Sep 09,2023 06:29

పరస్పర సహకారం, శాంతి, సుహృద్భావ సందేశంతో ముందుకు సాగాలని ఇండోనేషియాలోని జకార్తాలో నిర్వహించిన 43వ ఆగేయాసియా దేశాల కూటమి (ఆసియాన్‌) సదస్సు ఇచ్చిన పిలుపు ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ఎంతో ప్రాధాన్యత కలిగివుంది. చైనా ఎదుగుదలను ఓర్వలేని అమెరికా, దాని తైనాతీలు దక్షిణ చైనా సముద్ర వివాదాన్ని రాజేసేందుకు, చైనాకు వ్యతిరేకంగా ఆసియాన్‌ దేశాలను ఉసిగొల్పాలని చూశాయి. చైనా ఏమాత్రం నిగ్రహం కోల్పోకుండా చాలా పరిణితితో వ్యవహరించింది. ఆసియాన్‌ సదస్సుకు హాజరైన చైనా ప్రధానమంత్రి లీ కియాంగ్‌ ఆగేయాసియా దేశాలతో సోదర సంబంధాలను పెంపొందించుకునేందుకు స్నేహ హస్తం చాచారు. మూడు రోజుల స్వల్ప వ్యవధిలోనే ఆసియాన్‌ భాగస్వామ్య దేశాలు 12 సదస్సులు నిర్వహించడం, 90 దార్శనిక పత్రాలు రూపొందించడం, పలు ఒప్పందాలు చేసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. సవాళ్లను అవకాశాలుగా, ప్రతికూల పరిస్థితులను సహకార సాధనాలుగా, వెలివేతలను సమీకృతంగా, విభేదాలను ఐక్యతగా మలచుకోవాలన్న ఇండోనేషియా అధ్యక్షులు జోకో విడోడో మాటలు ఆసియాన్‌ ఉదాత్త ఆశయాలకు దర్పణం పట్టాయి.
వాస్తవానికి దక్షిణ చైనా సముద్రం అంశాన్ని తురుపుముక్కగా చేసుకుని ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలని చూసిన అమెరికాకు భంగపాటు తప్పలేదు. చైనాకు అనుకూలంగా సభ్య దేశాలు వ్యవహరించడం అగ్రరాజ్యానికి మింగుడు పడటం లేదు. కొత్తగా పొడచూపుతున్న పరిస్థితులను, సవాళ్లను అధిగమించి ప్రాంతీయ శాంతి, సుస్థిరత, సౌభాగ్యాలను పెంపొందించేందుకు తన వంతు సహకారం అందించేందుకు సిద్ధమని ఆసియాన్‌ సదస్సులో చైనా ఉద్ఘాటించింది. ఈ సదస్సు ఆసియాన్‌ భాగస్వామ్యపక్ష దేశాల ఎజెండాకే పరిమితం కాకుండా ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులను, సవాళ్లపైనా దృష్టి సారించింది. ఈ కూటమి సభ్యులే కాకుండా చర్చల భాగస్వాములుగా ఉన్న చైనా, అమెరికా, రష్యా, జపాన్‌, ఇండియా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాలను ఒక ఛత్రం కిందకు తీసుకురావడంలో ఈ సదస్సు విజయవంతమైందనే చెప్పాలి.
ఆసియాకు వెలుపల ఉన్న దేశంగా అమెరికా ఈ ప్రాంత దేశాల మధ్య తంపులు పెట్టడానికి యత్నిస్తే.. పొరుగుదేశంగా చైనా ఆసియాన్‌ దీర్ఘకాల అభివృద్ధి, సుస్థిరత సాధనకు కృషి సల్ఫిందని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌ స్థానంలో హాజరైన ఉపాధ్యక్షురాలు, ఆసియా సంతతికి చెందిన కమలా హారిస్‌ ఆసియాన్‌ దేశాలను విడదీసి వేరు కుంపట్లు పెట్టేందుకు ముమ్మరంగా లాబీయింగ్‌ చేశారు. ఇండో పసిఫిక్‌ వ్యూహం, ఆకస్‌, క్వాడ్‌ కూటములతో చైనాను ఒంటరిపాటు చేయాలని చూస్తున్న అమెరికా, జకార్తాలోనూ అదే ట్రిక్కులు ప్రయోగించాలని చూసింది. ఫిలిప్పీన్స్‌ వంటి దేశాలు దక్షిణ చైనా సముద్ర దీవుల విషయంలో వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని, ఇందులో ఎవరి జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పింది. సహకార బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం ద్వారా 'కొత్త ప్రచ్ఛన్న యుద్ధాల'ను నివారించాలన్న చైనా పిలుపును ఈ సదస్సు ఆమోదించింది. ఆసియాన్‌ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరై స్వేచ్ఛ, పారదర్శకలతో కూడిన ఇండో పసిఫిక్‌ ప్రాంతంగా పురోగమించాలని ఆకాంక్షించారు. అనుసంథానత, వాణిజ్యం నుండి డిజిటల్‌ పరివర్తన వరకు వివిధ రంగాల్లో తీసుకోవాల్సిన 12 అంశాలను ఆయన ప్రతిపాదించారు. ఒకవైపు అమెరికాకు మోకరిల్లుతూ మరోవైపు బహుళ ధ్రువ ప్రపంచం గురించి మాట్లాడడం మోడీ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది. ఏదేమైనా వాతావరణ మార్పులపై ప్రాంతీయ కర్బన ఉద్గారాల తగ్గింపుతో సహా పలు ఒడంబడికలపై సదస్సు ఏకాభిప్రాయానికి రావడం ముదావహం. మయన్మార్‌లో నాలుగు వేల మందిని చంపి, వేలాది మందిని నిర్బంధించిన సైనిక ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా 2021లో ఆసియాన్‌ ఆమోదించిన అయిదు అంశాల తీర్మానం అమలులో ఎలాంటి పురోగతి సాధించలేకపోయామని సదస్సు అంగీకరించింది. వైఫల్యాన్ని అంగీకరించడంతోనే ఆగిపోకుండా మయన్మార్‌లో శాంతి, సుస్థిరతకు రోడ్‌ మ్యాప్‌తో ముందుకు రావాల్సిన అవసరముంది. ఆగేయాసియా శాంతి, సుస్థిరత కోసం కూటమిలోని దేశాలన్నీ మరింత సహకారంతో ముందుకు సాగాలి.