
ప్రఖ్యాత రచయిత సల్మాన్ రష్దీపై దాడి ప్రజాస్వామ్యవాదులకు కలవరపాటు. న్యూయార్క్‌లో శుక్రవారం సాహిత్య సంబంధిత కార్యక్రమంలో దుండగుడు అమాంతం వేదికపైకి దూసుకొచ్చి రష్దీపై కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ సల్మాన్ చావు అంచులదాకా వెళ్లారు. మూడవ రోజుకుకాని ప్రాణాపాయం నుంచి బయట పడ్డట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. కుడి కన్ను కోల్పోయేలా ఉందని కాలేయానికి ప్రమాదం ఏర్పడిందని రష్దీ సన్నిహితులు చెబుతున్నారు. దాడిపై ప్రపంచ నలు దిశల నుంచి ఖండనలు, రష్దీకి సంఘీభావాలు వెల్లువెత్తుతున్నాయి. హత్యాయత్నానికి పాల్పడ్డ దుండగుడిని పోలీసులు ఘటనా ప్రదేశంలోనే అదుపులోకి తీసుకోగా లెబనాన్ మూలాలున్న అమెరికా యువకుడు హాది మతార్‌గా గుర్తించారు. షియా అతివాదంతో, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్‌తో అతనికి సంబంధాలున్నాయని దర్యాప్తులో వెల్లడైనట్లు వార్తలొస్తున్నాయి. మతార్ ఫేస్‌బుక్ పేజీలో ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖోమేనీ ఫోటో ఉన్నట్లు కనుగొన్నారు. కాగా ఆ యువకునితో తమకెలాంటి సంబంధం లేదని ఇరాన్ ఖండించింది. సల్మాన్ రష్దీ భారత మూలాలున్న రచయిత. 1947లో ముంబయిలో జన్మించిన ఆయన బ్రిటన్‌కు వలస వెళ్లి అనంతరం అమెరికాలో స్థిరపడ్డారు. రష్దీ రచించిన 'మిడ్‌నైట్ చిల్డ్రన్' నవలకు 1981లో బుకర్ ప్రైజ్ వచ్చింది. 1988లో వచ్చిన 'ది సెటానిక్ వెర్సెస్' నవల వివాదాస్పదమై ఇండియా సహా పలు దేశాల్లో నిషేధానికి గురైంది. అప్పటి నుంచే ఆయనను ప్రాణహాని ముప్పు వెంటాడుతోంది.
రష్దీపై దాడి వాక్ స్వాతంత్య్రంపైన, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపైన, ప్రజాస్వామ్య ఆకాంక్షలపైన దాడి. 75 ఏళ్ల రష్దీపై హత్యాయత్నానికి పురికొల్పింది మత మూర్ఖత్వం. రష్దీ రాసిన నవల 'ది సెటానిక్ వెర్సెస్' ఇస్లాంను కించపర్చిందన్నది కొందరి అభ్యంతరం. ఇరాన్ ప్రభుత్వం రష్దీ తలకు మూడు మిలియన్ డాలర్ల వెల కట్టింది. రష్దీ అంతం కోసం ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా 1989 లోనే ఫత్వా జారీ చేశారు. భారత్ సహా సదరు నవలను ప్రచురించిన చోట్ల అప్పట్లో హింస చెలరేగింది. హత్యలూ చోటు చేసుకున్నాయి. ప్రాణభయంతో రష్దీ పదేళ్లపాటు రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. బ్రిటన్ నుంచి అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అక్కడ పటిష్ట భద్రత మధ్య దినదిన గండంలా బతుకుతున్నారు. తన చుట్టూ అనుక్షణం కాపలా కాస్తున్న భద్రతా వలయంపై ఆయన అసహనం వెలిబుచ్చాల్సి వచ్చింది. రష్దీ చేసిన తప్పు తన భావాలను స్వతంత్రంగా వెల్లడించడమే. నవలను నవలగా కాకుండా మత విశ్వాసాలతో ముడిపెట్టి ఉన్మాదాన్ని నూరిపోయడం అనాగరిక చర్య. సృజనాత్మక వ్యక్తీకరణకు స్వేచ్ఛ లేకుంటే అంతకంటే దారుణం ఉండదు. కాగా రష్దీపై దాడిని హర్షించేవారూ ఉండటం మత మౌఢ్యానికి పరాకాష్ట.
నిజాన్ని నిర్భయంగా చాటి చెప్పేవారికి 'శిక్షలు' సోక్రటిస్, మొదలుకొని మన చార్వాకుల వరకు వందల వేల సంవత్సరాల చరిత్రలో నిక్షిప్తమయ్యాయి. నయా-ఉదారవాద విధానాలలో పెట్టుబడిదారీ సంక్షోభం తీవ్రమయ్యాక ప్రపంచ వ్యాప్తంగా మితవాద రాజకీయాలు, భావాల వ్యాప్తి ఒక పథకం ప్రకారం సైద్ధాంతికంగా సాగుతున్నాయి. మన దేశంలో బిజెపి అధికారంలోకొచ్చాక తమకు నచ్చని భావాలు వ్యక్తీకరించే వారిపై పాశవిక దాడులు పెరుగుతున్నాయి. దబోల్కర్, పన్సారే, కల్బుర్గి, గౌరీ లంకేష్ లను హిందూ మతోన్మాదులు హత్య చేశారు. మరెందరినో బెదిరించారు. తమ సిద్ధాంతానికి ఎదురు చెప్పకూడదనే ఫాసిస్టు తరహా పోకడలు ప్రజాస్వామ్యానికి హానికరం. తర్కానికి నిలబడలేని వారే ఇటువంటి హేయమైన చర్యలకు పాల్పడతారు. స్వేచ్ఛగా భావాలు వ్యక్తీకరించే వారిపై ఇటువంటి దాడులు దిగ్భ్రాంతికరం. వాక్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న, నిర్భీతిగా నిజాలు తెలియజేసే రష్దీ వంటి వారిపై కత్తి కట్టడం భయానకం. మతానికి మతతత్వం మూర్తీభవించిన ఉగ్రవాదానికి సంబంధం లేదు. ఏ మతోన్మాద టెర్రరిజమైనా టెర్రరిజమే. రాయడం, భావవ్యక్తీకరణ, స్వేచ్ఛ కోరుకునే ప్రజాస్వామ్యవాదులందరూ రష్దీపై హత్యాయత్నాన్ని ఏకోన్ముఖంగా ఖండించాలి. దాడులతో సత్యాన్ని నిలువరించడం భ్రమే.