May 25,2023 06:34

రాజుల కాలంలో తమ రాజ్యంలో ప్రజా సమస్యలను వేగుల ద్వారా తెలుసుకొని పరిష్కరించేవారు. స్వయంగా రాజులే మారువేషాల్లో పర్యటించి జనం బాధలు ఆకళింపు చేసుకొని తీర్చేవారు. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందాక హెల్ప్‌లైన్లు, టోల్‌ఫ్రీ నెంబర్లు వచ్చాయి. తమ సంక్షేమ పాలనలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలు విని వాటిని నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం 'జగనన్నకు చెబుదాం' అనే కార్యక్రమాన్ని మే 9న ప్రారంభించింది. అన్ని రకాల అర్హతలూ ఉండి కూడా సంక్షేమ పథకాలు అందనివారు, ప్రభుత్వ సేవల నిమిత్తం '1902' అనే నెంబర్‌కు ఎవరైనా కాల్‌ చేయవచ్చు. ఫిర్యాదును రికార్డు చేసుకొని సంబంధిత డిపార్టుమెంట్‌ అధికారికి రిఫర్‌ చేస్తారు. అర్జీకి యువర్‌ సర్వీస్‌ రిక్వెస్ట్‌ (వైఎస్‌ఆర్‌) పేరిట ఒక ఐడి కేటాయిస్తారు. స్టేటస్‌పై ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌, ఐవిఆర్‌ఎస్‌ ద్వారా మొబైల్‌కు ఇన్ఫర్మేషన్‌ వస్తుంది. 24×7 ప్రాతిపదికన పని చేసే ఈ హెల్ప్‌లైన్‌ను నేరుగా సి.ఎం. కార్యాలయం పర్యవేక్షిస్తుంది. టోల్‌ఫ్రీ నెంబర్‌, వెబ్‌సైట్‌ ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ చెప్పిందిది. హెల్ప్‌లైన్‌ మొదలై రెండు వారాలు దాటింది. సమస్యల పరిష్కారం కోసం కిందిస్థాయిలో కాళ్లరిగిపోయేలా తిరుగుతున్న బాధితులు, తమ గోడు ముఖ్యమంత్రి వింటారు, ఆయన దృష్టికెళ్తుంది అని ఆశపడగా, ఆదిలోనే నిరాశ ఎదురవుతోంది. కాల్స్‌ కలవట్లేదు. కలిసినా సమస్యకు పరిష్కారం లభించట్లేదు.
హెల్ప్‌లైన్‌కు ప్రభుత్వం పరిమితులు విధించింది. కేవలం వ్యక్తిగత సమస్యలపైనే కాల్‌ చేయమంది. పెన్షన్‌, రేషన్‌కార్డు, ఇటువంటివి. ఇప్పటికే నవరత్న పథకాలను సంతృప్త స్థాయిలో అర్హులందరికీ అందించామని ఘంటాపథంగా ప్రకటించిన సర్కారు, తిరిగి వాటిపైనే ఫిర్యాదులు ఆహ్వానించడం దేనికో అర్థం కాదు. హెల్ప్‌లైన్‌ సామూహిక సమస్యలను అంటుకోబోదు. ఉదాహరణకు ధాన్యం కొనట్లేదని రైతు ఎవరైనా ఫిర్యాదు చేస్తే అది సామూహిక సమస్య అవుతుందా, వ్యక్తిగతమా? నకిలీ, కల్తీ విత్తనాల బెడద ఏ కేటగిరీ సమస్య? ఆరోగ్య సేవలకు సంబంధించినవీ? ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం కమ్యూనిటీ ప్రాబ్లమ్స్‌ కింద జమకడితే ఎలా? కార్పొరేట్‌ విద్యాసంస్థలు, ఆస్పత్రుల ఆగడాలు ఏ రకం సమస్యల కిందికొస్తాయి? దళితులు, మహిళలపై దాడుల పరిస్థితేంటి? ఫలానా రకం ఫిర్యాదులే చేయాలి అనే ఆంక్షలు ప్రజలకు విధించిన పక్షంలో ప్రభుత్వం ప్రారంభించిన హెల్ప్‌లైన్‌ వలన ప్రజలకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు.
ప్రభుత్వం ప్రతి సోమవారం 'స్పందన' కార్యక్రమం అన్ని స్థాయి ప్రభుత్వ ఆఫీసుల్లో నిర్వహిస్తోంది. ప్రజలు మహజర్లు సమర్పిస్తున్నారు. 'స్పందన' వినతుల స్థితిగతులపై స్వయంగా ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు. అయినా అర్జీలు బుట్టదాఖలవుతుండటంతో 'స్పందన'పై ప్రజల్లో స్పందన తగ్గింది. తాజాగా ప్రారంభించిన 'జగనన్నకు చెబుదాం' సైతం అంతకన్నా భిన్నంగా లేదు. ఎన్ని ఫిర్యాదులొచ్చాయి, వేటిని పరిష్కరించారు అనే విషయాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు వెల్లడిస్తే పారదర్శకత అనిపించుకుంటుంది. ఫిర్యాదుదారులకు వ్యక్తిగతంగా వెల్లడిస్తే సరిపోదు. గత టిడిపి ప్రభుత్వంలో నిర్వహించిన ప్రజావాణి, పీపుల్స్‌ ఫస్ట్‌, తదితరాలు ఆర్భాటానికే పనికొచ్చాయి. ప్రస్తుత వైసిపి ప్రభుత్వమూ అదే ధోరణిలో కొనసాగుతోంది. అధికారంలోకొచ్చిన నాలుగేళ్ల తర్వాత ఎన్నికల ఏడాదిలో హెల్ప్‌లైన్‌ ఆలోచన స్ఫురించింది. గతంలో ప్రజలను నేరుగా కలిసేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 'ప్రజాదర్బార్‌'ను నిర్వహించారు. 'రాజన్న రాజ్యం' అని చెప్పిన సిఎం జగన్‌ మోహన్‌రెడ్డి సైతం అటువంటిది నడుపుతారనే ప్రచారం సాగింది. ప్రజాస్వామ్యంలో జనం సమస్యలు విని త్వరితగతిన పరిష్కరించడం ప్రభుత్వాల బాధ్యత. కేవలం ప్రచారార్భాటం కోసమే హెల్ప్‌లైన్‌ అయితే ప్రజలకు అటువంటి కార్యక్రమాలపై విశ్వాసం పోతుంది.