
డెబ్బై ఐదవ స్వాతంత్య్ర దినోత్సవ వేళ కొన్ని విషయాలు మనల్ని హెచ్చరిస్తున్నాయి. 'తర్కించే భారతీయులకు' ఇంకా ఎంతకాలం ఆ స్వాతంత్య్రం ఉంటుంది? అన్న ప్రశ్న వెంటాడుతోంది. ప్రఖ్యాత న్యాయవాది, మానవ హక్కుల నేత, మతోన్మాదంపై ధైర్యంగా పోరాడుతున్న ధీశాలి తీస్తా సెతల్వాద్, ఐపీఎస్ అధికారి ఆర్‌బి శ్రీకుమార్ నేడు జైల్లో మగ్గుతున్నారు. 2002లో గుజరాత్ మరణహోమంలో బాధితుల తరపున నిలబడ్డారు వీరు. రాజ్యాంగం వారికిచ్చిన హక్కుల మేరకే వారు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. నేడు అదే నేరమైంది. వారి పిటిషన్లను కొట్టేస్తూ సుప్రీం చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం కానివి. అసలే పగతో రగిలిపోతున్న కార్యనిర్వాహకవర్గం వారిని అరెస్టు చేసి బెయిల్ రాని సెక్షన్లతో కటకటాల వెనక్కి నెట్టేసింది. తర్కాన్ని, భిన్నాభిప్రాయాన్ని, ప్రజాతంత్ర హక్కులను మొండిగా తిరస్కరించడం భారత రాజ్యాంగానికి అవమానం. ఇది రాజకీయ, సాంస్కృతిక సమస్య కూడా.
తన దేశ సంస్కృతి స్వచ్ఛతను కాపాడుకునేందుకు జర్మనీ ''యూదుల ఊచకోత ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది'' అని ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతవేత్త ఎమ్మెస్ గోల్వాల్కర్ రాశారు. ''భిన్న జాతులు సంస్కృతులు కలిసి ముందుకు సాగలేవని ఒకదానితో ఒకటి కలిసి జీవించలేవని జర్మనీ నేర్పిన పాఠం హిందూ దేశానికి ఉపయోగ పడుతుంది'' అని కూడా అన్నారు. సంస్కృతి గురించి, జాతి గురించి గోల్వాల్కర్ చెప్పే భాష్యం మన రాజ్యాంగానికే వ్యతిరేకం అని వేరే చెప్పనక్కర్లేదు.
కానీ ఆర్‌ఎస్‌ఎస్ నియంత్రణలోని బీజేపీ పాలన మెల్లగా ''హిందూ రాష్ట్ర'' అనేదాని సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడానికి దేశ సాంస్కృతిక రంగంలో జోక్యం చేసుకుంటున్నది. చరిత్రను వక్రీకరించడం ద్వారా విద్యను మత, కుల సంబంధిత అంశంగా మారుస్తున్నది. స్వయం ప్రతిపత్తిగల రాజ్యాంగ సంస్థల నిర్వహణలో ఆ జోక్యం స్పష్టంగా కనబడుతున్నది. భారత సమాజంలో వేళ్ళూనుకున్న ప్రజాతంత్ర సాంప్రదాయాల వల్ల...అనేకమంది మేధావులు, కళాకారులు, రచయితలు, సాంస్కృతిక కార్యకర్తలు ఇప్పటికీ ...దీన్ని ధైర్యంగా ఎదిరించి తమ అభిప్రాయాలను నిర్ద్వంద్వంగా ప్రకటించగలుగుతున్నారు.
అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వారిపై వివిధ పేర్లతో పిలువబడే సేనలను ఉసిగొలుపుతున్నారు. ఈ దుర్మార్గాలకు డాక్టర్ ఎం.ఎం.కల్బుర్గి, గోవింద్ పన్సారే, నరేంద్ర దభోల్కర్, గౌరీ లంకేష్, స్టాన్ స్వామి వంటి ఎందరో అసువులు బాశారు. ఈ సందర్భంగా నయన్‌తార సెహగల్, సచ్చిదానందన్, ఉదరు ప్రకాష్, చెమన్‌లాల్, రెహమాన్, అబ్బాస్ వంటి ధీరులు ఇటువంటి దాడులను నిరసిస్తూ తమకొచ్చిన అకాడమీ అవార్డులను సైతం తిరిగి ఇచ్చేయడాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. వారు ఈ హింసను, మారణకాండను బహిరంగంగా ఖండించారు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న రాజ్య ఉగ్రవాదం తనకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డాక్టర్ ఆనంద్ తెల్‌తుందే, సుధా భరద్వాజ్, వరవరరావు వంటిఎందరో మేధావులను, మానవ హక్కుల నేతలను భీమా కోరేగావ్ కేసులో అక్రమంగా ఇరికించింది. ఉపా చట్టం వల్ల వారంతా నేడు జైల్లో మగ్గుతున్నారు. సంఘ్ పరివార్, దాని తొత్తులు తయారు చేస్తున్న నకిలీ వార్తల లోగుట్టు బయటపెట్టిన ఆల్ట్ న్యూస్ అధినేత మహమ్మద్ జుబేర్ కూడా నేడు తప్పుడు కేసులో ఇరికించబడ్డాడు.
వారి మూక దాడులు, హత్యలు, బెదిరింపులు, మెజారిటీ ప్రజలను కదిలించే సోషల్ ఇంజనీరింగ్ విధానాలు ఇవన్నీ వెన్నులో చలి పుట్టించే అంశాలు. మైనారిటీల వ్యతిరేక ప్రచారం కూడా దీంతో కలిసే సాగుతోంది. ''జర్మనీలో నాజీలు అమలు చేసిన విధానాన్ని ఈ దేశంలో మనం అమలు చేసి ప్రయోజనం పొందాల''ని గోల్వాల్కర్ చెప్పిన దాన్ని సంఫ్‌ుపరివార్ మనసా, వాచా అమలు చేస్తున్నది. 2021 డిసెంబర్ 16-18 తేదీల్లో హరిద్వార్‌లో నిర్వహించిన ధర్మ సంసద్ లో యోగులు, యోగినిలు తమ సుదీర్ఘ ఉపన్యాసాలను...దేశంలో మైనారిటీలను నరికి పోగులు పెడితేనే హిందూ రాష్ట్ర సాధ్యమన్న మాటలతో ముగించారు. ఇలా మన రాజ్యాంగం, దేశంలోని చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వీరిలో ఏ ఒక్కరినీ అరెస్టు చేయలేదు. శిక్షించలేదు. ప్రధాని గానీ, హోం మంత్రి గానీ ఆ పిలుపుల నుండి దూరం జరగలేదు. వాటిని తప్పు పట్టలేదు. ఎందుకంటే అవన్నీ వాళ్లు కోరుకునేవే. మన దేశంలో నేడు అధిక సంఖ్యాకుల మతోన్మాదమే ఇంగిత జ్ఞానంగా సమాజంలో పరిగణించ బడుతోంది. దీనికి సంఘ్ పరివార్ ఎన్నో సంస్థలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని సాంస్కృతిక సాధనాలుగా వాడుతోంది. