
కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం పార్లమెంటు నిర్వహణను సైతం ఏకపక్షంగా మార్చిన తీరు దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ప్రజా సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించడం, పరిష్కరించడం ప్రజాప్రతినిధుల ప్రాథమిక కర్తవ్యం! ఈ పనిని సజావుగా చేయడానికి ప్రయత్నించిన వారిని చట్టసభల నుండి బయటకు పంపడమంటే అర్ధమేంటి? ప్రజా ప్రతినిధుల హక్కులను, చట్టబద్దంగా వారు చేయాల్సిన విధులను అడ్డుకోవడమే కదా! ప్రస్తుతం సాగుతున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో బిజెపి ప్రభుత్వం ఈ వికృత క్రీడకే పాల్పడుతోంది. దేశ ప్రజలను ఊపిరాడనీయకుండా చేస్తున్న అధిక ధరలు, జిఎస్‌టి మోత వంటి అంశాలను ప్రస్తావనకు కూడా చట్టసభల్లో తనకున్న మంద బలంతో అడ్డుకుంటోంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన ఈ నెల 18వ తేదీ నుండి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానిది ఇదే ధోరణి! వీటిపై చర్చించి తీరాలని పట్టుబట్టిన 24 మంది ఎంపీలను చట్టసభల నుండి ఈ వారంతం వరకు సస్పెండ్ చేయడం ద్వారా తన వక్రబుద్ధిని చాటుకుంది. లోక్‌సభలో నలుగురిని, రాజ్యసభలో టిఎంసి, డిఎంకె, టిఆర్‌ఎస్, సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీలకు చెందిన 20 మందిని (మంగళవారం 19 మందిని, బుధవారం ఒకరిని) సస్పెండ్ చేసింది. ఇంత పెద్ద సంఖ్యలో సభ్యులను సస్పెండ్ చేసి, సభా కార్యక్రమాలను నిర్వహించడం రాజ్యసభ చరిత్రలో ఇదే తొలిసారి! సభ్యులు క్షమాపణ చెబితే వారి సస్పెన్షన్ ఎత్తివేసే అంశాన్ని ఛైర్మన్ పరిశీలిస్తారంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చేసిన ప్రకటన మరింత ఘోరం. ప్రజా సమస్యలను చట్టసభల్లో లేవనెత్తి, వాటిపై చర్చించాలని పట్టుబట్టినందుకు క్షమాపణ చెప్పాలని మంత్రిగారు కోరుతున్నారా! లేనిపక్షంలో అధిక ధరల అంశం అసలు ప్రజా సమస్య కాదని ఆయన అనుకుంటున్నారా? అసలు క్షమాపణ ఎవరు చెప్పాలి? సమస్యలను లెవనెత్తిన ప్రతిపక్షమా... మంద బలంతో గొంతు నులిమిన అధికార పక్షమా?
నిజానికి మోడీ ప్రభుత్వం ప్రతిపక్షమంటేనే లెక్కలేని విధంగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్షం లేవనెత్తే ఏ అంశాన్ని కూడా మోడీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. తీర్మానాల అంశంలోనూ ఇదే ధోరణి. పార్లమెంటులో ప్రతిపక్షానికి అనుకూలంగా ఉండే నిబంధనలను సైతం అమలు చేయడానికి అంగీకరించదు, ఖరారైన సభా కార్యక్రమాలను సస్పెండ్ చేసి సభ్యుడు లేదా సభ్యులు లేవనెత్తిన అంశాలను చర్చకు పెట్టే కీలకమైన అధికారాన్ని 267వ నిబంధన సభాధ్యక్షుడికి కట్టబెట్టింది. రాజ్యసభ ఛైర్మన్ హోదాలో వెంకయ్య నాయుడు ఒక్కసారి కూడా ఈ నిబంధన కింద చర్చకు అవకాశం ఇవ్వనేలేదు. రాజ్యసభ రికార్డుల ప్రకారం 2016 నవంబర్ 16న ఈ నిబంధన ప్రకారం రాజ్యసభలో చివరి సారి చర్చ జరిగింది. ఆగస్టు 10వ తేదికి వెంకయ్య నాయుడి పదవీకాలం ముగుస్తున్న సంగతి తెలిసిందే! ప్రతిపక్షం గొంతు ఈ స్థాయిలో నొక్కిన తరువాత ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధమంటూ చేసే సవాళ్లకు అర్ధమేమిటి? మోడీ పాలనలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఈ స్థాయికి పడిపోయింది కాబట్టే జోక్యం చేసుకోవాలంటూ ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి రాష్ట్రపతి ముర్ముకు లేఖ రాయాల్సి వచ్చింది. 15వ రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపిన లేఖలోనే ఈ విషయాన్ని విపక్షాలు ప్రస్తావించాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ముర్ము ఈ లేఖపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
ప్రజా సమస్యలు కూడా చర్చకు రాకుండా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఈ తీరు ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. ఒక వ్యూహం ప్రకారం, మంద బలంతో ప్రజాస్వామ్యంపై చేస్తున్న ఈ దాడిని ఐక్య పోరాటాలతోనే నిలువరించగలం. ఆ దిశలో విస్తృత ప్రజానీకాన్ని సమీకరించాలి. దీనికోసం ప్రజాస్వామ్యవాదులు, లౌకిక, అభ్యుదయ, పురోగామి శక్తులు ఏకతాటిపై కదలాలి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగే పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి.