్య జిహాద్'గా ప్రచారం చేస్తోంది. వ్యాపార రంగంలో హిందువులు మాత్రమే సరిపోతారు, ముస్లింలు లేదా ఇతర మతాల వారు అవసరం లేదనే నినాదం ఉత్తరాఖండ్ నుండి వస్తోంది.
రాజధాని డెహ్రాడూన్ నుండి 140 కి.మీ దూరంలో ఉత్తర కాశీకి సమీపంలో ఉన్న ఒక చిన్న పట్టణం పురోలా. ఇది కేవలం 5000 మంది జనాభా ఉన్న నగర పంచాయతీ. ఇక్కడ దాదాపు 650-700 చిన్న, పెద్ద దుకాణాలు ఉన్నాయి. వాటిలో 45 మాత్రమే ముస్లింలవి. ఇక్కడ ముస్లింలు 200 లోపే ఉన్నారు. ప్రస్తుతం వారిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది యాభై ఏళ్లకు పైగా అక్కడే నివసిస్తున్నారు. 'దేవభూమి రక్షా అభియాన్' అనే హిందూత్వ సంస్థ ఈ నెల పదిహేనవ తేదీలోగా ముస్లిం వ్యాపారస్తులందరినీ ఖాళీ చేయాలని నోటీసు జారీ చేసింది. 42 మంది ఇప్పటికే ఖాళీ చేశారు. ఏడుగురైతే అన్నీ సర్దుకుని పురోలా నగరానికి వీడ్కోలు పలికినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. మరికొందరు డెహ్రాడూన్, సమీప పట్టణాల్లోని బంధువుల ఇళ్లలో భయంతో జీవిస్తున్నారు. ముస్లిం దుకాణాలపై నల్ల గీతలతో గుర్తించి సోదాలు చేసి ధ్వంసం చేసినట్లు నివేదికలు ఉన్నాయి.
ఇతర మతాల వారు బిజెపి తో అంటకాగితే సంఫ్‌ు పరివార్ దాడుల నుంచి తప్పించుకోవచ్చని ఎవరూ అనుకోవద్దన్న సందేశాన్ని కూడా ఉత్తరాఖండ్ పంపుతోంది. 2017లో బిజెపి అధికారంలోకి రాగానే పురోలాలో బట్టల వ్యాపారి సాహిద్ మాలిక్ బిజెపిలో చేరారు. బిజెపి మైనారిటీ మోర్చా నాయకుడయ్యాడు. అయితే, సంఫ్‌ు పరివార్ ముస్లిం వ్యాపారులను ఖాళీ చేయించాలని నిర్ణయించినప్పుడు, సాహిద్ మాలిక్ ప్రాణాలను కాపాడుకోవడానికి తన దుకాణాన్ని మూసివేసి పురోలా నుండి పారిపోవాల్సి చ్చింది. మణిపూర్‌లో క్రైస్తవ బిజెపి మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు సంఫ్‌ు పరివారీయులే నిప్పు పెట్టారు. కేరళలో బిజెపి కి దగ్గరవ్వాలని తహతహలాడుతున్న వారికి ఇది గుణపాఠం కావాలి.
బిజెపి చర్యలను వ్యతిరేకిస్తే ముస్లింలకు అనుకూలమన్న అపవాదును మోయాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలు మౌనంగా ఉంటున్నారని 'న్యూస్ క్లిక్' వార్తా కథనం పేర్కొంది. పురోలా లోని ముస్లిం వ్యాపారులను తొలగించడానికి సంబంధించి కాంగ్రెస్ ఏమాతం స్పందించలేదని ఆ కథనం చెబుతోంది.
ఉత్తరాఖండ్‌లో 'లవ్ జిహాద్', 'ట్రేడ్ జిహాద్' మాత్రమే కాకుండా 'మజర్ జిహాద్' (ల్యాండ్ జిహాద్) కూడా మొదలైంది. ఇప్పటికే 325 మసీదులను అనధికార భూమిలో ఏర్పాటు చేశారంటూ బుల్డోజర్లతో కూల్చివేశారు. వెయ్యికి పైగా అక్రమ మసీదులు ఉన్నాయని, వాటిని కూల్చివేస్తామని బిజెపి ప్రభుత్వం చెబుతోంది. అంటే రాష్ట్రంలో ముస్లింలు ఏ విధంగానూ జీవించలేని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ హయాంలోనే ఈ అక్రమ మసీదులు వచ్చాయని బిజెపి ఆరోపిస్తోంది. అయితే దీనిపై స్పందించేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధంగా లేదు. ఇది కాంగ్రెస్ మెతక హిందుత్వ ధోరణిని తెలియజేస్తోంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మాదిరిగానే ఉత్తరాఖండ్ కూడా హిందూ మత ప్రయోగశాలగా మారుతోంది. 2024లో మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే హిందూ రాష్ట్ర ప్రకటన ఉంటుందనడానికి ఇదొక స్పష్టమైన సంకేతం.
మహారాష్ట్రలో కూడా ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి గ్రూపు ఉద్దేశపూర్వకంగానే మత ఘర్షణలు సృష్టిస్తోంది. ఔరంగజేబు, టిప్పు సుల్తాన్‌లను కొనియాడుతూ కొందరు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లను సాకుగా చూపి కొల్హాపూర్, బీడ్, అహ్మద్‌నగర్‌లలో మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించాయి. మూడు నెలల్లో ఎనిమిది నగరాల్లో మత ఘర్షణలు జరిగాయి. మరోవైపు ఇలాంటి విధ్వంసాలను అరికట్టాల్సిన ప్రభుత్వం ప్రజలను వీధిన పడేస్తూ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నం చేస్తోంది. మహారాష్ట్ర హోం శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటనను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో అల్లర్ల వాతావరణం నెలకొనడానికి కారణం ఔరంగజేబు వారసులు ఇంకా ఇక్కడ వుండడమేనని ఫడ్నవిస్ పేర్కొన్నారు. దీనినిబట్టి అల్లర్లు సృష్టించేందుకు సంఫ్‌ు పరివార్ పన్నిన పథకమే ఇదని రుజువైంది.
'గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనలు మతతత్వ దూకుడును మరింతగా ఉధృతం చేసేందుకు ఒక పథకం ప్రకారం ప్రయత్నిస్తున్నట్టుగా వుందని ఈ నెల 12వ తేదీన 'ది హిందూ' దినపత్రిక మొదటి పేజీలో రాసిన ప్రత్యేక కథనంలో పేర్కొంది. చిన్నచిన్న ఘటనలను ప్రస్తావిస్తూ సామాన్యుల జీవనం అగమ్యగోచరంగా మార్చే యత్నాలు జరుగుతున్నాయని ఆ పత్రిక పేర్కొంది. బిజెపి-షిండే గ్రూపు శివసేన ప్రభుత్వానికి కాంగ్రెస్-ఎన్‌సిపి-ఉద్ధవ్ శివసేన కూటమి నుంచి గట్టి సవాలు ఎదురవుతోంది. మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించడానికిది సులభమైన మార్గమిది. బీహార్ లోనూ బిజెపి ఇదే తరహాలో ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే, ఉత్తరాఖండ్‌లో మాదిరిగా మహారాష్ట్రలో విజయం సాధించలేదు. కేరళలో కూడా ఆ విధమైన ఎత్తుగడలను నిరోధించేందుకు అప్రమత్తంగా వుండాల్సిన అవసరముంది.
వ్యాసకర్త సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎం.వి. గోవిందన్