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాల ద్వారా పని ప్రదేశాల్లో, ఇళ్ల వద్ద కూడా వారిని కలవడం ద్వారా ఈ పనిని సుసాధ్యం చేస్తోంది. దీనికోసం వారు వార్డు కమిటీల్లో దేవాలయ కమిటీల్లో చొరబడ్డారు. వారి దుర్మార్గమైన ఎజెండాను శక్తివంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రజల సమ్మతిని సాధించటానికి సోషల్ మీడియాను సాధనంగా చేసుకుంటున్నారు. మన దేశంలో 26.5 కోట్లు యూట్యూబ్ చూసేవారు, 32.9 కోట్లు ఫేస్ బుక్ వాడేవారు, 45.9 కోట్లు వాట్సాప్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో సంఫ్‌ుపరివార్ చొరబడ్డ తీరు నమ్మశక్యం కాని విధంగా ఉంది. ఎవరైనా వారిని సోషల్ మీడియాలో ఎక్స్‌పోజ్ చేస్తే మరుక్షణం ఆర్‌ఎస్‌ఎస్ వారి సైబర్ వాలంటీర్లు అసత్యాలతో రంగంలోకి దూకేస్తారు. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలతోపాటు, నయానో భయానో లొంగదీసుకున్న ఎలక్ట్రానిక్ మీడియా, ఇతర సాంస్కృతిక పనిముట్లు, పుస్తకాలు, పాటలు, సినిమాలను బీజేపీ శక్తివంతంగా వినియోగిస్తోంది. దీనికి మంచి ఉదాహరణ కాశ్మీర్ ఫైల్స్. దాని విద్వేష ఎజెండాని కళ ద్వారా వెదజల్లటంలో ఈ సినిమా శక్తివంతంగా ఉపయోగపడింది. హిందూ రాష్ట్ర స్థాపన కోసం మొత్తం భారతీయ సమాజాన్ని మతోన్మాద భావాలతో నింపడంతో పాటు దేశ బడా బూర్జువా వర్గ ప్రయోజనాలను, ఫైనాన్స్ పెట్టుబడి ప్రయోజనాలను ఇది రక్షిస్తోంది. ఈ పరిస్థితుల్లో కార్మికులు, రైతులు, శ్రామికులు భాగస్వాములుగా సాగిన స్వాతంత్య్ర పోరాటం ఫలితంగా సాధించుకుని, భారత రాజ్యాంగంలో పదిలపరుచుకున్న లౌకిక, ప్రజాస్వామ్య, సమానత్వ విలువలను మనం కాపాడుకోవటం ఎలా? సవాళ్ళతో కూడిన పరిస్థితులలో ప్రజలను చైతన్యవంతులను చేయటంలో సాంస్కృతిక రంగం ఎంతో ఉపయోగపడుతుంది. సాంస్కృతిక రంగంలో కర్తవ్యాల గురించి సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ఒక డాక్యుమెంటును ఆమోదించింది. భారతదేశపు సాంస్కృతిక రంగంలో కనపడుతున్న ధోరణులను విశ్లేషించిన తరువాత, ఆ రంగంలో తక్షణమే నిర్వహించాల్సిన కర్తవ్యాలను ఈ విధంగా ప్రకటించింది. సాంస్కృతిక జాతీయవాదం పేరుతో మతతత్వవాదులు సమర్థిస్తున్న దానిని, 'మత భావోద్వేగం', 'కులాధిపత్యం' పేరు మీద జరిపే అన్ని రకాల అసహనాన్ని ప్రతిఘటించాలి. భాష, జాతి, ప్రాంతీయ వైవిధ్యాలతో ప్రజలు అనుసరిస్తున్న సాంస్కృతిక పద్ధతులను గుర్తించి ప్రోత్సహించాలి. ఇటువంటి భిన్న ఆచారాలు పాటిస్తున్న ప్రజల మధ్య సత్సంబంధాలను, అవగాహనను పెంపొందించాలి. ఇటువంటి విభిన్న సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకుగాను దాడులకు గురవుతున్న మేధావులు, కళాకారులకు మద్దతుగా ప్రత్యేక శ్రద్ధతో అంకితభావంతో నిలబడాలి. ఛాందసత్వం, మత దురభిమానం, మూఢనమ్మకాలు, అహేతుకత్వం...