Jan 20,2023 11:05
  • కరోనా సమయంలోనూ ఆగని పోరాటాలు
  • సిఐటియు మహాసభలో ప్రతినిధులు

శ్యామల్‌ చక్రవర్తి నగర్‌నుండి ప్రజాశక్తి ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కార్మికలోకం సంఘటితమౌతోందని సిఐటియు మహాసభలో పాల్గొన్న పలువురు ప్రతినిధులు చెప్పారు. సిఐటియు 17వ జాతీయ మహాసభ రెండో రోజైన గురువారం కార్యదర్శి నివేదికపై విస్తృతంగా చర్చలు జరిగాయి. వివిధ రాష్ట్రాలనుండి హాజరైన 40 మందికపైగా ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ప్రైవేటీకరణ విధానాలకు దేశ వ్యాప్తంగా ప్రతిఘటన ఎదురవుతోందని, ఎక్కడికక్కడ కార్మికులు ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం, హక్కుల సాధన కోసం ఉద్యమిస్తున్నారని చెప్పారు. కరోనా కష్టకాలంలోనూ ఈ పోరాటాలు జరిగాయని, అనేక ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం వెనక్కితగ్గిందని చెప్పారు. మహరాష్ట్రలో విద్యుత్‌ ఉద్యోగుల సాగించిన పోరాటం గురించి మహరాష్ట్ర సిఐటియు నాయకులు చర్చల్లో ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మొదట పద్మశ్రీ, తరువాత భూపాల్‌ తెలంగాణలో జరుగుతున్న కార్మిక పోరాటాలను, కోవిడ్‌ సమయంలో సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. కేరళలో అక్కడి ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ప్రత్యామ్నాయ విధానాల ద్వారా కార్మికులకు ఏ రకంగా అండగా ఉంటుందన్న అంశాలను ఆ రాష్ట్ర సిఐటియ నాయకులు చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కార్మికుల కేరళలో ఉన్నాయని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్‌ ప్రతినిధి మాట్లాడుతూ ఆ రాష్ట్రాన్ని బిజెపి ఒక ప్రయోగశాలగా మార్చిందన్నారు. మతత్వ విధానాల అమలుకు సిద్ధపడటమే కాకుండా కార్మికుల తరుపున పోరాడుతున్న సిఐటియు నాయకులు మనీష్‌ శుక్లాను హత్య చేసారని తెలిపారు.

222

                                                        పెరుగుతున్న పోలీసు నిర్బంధం : రమాదేవి

ఆంధ్రప్రదేశ్‌లో కార్మికులు, ఉద్యోగులపై పోలీసు నిర్బంధం పెరిగిందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రమాదేవి చెప్పారు. చర్చలో ఆమె మాట్లాడుతూ సమస్యలపై ఎటువంటి పిలుపునిచ్చినా పోలీసులు సిఐటియు నాయకుల ఇళ్ల వద్దకు చేరుకుని గృహ నిర్బంధాలు చేయడం పరిపాటిగా మారిందని చెప్పారు. ఇతర సంఘాలు పిలుపునిచ్చినా సిఐటియు నాయకులను బయటకు కదలనివ్వడం లేదన్నారు. ఈ నిర్బంధాన్ని అధిగమించి కార్మికుల సమస్యలపై సిఐటియు అనేక పోరాటాలను నిర్వహించిందని తెలిపారు. అ కోవిడ్‌ సమయంలో వలస కార్మికులను ఇళ్ల చేర్చడమే కాకుండా వారికి భోజన సౌకర్యాలను కల్పించినట్టు చెప్పారు. అనేక చోట్ల ఐసోలేషన్‌ కేంద్రాలను సైతం సిఐటియు నిర్వహించిందన్నారు. కోవిడ్‌తో ఆశా వర్కర్లు చనిపోతే వారికి ఆర్థిక సహాయం అందివ్వాలని పెద్దఎత్తున పోరాటం నిర్వహించామని చెప్పారు. ప్రభుత్వం దీనిపై స్పందించే వరకు పోరాటం సాగిందన్నారు.

111

                                      కేంద్రం దిగొచ్చేవరకు విశాఖ ఉక్కు పోరాటం : వి. ఉమామహేశ్వరరావు

కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేంతవరకు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం కొనసాగుతుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు చెప్పారు. చర్చల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా పోరాటం సాగిస్తున్నామని చెప్పారు. అందరినీ కలుపుకుని సాగిస్తున్న పోరాటంలో బిజెపి మినహా అన్ని రాజకీయ పార్టీలు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అసెంబ్లీలో రెండు సార్లు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేశారని తెలిపారు కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగు ఉద్యోగుల సమస్యలపైనా రాష్ట్రంలో పోరాటాలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పారు. అదే విధంగా స్కీమ్‌ వర్కర్సు సమస్యలపైనా దేశ వ్యాప్త పిలుపుల్లో భాగంగా పోరాటాలు నిర్వహించడమే కాకుండా స్థానిక సమస్యలపైనా ఎప్పటికప్పుడు స్పందించి పోరాటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అసంఘటిత రంగంలోనూ పనిచేస్తున్నట్టు తెలిపారు.