Jul 30,2023 06:32

స్వాతంత్య్రం వచ్చేటప్పటికి మన దేశంలో 75 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. నేటికీ 49 శాతం ఈ రంగంపై ఆధారపడుతున్నారు. అయితే నాడు జిడిపిలో 61 శాతం వాటా ఉండగా నేడది 13 శాతానికి పడిపోయింది. జిడిపిలో వ్యవసాయ రంగం వాటా తగ్గిపోయేకొద్దీ రైతుల ఆదాయం తగ్గిపోయి దివాళా తీసే స్థితికి వస్తున్నారు. దీనికి పరిష్కారంగా పాలక వర్గాలు కార్పోరేట్‌ వ్యవసాయాన్ని చూస్తున్నాయి. మూడు రైతు వ్యతిరేక చట్టాలను చుట్టచుట్టి మోడీ నెత్తిన మొట్టి పార్లమెంటు సాక్షిగా రైతులకు క్షమాపణ చెప్పించిన ఘనత 385 రోజుల రైతుల పోరాటానిది. అయితే అప్పుడు ప్రభుత్వం చేసిన వాగ్ధానాలు నేటికీ అమలుకు నోచుకోలేదు. వాటి అమలుకోసం దేశవ్యాపితంగా రెండవ పోరాటానికి రైతాంగం సన్నద్ధం అవుతోంది. మోడీ 2019 ముందు ఎన్నికల ప్రచార సభలలో కనీస మద్దతు ధరల చట్టం తెచ్చి రైతాంగానికి అండగా ఉంటామన్నారు. సి2+50 శాతం స్వామినాథన్‌ కమిషన్‌ విధానాన్ని అమలు పరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత తమ ప్రభుత్వం పారిశ్రామికవేత్తల వైపునని తేల్చి చెప్పారు. ఆచరణలో వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు లాభపడే విధంగా ఎ2+50 శాతం విధానాన్ని అమలు పరుస్తున్నారు. ఈ సంవత్సరం వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉండే ధరల నిర్ణయ కమిటి 17 పంటలకు 5 శాతం నుండి 7 శాతం వరకు మాత్రమే మద్దతు ధరల పెంపును ప్రకటించింది. గత సంవత్సరంతో పోల్చితే అన్ని ఖర్చులూ 20 శాతానికి పైగా పెరిగాయన్నది విస్మరించారు. కేంద్ర బడ్జెట్‌లో ధరల స్థిరీకరణ నిధి గత సంవత్సరం రూ.7500 కోట్లు ఉంటే ఈ సంవత్సరం జీరో పెట్టారు. పరిశోధనలకు పైసా కూడా పెంచలేదు. జీరో టాక్స్‌తో విదేశీ వ్యవసాయ దిగుమతులు కుప్పలుతెప్పలుగా మన దేశానికి రావడం ప్రారంభమైంది. ఈ పరిస్థితులలో పార్లమెంటు రైతుకు భరోసా కల్పిస్తూ కనీస మద్దతు ధరల చట్టం చేసి రైతాంగాన్ని కాపాడాలి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, డీజిల్‌ రేట్లు విపరీతంగా పెరిగాయి. వీటికి ఉన్న చట్టాలు చట్టుబండలు అవుతున్నాయి. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా రైతులకు బదులు కార్పోరేట్లకు ధీóమాగా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దిగుబడి ఆధార పంటలను కొన్ని జిల్లాలకు కొన్ని పంటలనే పేరుతో రిలయన్స్‌ లాంటి కార్పోరేట్‌ కంపెనీలకు దారాధత్తం చేసింది. పంటల బీమాలో ఒక సంవత్సరానికి దేశవ్యాపితంగా రూ.40 వేల కోట్లు మిగుల్చుకోగా, రాష్ట్రంలో వాటికి రూ.వందల కోట్లు మిగిలాయి. ఈ ఖరీఫ్‌, రబీ సీజన్లలో రైతులు అన్ని కష్టాలను అధిగమించి చేతికొచ్చిన పంటలను అమ్ముకొందామంటే ప్రభుత్వ ఏజెన్సీలు సకాలంలో ముందుకు రావడంలేదు. దాంతో బస్తాకు రూ.300 నుండి రూ.500 వరకు తక్కువకే అమ్ముకోవలసి వస్తున్నది. రైతు భరోసా కేంద్రాలు విత్తనం నుండి విక్రయం వరకు రైతుల అన్ని పనులు చూస్తాయనే ప్రభుత్వం మాటలు ఆచరణలో నీటిమూటలుగా మిగిలాయి. అవి మిల్లర్లకు, వ్యాపారస్తులకు ఊడిగం చేసే కేంద్రాలుగా ఉన్నాయి.
కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లులో పథకాలకు కేటాయించిన డబ్బులు ఎటుపోతున్నాయో ఎవరికీ తెలియదు. కొత్త చీడ పీడలను ఎదుర్కోవడానికి మన వ్యవసాయ పరిశోధనా సంస్థ ద్వారా పంటల దిగుబడి, క్వాలిటీ పెరగడానికి అవసరమైన పరిశోధన కూడా సరిపడా జరగలేదు. ఇలా వుండగా సంవత్సరానికి రూ.1 లక్షా 80 వేల కోట్లతో ప్రారంభమైన గ్రామీణ ఉపాధి పథకం...ఈ సంవత్సరం రూ.60 వేల కోట్లకు కుదించబడింది. ఈ సంక్షోభ కాలంలో ఆర్థిక వ్యవస్థ కుదేలు కాకుండా ఈ మాత్రంగానైనా ఉన్నదంటే పేదలకు ఆ కొంచెం డబ్బు చేరడం వల్లేనని గుర్తించాలి. దానికి బడ్జెట్‌ పెంచి సమర్థవంతమైన పద్ధతులలో సమాజానికి ఉపయోగపడే విధంగా నిర్వహించాలి. రాష్ట్ర బడ్జెట్‌లో నీటి పారుదలకు రూ.11 వేల కోట్లు కేటాయించింది. కానీ పైసా ఖర్చు పెట్టలేదు. ఫలితంగా గత 10 సంవత్సరాలుగా రూ.100 కోట్ల బడ్జెట్‌లో ఉన్న చిన్న ప్రాజెక్టులు కూడా 1 శాతం పని జరగలేదు. రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, దాని వెనుక ఎన్నో త్యాగాలు చేసిన గిరిజన రైగాంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్రోహం చేశాయి. ఆ కుటుంబాలకు పునరావాసం ప్రప్రథమం అనే మానవతా దృక్పధాన్ని కోల్పోయారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతే ఇంతవరకు వాటిని పెట్టిన పాపాన పోలేదు. అంత అసమర్థంగా ఉంది ఈ ప్రభుత్వ నిర్వాకం. రైతును అన్ని రకాలుగా నాశనం చేసే కార్పోరేట్‌ విధానాలను కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్నది. కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించడం ద్వారానే ఈ విధానాలను వెనక్కు కొట్టగలం, రైతాంగాన్ని కాపాడుకోగలుగుతాం.

krishna

 

 

 

 

 

వ్యాసకర్త ఎ.పి రైతుసంఘం అధ్యక్షులు వి. కృష్ణయ్య