వంటి వాటిని ఎండగట్టాలి. అదేవిధంగా, ప్రభుత్వ విద్యారంగాన్ని సమర్థించాలి. శాస్త్రీయ, మేధోపర, సాంస్కృతిక సంస్థలను సమర్థించాలి. ఉన్నత విద్యా, పరిశోధనా కేంద్రాలపై దాడులను వ్యతిరేకించాలి. మానసిక స్వాంతనను ఆపేక్షిస్తూ 'మత' సంస్థలపై ప్రజలకున్న విశ్వాసాన్ని అలుసుగా తీసుకుని వారిపై యథేచ్ఛగా జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా నిలబడాలి, వాటిని బట్టబయలు చేయాలి. మతాన్ని ఒక పెద్ద వ్యాపారంగా చేసుకున్న విభిన్న సంప్రదాయాల 'ఆధ్యాత్మిక' గురువులు ప్రజలలో అవివేకాన్ని, మూఢనమ్మకాలను ఎక్కిస్తున్నారు. తమ భక్తులలో విభజన, మతోన్మాద బీజాలు నాటుతున్నారు. అనేక ప్రార్థనా స్థలాలలో మతోన్మాద, తీవ్రవాద సంస్థలు చురుకుగా పని చేస్తున్నాయి. పండుగ సందర్భాలలో జరిగే కార్యక్రమాలలో వీరు అధిపత్యం చెలాయిస్తూ మతతత్వ విచ్ఛిన్న పోకడలే పనిగా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రతి ప్రాంతంలో అక్కడ ఉన్న నిర్దిష్ట పరిస్థితుల ఆధారంగా మన కార్యకర్తలు జోక్యం చేసుకుని, సాధ్యమైనంతవరకు పరిస్థితులు తప్పుదారి పట్టకుండా అడ్డుకునే ప్రయత్నం చేయాలి. ప్రజల మతోన్మాదం బారిన పడకుండా మతతత్వ విషపు కాటుకు బలి కాకుండా రక్షించటం మన పని. మతాన్ని ఆచరించే ప్రజలతో సహా మతోన్మాదం లేని అన్ని తరగతుల ప్రజలను, సమీకరించి అన్ని రకాల మతతత్వంపై పోరాడాలి. కొన్ని ప్రగతిశీల సెక్షన్లకు, కొన్ని సందర్భాలలో ఈ తేడా గురించి స్పష్టమైన అవగాహన లేదు. ఎలక్ట్రానిక్ మీడియా మీద కార్పొరేట్ పెట్టుబడికి వున్న గట్టి పట్టు కారణంగా ప్రింట్, ఆడియో, విజువల్ (దృశ్య, శ్రవణ) ప్రసార సాధనాలలో జరిగిన సాంకేతిక అభివృద్ధి ఫలాలు ప్రజల కోసం ఉపయోగపడటం లేదు. ఈ మీడియా ప్రపంచంలో తిరిగి మనం స్థానం సంపాదించుకోవటానికి క్రమమైన, ప్రణాళికా పద్ధతిలో ప్రయత్నాలు చేయవలసి వుంది. తెలివితక్కువ వ్యాపార ప్రకటనలు, పనికిమాలిన వార్తలు, నీచమైన నిరూపయోగమైన రియాలిటీ షోలు, పితృస్వామిక, స్త్రీలను ద్వేషించే సీరియళ్ళు, ఇంకా ఇతర చెత్త ప్రసారాలు-ఇవే ఎలక్ట్రానిక్ మీడియాలో ఆధిపత్యం వహిస్తున్నాయి. ఆన్‌లైన్ ప్రచురణలు, సోషల్ మీడియా, డాక్యుమెంటరీ చిత్రాలు, కమ్యూనిటీ రేడియో మొదలైనవి అంతో ఇంతో ఈ టెక్నాలజీని వాడుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా తిరిగి కొంత స్థానాన్ని సంపాదించాయి. ఈ మార్గంలో ప్రావీణ్యం సంపాదించిన వారిని