Jul 27,2023 22:15

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఆర్థిక స్థోతమ లేని రాష్ట్రవిద్యార్ధులకు విదేశాల్లో చదువుకునేందుకు విదేశీ విద్యాదీవెన పథకం ఒక వరం అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ఈ పథకం అన్ని విధాలుగా విద్యార్ధులకు భరోసా ఇస్తుందన్నారు. అత్యంత పారదర్శకంగా ఎక్కడా వివక్ష, లంచాలు లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. క్యూఎస్‌ లేదా టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలిచిన టాప్‌-50 విద్యాసంస్థల్లో సీటు వచ్చిన ఎవరైనా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చునని వివరించారు. సామాన్యుడికి ప్రఖ్యాత యూనివర్సిటీల్లో చదవడం సాధ్యం కాదన్నారు. ఇలాంటి కళాశాలల్లో చదివి బయటకు వస్తే ప్రపంచాన్ని శాసించే విధంగా పెద్ద కంపెనీల్లో సిఇవోలుగా ఉద్యోగాలు చేసే స్థాయి వస్తుందన్నారు. గత ప్రభుత్వంలో ఎస్సీలకు రూ.10లక్షలు, ఎస్‌టిలకు రూ.15లక్షలు నిధులు అరకొరగా ఇచ్చారని విమర్శించారు. ఇప్పుడు రూ.1.32కోట్లు వరకు ఫీజులు ఇస్తున్నామని వివరించారు. ఇదో విప్లవాత్మకమైన అడుగు అని, రాబోయే రోజుల్లో, రాబోయే తరాలు ఆంధ్రరాష్ట్ర ఖ్యాతిని గుర్తుంచుకునే విధంగా విద్యార్థులకు సపోర్టు చేస్తున్నామని అన్నారు. ఈ పథకాన్ని నాలుగు విడతలుగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర, సాంఘిక సంక్షేమ శాఖమంత్రి మేగుగు నాగార్జున, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి, బిసి, సాంఘిక సంక్షేమ, ఉన్నత విద్య, ముఖ్యకార్యదర్శులు జి అనంతరాము, బి జయలక్ష్మి, జె శ్యామలరావు, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శులు కాంతిలాల్‌ దండే, ఎండి ఇంతియాజ్‌, గిరిజన శాఖ డైరెక్టర్‌ జె వెంకట మురళీ, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.