Feb 19,2023 06:41

(నిన్నటి సంచిక తరువాయి)
ఎక్కడ బడితే అక్కడ అదానీ సంస్థలు పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించిన ఉదంతాలు కోకొల్లలు. మోడీ అధికారంలోకి రాగానే ఆ ఉల్లంఘనలన్నీ మాఫీ అయిపోయాయి. ముంద్రా ప్రాజెక్టు మీద కేంద్రం గతంలో విధించిన అపరాధ రుసుం ఉత్తర్వు గుట్టు చప్పుడు కాకుండా రద్దు అయిపోయింది. అటవీ భూముల సరిహద్దులను అదానీకి అనుకూలంగా తిరిగి నిర్వచించడానికి వీలుగా గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శిని తొలగించారు. దాంతో ఛత్తీస్‌గఢ్‌ లోని బొగ్గు గనుల ప్రాజెక్టుకు అదానీకి అడ్డంకులు తొలగిపోయాయి.
ఆస్ట్రేలియా లోని క్వీన్స్‌ల్యాండ్‌ ప్రాంతంలో వివాదాస్పదంగా ఉన్న ఒక బొగ్గు గని వ్యవహారంలో ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మెడలు వంచి రుణం కోసం ఒప్పందం మీద సంతకాలు చేయించిన వైనం చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ ప్రయోజనాలకు అనుగుణంగా ఏవిధంగా వాడుకున్నదీ కనిపిస్తుంది. ఆ బొగ్గు గని తవ్వకాల ప్రాజెక్టు, అక్కడి నుండి ఒక ఓడరేవు వరకూ ప్రతిపాదించిన ఒక రైల్వే లైను, ఆస్ట్రేలియా ఖండాన్ని ఆనుకుని ఉన్న గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌ (సముద్రంలో ఉన్న పగడాల నిక్షేపాలు)కు, సంబంధిత పర్యావరణానికి నష్టం కలిగించే విధంగా ఉన్నాయి. అందుకే ప్రపంచంలోని ప్రధాన బ్యాంకులన్నీ ఆ ప్రాజెక్టుకు రుణం ఇవ్వడానికి నిరాకరించాయి. అంతిమంగా ఆ ప్రాజెక్టు ప్రతిపాదన అటకెక్కింది. దాంతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రుణ ప్రతిపాదన కూడా మూతబడింది.
ఆర్థిక నేరాలను అరికట్టడానికి ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వ విభాగం డిఆర్‌ఐ అదానీ గ్రూపు యంత్ర భాగాల దిగుమతిలో పాల్పడిన అక్రమాల ఆరోపణలపై విచారణ జరిపి డిసెంబరు 2013లో ఒక నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం అదానీ గ్రూపు రూ. 2322.75 కోట్ల మేరకు ఆ లావాదేవీల ద్వారా మాయం చేసింది. కాని మోడీ ప్రభుత్వం ఆ నివేదికను చల్లగా తొక్కిపెట్టింది.
అదానీ గ్రూపు పాల్పడుతున్న అక్రమాల గత చరిత్ర గురించి తెలిసినప్పటికీ వాటిని అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవలసిన నియంత్రణ సంస్థలు సెబి, కంపెనీ వ్యవహారాల శాఖ పూర్తిగా ఉపేక్షించాయి. ఇది అన్నింటికన్నా పెద్ద తప్పు. వినోద్‌ అదానీ (గౌతమ్‌ అదానీ సోదరుడు) మారిషస్‌ లో 38 డొల్ల కంపెనీలను అక్రమంగా నిర్వహిస్తున్న సంగతి ఆ నియంత్రణ సంస్థలకు తెలుసు. ఈ 38తో బాటు సైప్రస్‌లో, యుఎఇ లో, సింగపూర్‌ లో వినోద్‌ అదానీ నడుపుతున్న డొల్ల కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు నిర్వహిస్తున్న లావాదేవీలు ఏమీ లేవు అన్న సంగతి కూడా స్పష్టమే. అన్ని కంపెనీలకూ ఒకే అడ్రసులు ఇచ్చారు. బహిరంగంగా కనిపించే ఏ విధమైన సేవలనూ ఈ సంస్థలు అందించడం లేదు. అదానీ స్వంత కంపెనీల షేర్లను వీటి పేరుతో నిర్వహించడానికి, వాటి ధరలను తారుమారు చేయడానికి ఈ డొల్ల కంపెనీల పేర్లను ఉపయోగించారు. ఈ కంపెనీలన్నీ కాగితాలకే పరిమితం.
