Oct 13,2023 15:40

బీజింగ్‌: ఇజ్రాయెల్‌ దౌత్యవేత్తపై చైనాలో దాడి జరిగింది. రాజధాని బీజింగ్‌లో ఇజ్రాయెల్‌ దౌత్య సిబ్బందిని కత్తితో పొడిచారు. గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ దౌత్య ప్రతినిధి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఇజ్రాయెల్‌ తెలిపింది. అయితే ఈ దాడికి కారణం ఏమిటన్నది తెలియలేదని పేర్కొంది. అలాగే కత్తి దాడికి ఎవరూ బాధ్యత వహించలేదని చెప్పింది. బీజింగ్‌లోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయంలో కాకుండా మరోచోట ఈ సంఘటన జరిగినట్లు వెల్లడించింది.కాగా, గత శనివారం ఐదు వేల క్షిపణులతో హమాస్‌ దాడులు చేయడం, పలువురు పౌరులు, సైనికులను చంపడంపై ఇజ్రాయెల్‌ రగిలిపోతున్నది. గాజాపై వరుసగా విరుచుకుపడుతున్నది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరుగడంతో శక్రవారం ముస్లింలు తమ ఆవేశాన్ని ప్రదర్శించాలని హమాస్‌ పిలుపునిచ్చింది. దీంతో పలు దేశాల్లో ముస్లింలు హమాస్‌కు మద్దతుగా ప్రార్థనలు చేయడంతోపాటు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెలీలు, యూదులు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ వ్యాప్తంగా సూచనలు జారీ అయ్యాయి.