Dec 25,2022 06:43

అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) 35వ జాతీయ మహాసభ కేరళ లోని త్రిసూర్‌ లో డిసెంబర్‌ 13 నుంచి 16 వరకు జయప్రదంగా జరిగిన విషయం తెలిసిందే. వ్యవసాయ బిల్లుల వ్యతిరేక రైతు ఉద్యమానికి మోడీ ప్రభుత్వం ఆ సమయానికి తలవంచినా...ఇప్పటిదాకా రాతపూర్వక హామీలను అమలు చేయకపోవడం దేశానికి, రైతాంగానికి ద్రోహం చేయడమేనని, వాటిని సాధించుకునేదాకా పోరాడాలని మహాసభ తీర్మానించింది.
మూడు కీలక అంశాలపై 3 కమిషన్లు వేసి చర్చించి వాటి సారాంశాన్ని మహాసభకు సమర్పించింది. 1) భూమి, భూసంబంధ సమస్యలు, భూసేకరణ విధానం, రైతులకు జరుగుతున్న అన్యాయాలు. 2) అన్ని పంటలకు కనీస మద్దతు గ్యారంటీ చేస్తూ పార్లమెంట్‌లో చట్టం చేయాల్సిన అవసరం, 3) వ్యవసాయ రంగంలో ఫైనాన్షియల్‌ పెట్టుబడి - జొరబడుతున్న తీరు, రైతాంగం దోపిడీకి గురవుతున్న వైనం. ఈ మూడు కమిషన్ల నివేదికలు ప్రతినిధుల ఆలోచనా శక్తిని పెంచడానికి దోహదపడ్డాయి. అనవసరంగా వచ్చి పడుతున్న విదేశీ వ్యవసాయ వస్తువులను నిలిపివేయాలని, గ్రామీణ ఉపాధి పథకానికి నిధులు తగ్గించడం కాదు పెంచాలని, కార్పొరేట్లకు ప్రత్యామ్నాయంగా కోపరేటివ్లను అభివృద్ధి చేయాలని, నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేసి కార్మికులను ఉత్పత్తిలో భాగస్వాములను చేసే మెరుగైన చట్టాలను చేయాలనే తీర్మానాలను మహాసభ చర్చించి ఆమోదించింది.
చర్చలలో వివిధ రాష్ట్రాల ప్రతినిధులు వారి విలువైన అనుభవాలను ప్రస్తావించారు. వ్యవసాయ రంగం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రీతిన ఉంది. కాశ్మీరు, హిమాచల్‌ ప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలలో యాపిల్‌ పంట అధికంగా పండించిన రైతులు ప్రభుత్వ విధానాల వలన అప్పుల పాలవుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లాంటి చోట్ల పత్తి రైతులు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, ఇతర దుంపలు, వ్యవసాయం గిట్టుబాటు కాకున్నాయి. వరి, ధాన్యం, గోధుమలు పంజాబ్‌ హర్యానా పశ్చిమ యు.పి లాంటి చోట్ల ప్రొక్యూర్‌మెంట్‌లో, ప్రభుత్వాల మద్దతు ధరకు కొంటున్నారు. ఇతర విశాల భారత దేశంలో ఎక్కడా ఇది అమలు కావడం లేదు. దేశంలో తొమ్మిది కోట్ల మందికి పైగా రైతులు పాల ఉత్పత్తిపై ఆధారపడి ఉన్నారు. ఒక లీటరు ఆవు పాలు ఉత్తరప్రదేశ్‌లో రూ.15 రూపాయలు ఉన్నాయంటేనే పరిస్థితి అర్థమవుతుంది. అదే కేరళలో రూ.36 (3.5 శాతం వెన్న) ఉంది. మేత, దాణా, ఇతర ఖర్చులు పెరిగి సంవత్సరానికి 50 లక్షల కుటుంబాలు ఈ రంగం నుంచి బయటకు వస్తున్నారు. 5 శాతం జిఎస్‌టి విధించిన తరువాత పిల్లలు తాగే పాలు కూడా భారమైపోతున్నాయి. పోరాటం చేసి రంగాన్ని కాపాడుకోవాలని చెప్పారు.
మోడీ ప్రభుత్వం రైతుకు రెట్టింపు ఆదాయం వచ్చేట్లుగా చేస్తానన్నది. కానీ ఆచరణలో బూటకంగా తయారయింది. రైతుల ఆత్మహత్యలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఈ సంక్షోభం నుంచి బయట పడాలంటే కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, కేరళ తరహాలో రుణ విముక్తి చట్టం చేయాలని ప్రతినిధులు కోరారు.
