జీఓ నెంబరు 59ని ఉపసంహరించుకోవాలి
ఎపి జెఎసి అమరావతి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:మహిళా సంరక్షణ కార్యదర్శులకు వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని ఎపి జెఎసి అమరావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విజయవాడ లెనిన్ సెంటర్‌లోని రెవెన్యూ భవన్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం, ఎపి జెఎసి అమరావతి సంయుక్త ఆధ్వర్యాన ఆదివారం మహిళా సంరక్షణ కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎపి జెఎసి అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర్‌రావు మాట్లాడుతూ మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసుగా పేర్కొంటూ ప్రభుత్వం 2023.06.23న ఇచ్చిన జీఓ నెంబరు 59ని, అలాగే పోలీసు విధులను కూడా ఉపయోగించుకునేలా హోమ్‌శాఖ ఇచ్చిన ఉత్తర్వులు జీఓ నెంబరు 2నుంచి మినహాయింపునిచ్చేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎపి జెఎసి అమరావతి రాష్ట్ర కమిటీ మహిళా కార్యదర్శి జి.జ్యోతి మాట్లాడుతూ ఆయా గ్రామాల్లోని మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ సహాయసహకారాలు అందించేందుకే ప్రభుత్వం మహిళా సంరక్షణ కార్యదర్శుల వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. మహిళల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మహిళా సంరక్షణ కార్యదర్శులకు సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో గ్రామ వార్డు సచివాలయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.ఆరలయ్య పాల్గోన్నారు.










