- వర్షాలకు దెబ్బతిన్న పంటను పీకేస్తున్న వైనం
- నేడు పొగాకు బోర్డు వద్ద ఆందోళన
ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో : టంగుటూరు మండలం సూరారెడ్డిపాలేనికి చెందిన ఓ రైతు 20 ఎకరాలలో పొగాకు వేశారు. మాండూస్ తుపాను వల్ల కురిసిన వర్షాలకు పంట అంతా పోయింది. తోటలను పీకేశారు. మళ్లీ నాట్లు వేసేందుకు సన్నాహాల్లో ఉన్నారు. రూ.10 లక్షలకుపైగానే నష్టం వాటిల్లింది. అదే ఆలోచనతో ఇంటిలో కూర్చొన్న చోటే కుప్పకూలిపోయాడు.
ప్రస్తుతం పొగాకు రైతుల పరిస్థితి ఇదీ. ఇటీవల కురిసిన వర్షాలకు పొగాకు పంటకు భారీగా నష్టం వాటిల్లింది. నష్టం ఎంతనేదీ అంచనాలు వేయడంలో పొగాకు బోర్డు పూర్తి నిర్లక్ష్యంగా ఉంది. వ్యవసాయ శాఖ తమ పరిధిలోని పంటలను మాత్రమే ఎన్యూమరేషన్ చేసింది. 69 వేల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వానికి నివేదిక పంపింది. పొగాకు విషయానికి వచ్చే సరికి పూర్తిగా వదిలేశారు. కేంద్రం స్పందించే పరిస్థితి లేదు. పార్లమెంటులో పొగాకు రైతుల విషయం ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రస్తావించారు. అక్కడ నుంచి ఎలాంటి స్పందనా లేదు.
తోటలను పీకేసిన రైతులు
వర్షాలకు తోటలు భారీగా దెబ్బతిన్నాయి. ఎండిపోయి ఆకులు పండాయి. వడలిపోవడంతో చేసేదేమీలేక నాలుగు రోజులుగా తోటలను పీకి గట్లపై కుప్పేస్తున్నారు. మళ్లీ పొగాకు నాట్లు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టంగుటూరు, కొండపి, జరుగుమల్లి, ఒంగోలు, నాగులుప్పలపాడు, మద్దిపాడు, సంతనూతలపాడు మండలాల్లో సుమారు పది వేల ఎకరాల్లో తోటలను ఇప్పటికే పీకేశారు. ఎకరాకు కనీసం రూ.40 వేలు పెట్టుబడి పెట్టారు. నెల రోజులు తోటలు పెరిగాయి. కొన్ని చోట్ల దిగుబడి కూడా వచ్చింది. క్యూరింగ్ ముమ్మరంగా సాగాల్సిన సమయంలో వర్షాలు నిలువునా ముంచాయి. ఎక్కువ నష్టం నల్లరేగడి నేలల్లోనే జరిగింది. ఎందుకంటే కురిసిన వర్షం భూమిలోకి ఇంకిపోవడం తక్కువ. దీంతో, వర్షాలకు కురిసిన నీరంతా తోటల్లోనే ఉంది. నాలుగు రోజులపాటు తోటలు నీటిలోనే మునిగాయి. వర్షపు నీరు బయటకుపోవడానికి కూడా వీల్లేకుండా కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పొగాకు తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. టంగుటూరు మం డలంలో దాదాపు అన్ని గ్రామాల్లోనూ తోటలను పీకేశారు.
ఎకరాకు రూ.40 వేలకుపైగా నష్టం
జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో పొగాకు సాగైంది. 40 వేల ఎకరాల్లో పొగాకు తోటలకు నష్టం వాటిల్లింది. పూర్తిగా దెబ్బతిని ఎందుకూ పనికిరాకుండా పది వేల ఎకరాలు ఉంది. దీన్నంతా ఇప్పుడు పీకేశారు. దీనికి ఎకరాకు కనీసం రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకూ నష్టం తప్పలేదు. మిగతా ప్రాంతాల్లో తోటలు తిప్పుకున్నాయి. ఆకులు రంగు మారాయి. ఎకరాకు కనీసం రెండు క్వింటాళ్లు దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. నాణ్యత కూడా తగ్గుతుంది. రంగుమారి లోగ్రేడు ఎక్కువగా వచ్చే ప్రమాదం లేకపోలేదు. రాష్ట్రంలో ఈ ఏడాది 142 మిలియన్ కిలోల పొగాకును పండించేందుకు అనుమతి ఇచ్చారు. దీంట్లో సగం కూడా పండుతుందా? అనేదీ అనుమానమే. మరోవైపు కర్ణాటకలో మార్కెట్ బాగా ఉంది. అక్కడ కూడా దిగుబడి తగ్గినందున ధరపై రైతులు ఆశగా ఉన్నారు. కానీ, పంట తగ్గిపోవడంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి.
కనీస స్పందన లేని పొగాకు బోర్డు
పొగాకు బోర్డును కేంద్రం అజమాయిషీ చేస్తోంది. కానీ, ఏమి జరిగినా బోర్డు స్పందన పెద్దగా ఉండడం లేదు.. ఎంపిలు కేంద్రం దృష్టికి తీసుకుపోయినా పెద్దగా స్పందన కనిపించడం లేదు. పంట పీకేస్తున్నా పట్టడం లేదు. కనీసం ఎంత నష్టం జరిగిందనే అంచనాలు కూడా లేవు. వ్యాపారులకు అనుకూలమైన నిర్ణయాల్లో మాత్రం పొగాకు బోర్డు వేగంగానే స్పందిస్తోంది. వ్యాపారులు సిండికేట్‌గా మారి సీలింగు ధర ఇస్తున్నా పట్టించుకోలేదు.
నేడు బోర్డు కార్యాలయం వద్ద రైతుల ధర్నా
పొగాకు రైతులను ఆదుకోవాలని, నష్టపరిహారాలు ఇవ్వాలని, రుణాలు రీషెడ్యూల్ చేయాలని, బ్యారన్‌కు లక్ష రూపాయలు ఇవ్వాలన్న డిమాండ్లతో మంగళవారం ఒంగోలులోని పొగాకు బోర్డు కార్యాలయం వద్ద ధర్నాకు రైతు సంఘం, కౌలు రైతు సంఘం పిలుపునిచ్చాయి. బాధిత రైతులు తరలిరావాలని ఆయా సంఘాల నేతలు కోరారు.










