- ఎండిపోతున్న మామిడి చెట్లు
- వర్షాభావ పరిస్థితులతో రైతులు విలవిల
ప్రజాశక్తి-వీరబల్లి : గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఫలితంగా భూగర్భజలాలు అడుగంటాయి. మరోవైపు చెరువులు, కుంటలు, కాలువల్లోనూ చుక్కనీరు లేకుండా పోయింది. ఇప్పటికే ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు కళ్లముందే ఎండిపోయాయి. మరోవైపు రబీ ప్రారంభమై మూడు వారాలు కావస్తున్నా వరుణుడు జాడ లేకపోవడంతో ఈ సీజన్ సైతం కోల్పోవలసి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 12 పంచాయతీలు ఉన్నాయి, డి.రాచపల్లి, వంగిమళ్ల, సోమవరం, సంఘంవాండ్లపల్లి, పెద్దివీడు, మట్లి, ఒదివీడు, తాటికుంటపల్లి, సానిపాయ, గుర్రప్ప గారి పల్లి, వీరబల్లి, గడికోట, పంచాయతీలోనూ మామిడి తోటలు, వేరుశనగ, వరి, పొద్దుతిరుగుడు, కూరగాయల పంటలు, బొప్పాయి పంటలు, ఎక్కువగా సాగు చేస్తారు. ఈ క్రమంలోనే గత నెలలో పొలాలను దుక్కి చేసి, ఎరువులు చల్లి సిద్ధం చేశారు. అప్పటినుంచి అప్పుడప్పుడు మేఘాలు ఊరిస్తున్నా చినుకు మాత్రం రాలడం లేదు. కనీస స్థాయిలోనూ పదును లేక వ్యవసాయ దారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. వేసవిని తలపించేలా పగటి ఉష్ణోగ్రతలు నమోదవు తుండడంతో రైతులు నాటుకున్న మామిడి చెట్లు తీవ్ర వర్షాభావంతో ఎండిపోతున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సాగునీరు, తాగునీరు, ఇస్తామని ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని రైతులు తెలుపుతున్నారు. ఖరీఫ్ సీజన్ పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పక్క మండలాలైన గాలివీడు, రామాపురం, మండలాలకు వెలిగల్లు ప్రాజెక్టు నుంచి కాలువలతో చెరువులు, కుంటలు, నీటితో నింపుతున్నారు. వీరబల్లి మండలానికి ఏ ప్రాజెక్టు నుంచి నీళ్లు రావని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జళకల అనే పేరు పెట్టి రైతులకు రెండు ఎకరాలకు ఒక బోరు చొప్పున వేస్తామని చెప్పి, బోర్లు వేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని రైతులు తెలిపారు. దశాబ్దాలుగా మండలాల ప్రజల హంద్రీ-నీవా నీటితో చెరువులు నింపే ప్రక్రియ కలగానే మిగిలింది. పాలకులు, అధికారులు, ప్రతిపాదనలతోనే సరి పెడుతున్నారు. అడుగు ముందుకు పడింది లేదు. వీరబల్లి మండల ప్రజలు కేవలం వర్షాధారంపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి శాశ్వత సాగునీటి కాలువలు, జలాశయాలు లేవు. మండలంలో అక్కడక్కడ కొన్ని పంచాయతీల్లో చిన్నచిన్న చెరువులు, కుంటలు, ఉన్నాయి. వెలుగల్లు ప్రాజెక్టు ద్వారా వీరబల్లి మండలంలో చెరువులను, కుంటలను, నీటితో నింపితే మండలం సస్యశ్యామలంగా ఉంటుందని ప్రజలు పేర్కొంటున్నారు. వెలిగల్లు ప్రాజెక్టు నీటితో గంగనేరు చెరు వును నీటితో నింపి, ఫారెస్ట్ లైనును ఆనుకుని ఉన్న కాలువను రిపేర్ చేయించి, నీళ్లు నింపితే మూడు గ్రామాల ప్రజల పంట పొలాలకు నీరు అందించవచ్చని ప్రజలు చెప్తున్నారు. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆవేదనతో ఉన్నారు.