తక్కిన పెద్ద కార్పొరేట్‌ కంపెనీలతో పోల్చితే అదానీ గ్రూపు సంస్థలకు ఒక ప్రత్యేకత ఉంది. తమకున్న రుణాల వాయిదాలను చెల్లించడానికి కావలసిన ఆదాయాన్ని సమకూర్చుకోలేకపోవడమే ఆ ప్రత్యేకత. అదానీకి ఉన్న లిస్టెడ్‌ కంపెనీలు ఏడింట్లోనూ అయిదు కంపెనీలు ఒక శాతం కన్నా తక్కువ లాభాన్ని ఆర్జిస్తున్నాయి. ఆ కంపెనీలను నిర్వహించే ఉన్నత స్థాయి అధికారులు 25 మందిలో 8 మంది అదానీ కుటుంబ సభ్యులే. దాంతో అదానీ గ్రూపు సంస్థల వ్యవహారం అంతా ఒక కుటుంబ వ్యవహారం అని స్పష్టం ఔతోంది. ఈ సంస్థల నిర్మాణం ఏ విధంగా ఉందంటే దాని వలన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ (షేర్ల కొనుగోలులో ఒక అక్రమ పద్ధతి) రౌండ్‌ ట్రిప్పింగ్‌ (ఒక కంపెనీ ఆస్థులను ఇంకొక డొల్ల కంపెనీకి విక్రయించినట్టు కాగితాలమీద చూపించి పన్నులు ఎగ్గొట్టడం), కృత్రిమంగా షేర్ల ధరలను తారుమారు చేయడం వంటి అక్రమాలకు పాల్పడడం తేలికగా చేయవచ్చు. స్టాక్‌మార్కెట్‌ నియమాల ప్రకారం ఈ తరహా పద్ధతులన్నీ చట్టవిరుద్ధం. అదానీ గ్రూపు సంస్థలు విదేశాలలో సాగించిన లావాదేవీలపై సెబి దాదాపు ఏడాదిన్నర పాటు విచారణ జరిపింది. ఈ విషయాన్ని సెబి స్వయంగా ధృవీకరించింది. అదానీ గ్రూపు విదేశాల్లో నియంత్రించే నిధులలో దాదాపు 90 శాతం ఈ గ్రూపు కంపెనీల్లోనే తిరిగి పెట్టుబడులు పెడుతున్నారు. ఈ సంస్థలు నడిపే కార్యకలాపాల తీరును పరిశీలించే వారికెవరికైనా ఇందులో అక్రమాలు జరుగుతున్న విషయం తేలికగానే అర్ధం అవుతుంది. ఇందుకు వేరే ఏ నిపుణుల పరిశీలనా అవసరం లేదు. ప్రభుత్వపు అత్యున్నత స్థాయిలో వీటిని ఉపేక్షించడం వల్లనే ఇవన్నీ సాధ్యపడ్డాయి.
బోరిస్‌ జాన్సన్‌, నైగెల్‌ ఫారగె, డొనాల్డ్‌ ట్రంప్‌, నరేంద్ర మోడీ, బోల్సనారో, ఎర్డొగాన్‌ వంటి నాయకులను ఒకప్పుడు వారి వారి దేశాల ప్రజలు ఆమోదించే పరిస్థితి ఉండేదే కాదు. కాని ఇప్పుడు అటువంటి పచ్చి మితవాద నాయకులే ఆ యా దేశాలలో తిరుగులేని అధినేతలుగా చెలామణీ ఔతున్నారు. ఎందువలన? ఆ యా రంగాలలో నిపుణులైన వారు ఒకప్పుడు అధిష్టించిన అధికార పదవులలో ఈ వాగాడంబర నేతలు ఏ విధంగా చొరబడ్డారు?
