Mar 14,2023 15:22

ప్రజాశక్తి-బుట్టాయిగూడెం (ఏలూరు) : ప్రభుత్వ భూమిలో నివాసాల ఏర్పరచుకున్న గిరిజనులందరికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ డిమాండ్‌ చేశారు. మండల తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇవ్వాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడుతూ బుట్టాయిగూడెం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్‌ 614 లోయ 4.94 సెంట్లు భూమిలో మండలంలో ఇంటి స్థలం లేని గిరిజనులు నివాసాలు ఏర్పాటు చేసుకొని గత రెండు నెలలు నివాసముంటున్నారన్నారు. ప్రభుత్వ భూమిలో గిరిజనులు నివాసం ఉంటున్న వారికి హక్కు పట్టాలు ప్రభుత్వం మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. గిరిజనులు తమ సొంత గ్రామాల్లో ఇంటి స్థలాలు లేక ఒకే ఇంటిలో రెండు మూడు కుటుంబాలకు పైగా నివాసం ఉంటున్నారని అనేక ఇబ్బందులతో సతమత మవుతూ ప్రభుత్వ భూమిలో ఇంటి నిర్మణం చేసుకున్నారని అన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని గుడిసెలు వేసుకున్న గిరిజనులందరికి హక్కు పట్టాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అనంతరం మండల తహశీల్దార్‌ ఎస్‌ శారశాంతి వారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్‌ మాట్లాడుతూ.. సమస్యలను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కారం భాస్కర్‌, కె దుర్గారావు, ఎస్‌ దుర్గమ్మ, ఎం గంగరాజు, తెల్లం మునియ్య, పలువురు పాల్గొన్నారు.