Jun 27,2023 10:57

ప్రజాశక్తి, ఎంవిపి కాలనీ (విశాఖ) : దౌర్జన్యంగా చేస్తున్న చెత్తపన్ను వసూళ్లను ఆపాలని సిపిఐఎం డిమాండ్‌ చేసింది.

మంగళవారం ఉదయం పిఠాపురంకాలనీ, కళాభారతి రోడ్డులో ఉన్న సిపిఐఎం విశాఖ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఎం కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు మాట్లాడుతూ .... సచివాలయ సిబ్బందిని, వాలంటీర్లను ఉపయోగించి ప్రజల నుండి దౌర్జన్యంగా చెత్తపన్నుల వసూలుకు రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం పూనుకుందన్నారు. చెత్తపన్ను చెల్లించకపోతే అమ్మ ఒడి పథకం ఆపేస్తామని తాజాగా బెదిరిస్తున్నారని ఆరోపించారు. చెత్తపన్ను టార్గెట్‌ ప్రకారం వసూలు చేయలేదని 10 మంది సచివాలయ ఉద్యోగులను సస్పెండ్‌ చేశారని చెప్పారు. ఈ దౌర్యన్యపూరిత చర్యలు వెంటనే ఆపాలని, లేనిపక్షంలో వైసిపి ప్రభుత్వాన్ని ప్రజలు అధికారం నుండి దించక తప్పదని సిపిఐఎం హెచ్చరిస్తున్నదన్నారు. విశాఖ నగర ప్రజలంతా ఆస్తిపన్ను చెల్లిస్తున్నారని, దీనిలో చెత్తసేకరణ ఛార్జీలున్నాయని అన్నారు. మళ్లీ ఎందుకు చెత్త పన్ను చెల్లించాలి ? అని ప్రశ్నించారు. బాధ్యతగల ప్రభుత్వమైతే ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని, చెత్త పన్నును రద్దు చేయాలని అన్నారు. అంతేకాకుండా చెత్తపన్ను కట్టాలని ప్రజలకు నోటీసులు జారీచేయగలరా ? అని అడిగారు. చెత్త పన్నును రద్దు చేయాలని అందుకే సిపిఐఎం కోర్టులో కేసు వేసిందన్నారు. చట్టబధ్ధంగా పాలన సాగించాల్సిన ప్రభుత్వమే చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోంది ? ప్రజలపై దౌర్జన్యం చేస్తారా ? ఉద్యోగులను వేధిస్తారా ? దౌర్జన్యం చేసి పాలన సాగిస్తారా ? ఇందుకోసమేనా ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది ? అని సిపిఐఎం ప్రశ్నిస్తున్నదన్నారు. ప్రజలను, ఉద్యోగులను బెదిరించిన ఏ ప్రభుత్వమూ బతికి బట్టకట్టలేదని ఈ విషయాన్ని సిఎం జగన్‌ ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. బాధ్యత గల జిల్లాలో మంత్రి, ఎంఎల్‌ఏలు, కార్పొరేటర్లు, చైర్మన్లు ఉన్నారని అన్నారు. ప్రజలపై ఈ భారాలను ఆపే బాధ్యత వారికి లేదా ? ఎందుకు మాట్లాడం లేదు ? అని ప్రశ్నించారు. రేపు ప్రజల వద్దకు ఎలా వస్తారు ? అని అడిగారు. ప్రజా ప్రతినిధులు ప్రజలపక్షాన నిలవాలని సిపిఐఎం పార్టీ డిమాండ్‌ చేస్తున్నదన్నారు. చెత్తపన్నులపై మొదటి దశలో ప్రజలు పెద్దఎత్తున పోరాడారనీ, ప్రభుత్వం ఎన్ని నిర్భాంధాలు ప్రయోగించినా తిప్పికొట్టారనీ గుర్తు చేశారు. ప్రజలకు అండగా సిపిఐఎం నిలిచిందన్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లే తగ్గి మళ్లీ బెదిరింపులకు వేధింపులకు దిగిందన్నారు... వీటిని తక్షణమే ఆపాలని, లేనిపక్షంలో రెండవ దశ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్‌ బి.గంగారావు మాట్లాడారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, జిల్లా కమిటీ సభ్యులు వి.కఅష్ణారావులు పాల్గొన్నారు.