ప్రపంచవ్యాప్తంగా పచ్చి మితవాద శక్తులు పైచేయి సాధించిన వైనాన్ని గార్డియన్‌ పత్రిక కాలమిస్టు జార్జి మాబియట్‌ ఈ విధంగా వివరించారు: ''పెట్టుబడిదారీ వ్యవస్థ పనిచేసే తీరు మారింది. 1990 దశకంలోను, 2000 దశకంలోను కార్పొరేట్‌ శక్తి పైచేయి కలిగి వుండేది. వాళ్ళకి టెక్నోక్రాట్లు అవసరం. ఒక వైపు ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా, భద్రంగా నడిపిస్తూనే, మరోపక్క కార్పొరేట్ల లాభాలను కాపాడగలిగేటట్టు వ్యవహరించే నాయకులు వారికి అప్పుడు అవసరం అయ్యారు. కాని ఇప్పుడు ఆ కార్పొరేట్‌ శక్తి పరిణామం చెందింది. కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో సమస్త అధికారాలూ కేంద్రీకరించబడి వుండే పద్ధతిగా మారిపోయింది.'' ( ఆలిగార్కీ)
ఈ పచ్చి మితవాద నాయకుల ఆలోచనా క్రమాన్ని వివరిస్తూ ''వీళ్ళు పాలనా వ్యవస్థ మొత్తాన్ని కూలదోయాలనుకునే ధోరణితో వ్యవహరిస్తారు'' అని స్టీవ్‌ బానన్‌ అనే సిద్ధాంతవేత్త అన్నాడు. ''ఈ 'వినాశకర' పెట్టుబడిదారీ విధానంలో లాభాలు ఇబ్బడి ముబ్బడిగా రావాలంటే పూర్తి అరాచకత్వం నెలకొనాలి. దాని వల్లనే కొత్త శతకోటీశ్వరులు వర్ధిల్లుతారు. ప్రతీ ఘర్షణనూ ఉపయోగించుకుని ప్రజల ఉమ్మడి ఆస్తులను వీళ్ళు తేలికగా చేజిక్కించుకుంటారు'' అని ఆయన అన్నాడు.
ఈ తరహా నాయకులు అసలు సమస్యల్ని పక్కదోవ పట్టించడంలో సిద్ధహస్తులు. ఒకపక్క దోపిడీదారులు అధికారుల కుమ్మక్కుతో ప్రజల్ని కొల్లగొడుతూ వుంటే, ఈ నాయకులు వేరే ఏదో విషయం మీద చర్చ లేవనెత్తుతారు. శతకోటీశ్వరుల మీదకు మళ్ళించవలసిన ప్రజాగ్రహాన్ని మైనారిటీ సమూహాలమీదకు మళ్ళిస్తారు. వారిని బలిపశువుల్ని చేస్తారు. ''ఈ కొత్త తరహా వాగాడంబరం ఒక మోసం. పెట్టుబడిదారీ దోపిడీ ప్రభావం వైపు నుండి దృష్టిని మళ్ళించడం. దీనికి పెట్టుబడిదారుల అండదండలు పుష్కలంగా ఉంటాయి.''
ఈ కొద్దిమంది సంపన్న వ్యక్తుల దృష్టి ఎంతసేపూ విదేశాలలో తమ అక్రమ ఆర్జనకు ఆశ్రయం కల్పించే దేశాల మీదే ఉంటుంది. మరోవైపు అతిగా ప్రకటించుకునే జాతీయతావాదం ద్వారా మాత్రమే వీరి ప్రయోజనాలను కాపాడుకోజూస్తారు. ఈ విధంగా తమ దేశ భక్తిని అతిగా ప్రకటించుకుంటూ, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడమే పరమావధిగా చెప్పుకునే ఈ మితవాద రాజకీయ నాయకులే దేశ సంపదను అమ్మివేయడంలో అందరికన్నా ముందుంటారు.

  • అన్ని శిక్షలకూ తాము అతీతం అనే ధోరణి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది?

2014లో మోడీ ప్రధాని అయ్యేనాటికి ఫోర్బ్స్‌ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ 609వ స్థానంలో ఉన్నాడు. 2022 సంవత్సరాంతానికి అతను 2వ స్థానానికి చేరాడు. మితిమీరిన వేగంతో సాధించిన ఈ అభివృద్ధి సహజంగానే ప్రపంచవ్యాప్తంగా లోతైన పరిశీలనకు దారి తీస్తుంది. ''అన్నింటికీ తాము అతీతం'' అనే ధోరణితో అదానీ గ్రూపు వ్యవహరించినట్టు అనిపిస్తున్నదని హిండెన్‌బర్గ్‌ నివేదిక పేర్కొంది. మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోను, ఆ తర్వాత 2014లో దేశ ప్రధాని అయిన తర్వాత అదానీ పెరిగిన తీరు చూస్తే ఇది వాస్తవం అని ఒప్పుకోవలసినదే.
