ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :గొర్రెల మేకల పెంపకందారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు కేటాయించాలని ఎపి గొర్రెలు మేకలు పెంపకం దారులు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంటా శ్రీరామ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి పెద్దబ్బాయి డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడలో వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గొర్రెల మేకల పెంపకందారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న చేపట్టిన చలో విజయవాడను జయప్రదం చేయాలని కోరారు. ప్రతి పెంపకందారునికి 50శాతం సబ్సిడీతో రూ.5 లక్షల దాకా రుణాలను ఇవ్వాలని కోరారు. గొర్రెల సహకార సొసైటీలకు యన్‌సిడిసి కింద రూ.88 కోట్ల నిధులను విడుదల చేయాలని, 90శాతం సబ్సిడీతో ఉపాధి హామీ నిధులతో షెడ్లు నిర్మించాలని, 50 సంవత్సరాలు నిండిన పెంపకందారులుకు పించన్లను, అన్ని గొర్రెలు, మేకలకు ఉచిత ఇన్సూరెన్స్ ద్వారా పశునష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పశువైద్యులు, ఆర్‌బికెలలో సిబ్బంది ఖాళీ పోస్టులను తక్షణం భర్తీ చేయాలని, గొర్రెల, మేకల సంఖ్యకు అనుగుణంగా అన్ని రకాల టీకాలు, మేలు రకం విత్తన పొట్టేళ్లను సరఫరా చేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 31న విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద జరిగే ఆందోళన కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెంపకందారులు తరలిరావాలని కోరారు.