
- మోడీ ముదనష్టపు విధానాలపై పోరు
- అక్టోబరు 5న ఢిల్లీలో భారీ ర్యాలీ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఉమ్మడి సివిల్ కోడ్ (యుసిసి)ను బలవంతంగా రుద్దడాన్ని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పూర్తిగా వ్యతిరేకిస్తుందని జాతీయ అధ్యక్షురాలు పి.కె.శ్రీమతి స్పష్టం చేశారు. విభిన్న మతాలు, ఆచారాలు, సంప్రదాయాలు ఉన్న లౌకిక భారతదేశంలో ఒకేమతం, ఒకేభాష, ఒకేచట్టం, ఒకే సంస్కృతి పేరుతో బిజెపి బలవంతపు చట్టాలు అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. గురువారం విజయవాడలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శ్రీమతి మాట్లాడారు. మహిళలకు, లౌకికతత్వానికి మోడీ ప్రభుత్వం చేటు తెస్తోందన్నారు. నిత్యావసరాలతో సహా అన్ని రకాల సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, నిరుద్యోగం తీవ్ర రూపం దాల్చిందని, వీటన్నిటికి వ్యతిరేకంగా అక్టోబరు 5న ఢిల్లీలో పెద్దఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఉమ్మడి పౌర స్మృతి అమలుకు దేశంలో పరిస్థితులు అనుకూలంగా లేవని, దేశం ఇంకా ఆ స్థితికి చేరుకోలేదని 2018లోనే లా కమిషన్ స్పష్టం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. దేశంలో 40 శాతం మంది ప్రజలు ఇంకా పేదరికంలోనే ఉన్నారని, సమానత లేనిచోట ఉమ్మడి చట్టాల అమలు సాధ్యం కాదని అన్నారు. ఒక మత ఆచారాలను అన్ని రకాల మతాలపై రుద్దాలని చూడటం సరికాదని పేర్కొన్నారు. దేశంలో గిరిజనులు, క్రిస్టియన్లు, ముస్లిములు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివాసీ ప్రజలకు వేర్వేరు సంప్రదాయాలు ఉంటాయని, యుసిసి వల్ల వారికి తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. కేంద్రం చెబుతున్న యుసిసి వల్ల అందరికీ ఉద్యోగం, విద్య, గౌరవంగా జీవించే హక్కులు రాకపోగా దాడులు పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. ప్రస్తుతం దేశంలో మహిళలకు అన్యాయం జరుగుతోందని, అన్ని రంగాల్లోనూ వారిని పక్కన పెడుతున్నారని, ముందు వారికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. యుసిసిని ముందుకు తీసుకొస్తున్న బిజెపి పాలిత రాష్ట్రాల్లో చిన్న పిల్లలకు వివాహాలు చేస్తున్నారని, వారిపై తీవ్ర ఆంక్షలు ఉంటున్నాయని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఒక మతం ఓట్లను రాబట్టుకోవాలనే కుట్రతోనే బిజెపి అవసరం లేని ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసేందుకు ముందుకు తీసుకొస్తోందని విమర్శించారు. మోడీ అనుసరిస్తున్న విధానాలు వేర్వేరు మతాలతోపాటు మహిళలపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. భారత్‌ను ఫాసిస్టు, మతతత్వ దేశంగా మార్చేందుకు బిజెపి నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్న కేరళలో మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నారని, కుడుంబశ్రీ పథకం ప్రవేశ పెట్టి ఒంటరి, అవివాహిత మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారని, ఇళ్లను నిర్మించి ఇస్తున్నారని తెలిపారు.
రెచ్చగొడుతున్న ప్రధాని
మణిపూర్‌లో హింసకు ఇప్పటి వరకు 130 మంది చనిపోయారని, అయినా ప్రధాని దాని గురించి మాట్లాడటం లేదని పేర్కొన్నారు. అమెరికా నుండి తిరిగి వచ్చిన ప్రధాని ఉమ్మడి పౌర స్మృతి గురించి మాట్లాడారని, మణిపూర్‌లో హింసను నివారించేందుకు ఒక్క ప్రకటన కూడా చేయలేదని అన్నారు. యుసిసి పేరుతో దేశ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ.. మోడీ విధానాలను ప్రతిఒక్కరూ ప్రతిఘటించాలన్నారు. రాష్ట్రంలోనూ మహిళలపై పెద్దఎత్తున హింస జరుగుతోందని అన్నారు. ఇప్పటికీ మహిళలపై దాడులకు సంబంధించి రాష్ట్రంలో 14 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. బాలికలపై అత్యాచారాలకు అంతే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా ఆగస్టు 8న విజయవాడలో సభ నిర్వహిస్తామని, అంతకుముందే హిందూపూర్, విశాఖ నుండి యాత్రలు చేపడతామని తెలిపారు. అంతకుముందు మహిళా ఉద్యమ నాయకులు మానికొండ సూర్యావతి, సంపర తులశమ్మ చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.