కేరళలో సహకార వ్యవస్థ సుమారు వంద సంవత్సరాల పైన చరిత్ర కలది. అది క్రమంగా నూతన పద్ధతుల ఒరవడిని, విధానాలను తోడు చేసుకుని అభివృద్ధి పథంలో సాగుతున్నది. ఈనెల 17వ తేదీన ఆంధ్ర, తెలంగాణ ప్రతినిధులు 28 మంది మూడు సహకార సొసైటీలను, ఒక పంచాయతీ ఆఫీసును, ఒక ప్రాథమిక పాఠశాలను దర్శించడం జరిగింది. మొదట విజిట్‌ చేసిన సొసైటీ గ్రామీణ స్థాయిలో ఉంది. దానిలో పదివేల మంది సభ్యులు ఉన్నారు. వారి సరాసరి సొంత భూమి తలసరి విస్తీర్ణం 6.8 సెంట్లు. 160 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
బ్యాంక్‌ ఒక్కో రైతుకు కనీసంగా పదివేల నుంచి 15 వేల వరకు వడ్డీ లేని రుణం ఇస్తుంది. సకాలంలో చెల్లించాలి. బ్యాంకు తో పాటు మంచి సూపర్‌ మార్కెట్లు, మెడికల్‌ షాపులు నిర్వహిస్తున్నారు. చిన్న రైతు బజార్‌ నిర్వహిస్తున్నారు. నాబార్డ్‌ బ్యాంకు నుంచి కొత్త ప్రాజెక్టు వచ్చింది. కొబ్బరి నూనె తీసే ఫ్యాక్టరీ పెట్టడానికి స్థలం, యంత్రాల కొనుగోలుకు 2.3 కోట్లు కేటాయించబడింది. ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు 20 వేల రూపాయలు బోనస్‌ వస్తుంది. సభ్యులు ఎవరైనా చనిపోతే పది వేల రూపాయలు ఇస్తుంది. పంచాయతీ ఆఫీసే ఒక మండల స్ధాయిలో ఉంది. పంచాయతీ స్థాయిలోనూ విద్య, వైద్యం, ఆర్‌ అండ్‌ బి లాంటి విభాగాలకు స్టాండింగ్‌ కమిషన్ల పర్యవేక్షణ ఉన్నది. ప్రజల అజమాయిషీలో పరిపాలన సాగటమంటే ఏమిటో ఆచరణలో అక్కడ మేము చూశాం. వరి ధాన్యం క్వింటాలు రూ.2840కు రాష్ట్ర ప్రభుత్వం కొంటున్నది. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేస్తున్నది. వ్యవసాయ పంటలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెటింగ్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయడం, పంటలకు అదనపు విలువలతోబాటు మిషనరీని తోడు చేయడం, వివిధ నూతన పద్ధతులను పాటించడం చేస్తుంది. సహకార సంస్థలను, ఎఫ్‌.పి.ఓ లను నూతన ఒరవడిలో నడుపుతూ రైతాంగానికి అదనపు ఆదాయం చేకూరేలా చూస్తుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన రైతాంగానికి ఆయా రాష్ట్రాలలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఉదాహరణకు- అఖిల భారత స్ధాయిలో సరైన విత్తన చట్టం ఇంతవరకు లేనందున (పార్లమెంటులో ప్రవేశపెట్టారు) కల్తీ విత్తనాల సమస్య అన్ని రాష్ట్రాలలో కనిపిస్తున్నది. ఎరువుల ధరలు దాదాపుగా రెట్టింపయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్న ప్రకృతి వ్యవసాయం పైనే ఆధారపడితే శ్రీలంక ఆహార సంక్షోభం లాంటి ప్రమాదం వచ్చి ఉండేది. అధునాతన నూతన మార్కెట్ల విధానం విఫలమైంది. అది రైతులకన్నా వ్యాపారస్తులకు బాగా దోహదపడుతున్నది. ఆవును రాజకీయ పావుగా మార్చి మైనారిటీలపై దాడులు పెంచారు. వట్టిబోయిన ఆవులు, ఎద్దులు వ్యవసాయానికి పనికి రాక రోడ్లపై వాహనాల ప్రమాదానికి కారణం అవుతున్నాయి. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా కార్పొరేట్‌ కంపెనీలకు కోట్లు కురిపిస్తుండగా రైతాంగానికి వివిధ రాష్ట్రాలలో ఏవిధంగాను ఉపయోగపడడం లేదని ప్రతినిధులు గుర్తించడం జరిగింది.
వేల కిలోమీటర్ల పొడవున అమర వీరుల జాతాలు, సభలు, ప్రజా సమస్యల నివేదనలు, చివరలో బహిరంగ సభ...ప్రతినిధులను ఎంతగానో ఉత్సాహపరిచాయి. భవిష్యత్‌లో వివిధ రైతు సంఘాలను, కార్మిక సంఘాలను కలుపుకొని చేయబోయే విశాల పోరాటాల బాధ్యతతో, ఉత్సాహంతో ప్రతినిధులు వెనుదిరిగారు.

Another-movement-for-MSP

 

 

 

 

 

వ్యాసకర్త ఎ.పి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య