బిజెపి కి ప్రత్యర్ధులుగా ఉన్నవారిని ధనబలంతో కొనుగోలు చేయడంలోను, స్వతంత్ర సంస్థలుగా వ్యవహరించవలసిన ఐ.టి, ఇ.డి, సిబిఐ తదితర సంస్థలను తప్పుడు పద్ధతుల్లో ఉపయోగించడం ద్వారా వారి మీద ఒత్తిడి తేవడంలోను మోడీ ప్రభుత్వం ఇప్పటికే పేరు గడించింది. ఈ తరహా పద్ధతుల ద్వారానే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసి తమవైపు తిప్పుకోగలిగారు. అదే విధంగా ఐ.టి, ఇ.డి, సిబిఐ వంటి సంస్థలను ఉపయోగించి కొన్ని కంపెనీల ఆస్తులను అదానీ కొనుగోలు చేయగలిగాడు. 2018 అక్టోబర్‌ 10న ఐటి శాఖ కృష్ణపట్నం పోర్టు మీద, నవయుగ సంస్థ ఆఫీసుల మీద దాడులు చేసింది. 2020 అక్టోబర్‌ 6న అదానీ కృష్ణపట్నం పోర్టులో 75 శాతం వాటాలు చేజిక్కించుకున్నాడు. 2021 ఏప్రిల్‌ 6 కల్లా అదానీ అందులో 100 శాతమూ పొందగలిగాడు. 2020 డిసెంబర్‌ 10న సిబిఐ ఎసిసి, అంబుజా సిమెంట్స్‌, అల్ట్రా టెక్‌ కంపెనీల మీద దాడులు చేసింది. 2022 అక్టోబర్‌ 16న అదానీ ఎసిసి, అంబుజా సిమెంట్స్‌ కంపెనీల వాటాలను కొనుగోలు చేయగలిగాడు. 2020 జులై 2న జివికె సంస్థ యాజమాన్యం మీద, జివికె ముంబై విమానాశ్రయం మీద ఎఫ్‌ఐఆర్‌ లను సిబిఐ సమోదు చేసింది. 2020 జులై 18న ముంబై, హైదరాబాద్‌ లలోని జివికె ఆఫీసులమీద దాడులు చేసింది. 2020 ఆగస్టు 31న జివికె సంస్థ ముండై విమానాశ్రయాన్ని అదానీకి అమ్మివేసింది. ఈ పరిణామాలు జరిగిన క్రమాన్ని పరిశీలించినప్పుడు విషయం తేటతెల్లం కావడం లేదా?
ఇక విమానాశ్రయాల ప్రైవేటీకరణ ఉదంతం చూస్తే వికారం కలుగుతుంది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా యాజమాన్యం కింద నడిచే విమానాశ్రయాలన్నీ దాదాపు ఇప్పుడు అదానీ హస్తగతం అయిపోయాయి. ఆ వైనం చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఆ కథనంతటినీ వివరించడానికి ఇక్కడ స్థలం సరిపోదు. తిరువనంతపురం విమానాశ్రయం మీద అదుపు కోసం కేరళ లోని వామపక్ష ప్రజాతంత్ర సంఘటన ప్రభుత్వం తన ప్రభుత్వ సంస్థ ద్వారా ప్రయత్నించిన సందర్భంలో అదానీ గుత్తాధిపత్యం కోసం ఎంతదాకా పోతాడో తేటతెల్లం అయ్యింది.
ఎల్‌ఐసి, ఎస్‌బిఐ వంటి ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుండి నిధులను అదానీ పొందిన తీరు గురించి కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. గత కొన్ని రోజులుగా ఈ చౌకీదార్‌ ప్రభుత్వపు ఆర్థిక మంత్రి గాని, ప్రధాని గాని ఈ ఉదంతం మీద నోరు విప్పడం లేదంటే ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి ఇరకాటంలో పడిందో బోధపడుతోంది.

(ముగింపు తదుపరి సంచికలో)
(స్వేచ్ఛానువాదం)