Aug 11,2022 06:22

పారిశ్రామిక కార్మికులే కాదు, అనేక రంగాలకు చెందిన ఉద్యోగులు తమ డిమాండ్లు సాధించుకోవటానికి తీవ్రంగా పోరాడారు. వాటిలో చెప్పుకోదగినది అవసరాలకు తగ్గ కనీస వేతనం, వంద శాతం డి.ఎ న్యూట్రలైజేషన్‌ డిమాండ్లతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 1968లో చేసిన బ్రహ్మాండమైన సమ్మె. ఈ సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరి ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వ వైఖరి కన్నా పెద్ద భిన్నంగా లేదు. పారిశ్రామిక వివాదాలలో కేంద్ర రిజర్వు పోలీసు (సిఆర్‌పి) బలగాలను ఉపయోగించటం సాధారణమైపోయింది. కార్మికులలో భయోత్పాతాన్ని కలిగించేందుకు గూండా గ్యాంగులను ఉపయోగించారు. అత్యవసర సర్వీసుల నిర్వహణ ఆర్డినెన్స్‌ (ఎసెన్షియల్‌ సర్వీస్‌ మెయింటనెన్సు ఆర్డినెన్స్‌) తెచ్చి సమ్మెను నిషేధించారు. సమ్మె చేస్తున్న వారిపై, వారికి మద్దతుగా నిలిచిన వారిపై జైలుశిక్షతో కూడిన పనిష్‌మెంట్లు విధించారు. పోలీసులు జరిపిన కాల్పులలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వేతనాలు పెంచాలని, కేంద్ర ప్రభుత్వోద్యోగులతో సమానంగా కరువు భత్యం (డి.ఎ) ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అనేక రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు సమరశీల సమ్మె పోరాటాలు చేశారు. ఆటోమేషన్‌కు వ్యతిరేకంగా ఎల్‌ఐసీ ఉద్యోగులు సుదీర్ఘమైన పోరాటాన్ని ప్రారం భించారు. తమ ట్రేడ్‌ యూనియన్‌ హక్కుల మీద విధించిన ఆంక్షలను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు వెళ్లారు.
ఈ పోరాటాలలో చెప్పుకోదగినది-20 లక్షల మంది రైల్వే కార్మికులు మూడు వారాలు ఏకధాటిగా చేసిన చారిత్రాత్మక సమ్మె. జీవిత అవసరాలకు తగిన కనీస వేతనం, పూర్తి న్యూట్రలైజేషన్‌తో డి.ఎ, ఎనిమిది గంటలకు మించని డ్యూటీ, పారిశ్రామిక కార్మికులుగా గుర్తించటం, పూర్తి ట్రేడ్‌ యూనియన్‌ హక్కులు మొదలైనవి వీరి డిమాండ్లు. సమ్మెపై ప్రభుత్వం భయోత్పాతానికి తెరలేపింది. రైల్వే కాలనీలపై దాడులు చేశారు. కార్మికులను ఇళ్ల నుంచి బయటకు లాగి దౌర్జన్యం చేశారు. వేలాది మందిని అరెస్టు చేశారు. మూకుమ్మడిగా కార్మికులను తగ్గించివేశారు. ఆర్థికంగాను, రాజకీయంగాను ఈ సమ్మె దేశమంతటిపై పెద్ద ప్రభావాన్ని చూపింది. కార్మికులతో సహా దేశ ప్రజలందరి ప్రాథమిక హక్కులను కాలరాస్తూ ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ అంతర్గత అత్యవసర పరిస్థితిని ప్రకటించటానికి ముందు సూచనగా ఈ సమ్మె కనపడింది.
స్వతంత్రం వచ్చిన కొద్ది దశాబ్దాలలోనే అపరిమితంగా లాభం పొంది, భారీగా సంపదను పోగేసు కున్న బడా పెట్టుబడిదారీ వర్గం మరింత సంపదను పోగేసు కోవాలనే కోరికతో ఆర్థిక వ్యవస్థ మీద తమ పట్టు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నది. ఈ వర్గాల ప్రయోజనాలకే ప్రాతి నిధ్యం వహిస్తున్న ప్రభుత్వం రాజ్యాంగం చేసిన డిక్లరేషన్‌కు కట్టుబడలేకపోయింది. రాజ్యాంగం లోని ఆదేశిక సూత్రాల నుంచి దేశ విధానాలు గాడి తప్పాయి.
నయా ఉదారవాద విధానాలు అధికారికంగా అమలు పరచటం ప్రారంభించటంతో కార్మికవర్గం మీద, శ్రామిక ప్రజల మీద దాడులు మరింత పెరిగాయి. 1991 ఆర్థిక సంక్షోభాన్ని ఉపయోగించుకుని నయా ఉదారవాద విధానాలు అమలు చేశారు. 'మార్కెట్‌ శక్తుల' చేతుల్లో ఆర్థిక వ్యవస్థను పెట్టటానికి పారిశ్రామిక విధానాన్ని అధికారికంగానే మార్పు చేశారు. పోరాటాల ద్వారా కార్మికవర్గం సాధించుకున్న ప్రయోజనాలు, హక్కులకు ఎసరు పెట్టారు. నయా ఉదారవాదానికి ఉన్న ఒకానొక ముఖ్య లక్ష్యం ఏమిటంటే- ప్రయివేటీకరణ ద్వారా మొత్తం ప్రజా సంపదను తన కబంధ హస్తాలలోకి తెచ్చుకోవటం, కార్మిక సంఘాలను, కార్మిక వర్గానికున్న సంఘటిత శక్తిని బలహీన పరచటం, కార్మికుల హక్కులను నాశనం చేయటం, దోపిడీని తీవ్రం చేయటం.
కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారికంగా నయా ఉదారవాద విధానాలను ప్రారంభించినప్పటికీ తరు వాత వచ్చిన బిజెపి నాయకత్వం లోని ప్రభుత్వాలు, లేక వివిధ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాలు పాలక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ, అవే విధానాలను అనుసరించాయి. ప్రస్తుతం మోడీ నాయకత్వాన వున్న బిజెపి ప్రభుత్వం 2019లో రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత, ధైర్యం వచ్చి ఈ విధానాలను మరింత దూకుడుగా అమలులో పెడుతున్నది. 'కార్మిక చట్టాల సంస్కరణ' అనే మాయమాటల చాటున కార్మిక కోడ్లను ప్రవేశపెట్టింది. కార్మికులు దీక్షతో పోరాడి సాధించుకున్న హక్కులను, ముఖ్యంగా యూనియన్లు పెట్టి సంఘటితమయ్యే హక్కును, సమిష్టిగా కార్యాచరణకు దిగే హక్కును కాలరాచే చర్య మినహా మరొకటి కాదిది. స్వాతంత్య్రం సాధించినప్పటి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని, సంపదను గుట్టలుగా పోగేసుకున్న బడా పెట్టుబడిదారులు 'బాంబే ప్లాన్‌' స్క్రిప్ట్‌లో రాసుకున్న విధానాలే ఈనాడు జోరుగా చేస్తున్న ప్రయివేటీకరణ, నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌, నేషనల్‌ ల్యాండ్‌ మానిటైజేషన్‌ వగైరాలు.
ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసైగలలో పని చేసే మోడీ ప్రభుత్వం, ఈ విధానాలకు అదనంగా 'హిందూ రాష్ట్ర' స్థాపన ఎజెండాతో మొండిగా 'హిందూత్వ'ను ప్రోత్సహిస్తున్నది. సమాజాన్ని పోలరైజ్‌ చేయాలని చూస్తున్నది. కార్మిక వర్గాన్ని, శ్రామిక జనులను...మతం, కులం, ప్రాంతం, భాషల ఆధారంగా విడగొట్టాలని చూస్తున్నది. ఈ విధంగా కార్మికుల, కష్టజీవుల ఐక్యతను విచ్ఛిన్నం చేయటం, సత్వరం ప్రజలను వేధిస్తున్న సమస్యల నుంచి దృష్టి మళ్ళించటం, నయా ఉదారవాద విధానాల అమలుకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలను బలహీనపరచటం ద్వారా నయా ఉదార విధానాల అమలుకు మార్గం సుగమం చేస్తున్నది. ప్రాథమిక హక్కులు, వాటి పరిరక్షణ, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, సామరస్యం లక్ష్యాలుగా వున్న భారతదేశ రాజ్యాంగం స్థానంలో...శారీరక శ్రమను చిన్న చూపు చూసే మనుస్మృతిని పెట్టాలని చూస్తున్నది.
దేశ స్వాతంత్య్రం కోసం జీవితాలను ధారపోసిన ప్రజల యొక్క ఆకాంక్షలను వమ్ము చేసే విధానాలను అమలు పరుస్తూ, 'అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌' పేరిట మోడీ ప్రభుత్వం 75 ఏళ్ల స్వాతంత్య్రోత్సవ సంబరాలను జరపటం హాస్యాస్పదంగా ఉన్నది. దేశ ప్రజలందరికి తగిన జీవనోపాధులు కలిగి ఉండే హక్కును, యోగ్యమైన ప్రామాణిక జీవనానికి తగ్గ వేతనాలు, ఉమ్మడి శ్రేయస్సు కోసం భౌతిక వనరులపై నియంత్రణ, సంపద కేంద్రీకరణను నిరోధించటం లాంటి రాజ్యాంగంలోని గొప్ప సూత్రాలను ప్రభుత్వం పలచబరుస్తున్నది.
బ్రిటిష్‌ వలస వాదానికి వ్యతిరేకంగా పోరాడిన మన దేశ కార్మికవర్గం, నయా ఉదారవాద దాడులకు వ్యతిరే కంగా పోరాడటమేకాక, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వాన జరుగుతున్న మతతత్వ విచ్ఛిన్న కుయుక్తులకు వ్యతిరేకంగానూ మరింత తీవ్రంగా ఐక్య పోరాటాలు చేయవలసిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. నయా ఉదారవాదం ప్రారంభమైన నాటి నుంచి దానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలను ఉధృతం చేస్తూ వాటిని మతతత్వ విచ్ఛిన్న కుతంత్రాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలతో అనుసంధానించాలి. ఈ విధంగా మాత్రమే దేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలర్పించిన మన ముందు తరాల మహనీయుల ఆకాంక్షలను, స్వప్నాలను చేరుకోగలం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మనకు ఉండాల్సిన అంకితభావం ఇదే.

citu 

 

 

 

 

 

వ్యాసకర్త : కె. హేమలత సిఐటియు జాతీయ అధ్యక్షులు