- ఉత్తరాంధ్ర అభివృద్ధికి శ్రీకారం : ముఖ్యమంత్రి జగన్
- పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : ఉత్తరాంధ్రలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. విశాఖకు రహేజా ఇనార్బిట్ షాపింగ్ మాల్ ఆణిముత్యం వంటిదని, ఈ ప్రాంత రూపురేఖలు మారతాయని అన్నారు. మంగళవారం ఆయన విశాఖలో పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తొలుత విశాఖపట్నం కైలాసపురంలోని పోర్టు స్థలమైన 17 ఎకరాల్లో రహేజా ఇనార్బిట్ మాల్ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో రూ.130 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులను ప్రారంభించారు. జివిఎంసి ఆధ్వర్యాన రూ.134.58 కోట్లతో చేపట్టబోయే 47 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ఇనార్బిట్ మాల్ గ్రూప్ అధ్యక్షులు కె.నీల్ రహేజాకు 17 ఎకరాలు కేటాయించామని, దీంట్లో 13 ఎకరాల్లో రూ.600 కోట్లతో మాల్ నిర్మిస్తారన్నారు. ఈ మాల్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎనిమిది వేల మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. మిగతా నాలుగు ఎకరాల్లో రెండో దశలో ఐటి కోసం కొంత స్పేస్, ఇంకొంతమేర స్థలంలో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చేపడతామన్నారు. రెండో దఫా ప్రాజెక్టుల ద్వారా మరో మూడు వేల మందికి ఉపాధి లభించనుందన్నారు. ఈ మాల్ నిర్మాణంతో విశాఖ నగర రూపురేఖలు మారడమే కాకుండా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మాల్‌గా అవతరించనుందని పేర్కొన్నారు. గతంలో తాను వచ్చినప్పుడు అదానీ డేటా సెంటర్ స్పేస్‌కు, శ్రీకాకుళంలో మూలపాడు సీ పోర్టుకు, భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపనలు చేశానని, ఈ ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి మంచి అడుగులు పడ్డాయన్నారు. విశాఖపట్నం 'గ్లోబల్ ఛార్ట్'లోకి వచ్చేందుకు ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని పేర్కొన్నారు. విశాఖకు విచ్చేసిన ముఖ్యమంత్రికి తొలుత ఎయిర్‌పోర్టు వద్ద ఘన స్వాగతం లభించింది. సిఎం వెంట ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి విడదల రజని, రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, టిటిడి చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఆదిమూలపు సురేష్, విశాఖ ఎంపి ఎంవివి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఉన్నారు.
సిపిఎం, ప్రజా సంఘాల నేతల గృహ నిర్బంధం
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సిపిఎం జిల్లా నాయకులు ఆర్‌కెఎస్‌వి.కుమార్. పి.మణి, ఎస్‌ఎఫ్‌ఐ నగర నాయకులు బి.గౌతమ్‌లను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ చర్యను సిపిఎం జిల్లా కమిటీ ఖండించింది.