ప్రోత్సహించాలి. ఆ దిశగా ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగేందుకు ప్రోత్సాహం ఇవ్వాలి. పిల్లలు, విద్యార్థులు, యువతకు రక్షణ కల్పించి, వారిలో స్వతంత్ర సృజనాత్మక శక్తి పెరిగేలా మనం చూడాలి. వారి ఆకాంక్షలు, ఆశలు ఈ నాటి క్రూరమైన వినిమయతత్వపు పోటీలోనో, విద్వేషాల ఆరాధనలోనో, పరస్పర విధ్వంసపు పరుగులోనో కొట్టుకుపోకుండా చూడాలి. వీరి విద్యాహక్కులు, అత్యంత అధునాతన పరిజ్ఞానాన్ని పొందే హక్కును గురించి గట్టిగా చెప్పాలి. ప్రపంచం అంతటా ప్రభుత్వాలు మరింత నిరంకుశంగా మారుతున్నాయి. వీలైన చోటల్లా రాజ్యాలు, ప్రభుత్వాలు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టుకుంటున్నాయి. అనేక సందర్భాలలో జాతీయ భద్రత పేరిట సామాన్య ప్రజలు ఈ అధికారాలను ఆమోదిస్తున్నారు, లేనిపక్షంలో బలవంతంగా నైనా వారి చేత ఒప్పిస్తున్నారు. ఎక్కడయితే నిరంకుశాధికార రాజ్యం ప్రజాతంత్ర, మానవ హక్కుల అతిక్రమణకు పాల్పడిందో అక్కడ పౌర హక్కుల పరిరక్షణకు మనం నిలబడాలి. రాజ్యానికి అడ్డూ అదుపూ లేని అధికారాలు కల్పించి, అసమ్మతిని ఇష్టారీతిన అణచి వేసే హక్కులు ఇచ్చే అమానుష చట్టాలను వ్యతిరేకించాలి. 1989లో మలయాళ రచయిత వైకోమ్ ముహమ్మద్ బషీర్ (1908-1994) స్వాతంత్య్ర సమర యోధుల సమావేశంలో ఆలోచన కలిగించే మాట ఒకటి చెప్పారు. గాంధీజీని నాథురాం గాడ్సే దుర్మార్గంగా హత్య చేసిన విషయాన్ని వివరిస్తూ ఆయన ఇలా అన్నారు... ''గాడ్సే తుపాకి నుంచి వచ్చిన విషపు గాలులు ఈనాడు భారతదేశం అంతా విస్తరిస్తున్నాయి. సత్యం, న్యాయం, ధర్మం, ప్రేమ, దయ చెరిపెయ్యలేనివి. మంచితనం పూలు ఇక్కడ వికసిస్తూనే ఉన్నాయి. అయితే, విషపు గాలులకు అవి ఆవిరవుతున్నాయి.'' బషీర్ మేధావి అయినందువలన ఒక దశాబ్దం ముందే మన దేశ దుస్థితిని గ్రహించగలిగాడు. నిరంతరం ప్రజల మధ్య పని చేయటమే వామపక్ష, ప్రజాస్వామ్య, ప్రగతిశీల ఉద్యమం ముందున్న కర్తవ్యం. వ్యక్తిగతంగా ప్రజలను కలుసుకోవడం ద్వారా వారితో సజీవ సంబంధాలు ఏర్పరచుకోవాలి. ఆధునిక శాస్త్రీయ సమాచారం సౌకర్యాలను వాడుకోవటం ఒక ముఖ్యమైన ప్రాథమిక చర్య. అదేవిధంగా, ప్రజాస్వామ్య, లౌకిక, సామాజిక పురోగతి, సమానత్వ సాధనకు బలమైన ప్రజా ఉద్యమం నిర్మించే దిశలో విశాలమైన వేదిక కోసం ఖచ్చితమైన ప్రయత్నాలు చేయటం చాలా అవసరం. ఈ లక్ష్య సాధనలో విజయం పొందాలంటే మన దేశ పాలనా పద్ధతులపై సంఫ్‌ుపరివార్ అధిపత్యాన్ని బట్టబయలు చేసి, దానిని ఒంటరి చేయాలి.
వ్యాసకర్త : సిపి(ఐ)ఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎం.ఎ. బేబి