Apr 01,2023 08:00

ఆధునిక రాజ్యాలలో, రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమం రెండు చక్రాలవలే ముందుకు వెళ్లాలి. కానీ, ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు డి.బి.టి. పేరుతో ఇచ్చి ఉండవచ్చు గానీ, అభివృద్ధి దిశ మాత్రం లేదు. ముఖ్యంగా మనలాంటి వ్యవసాయాధారిత రాష్ట్రంలో జలవనరులు ఎంతో ప్రధానమైనవి. ఎన్నో ప్రాజెక్టులు పూర్తి కావలసి ఉంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమలో హంద్రీ-నీవా, పోలవరం, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. వీటికి నిధులు కేటాయించాలి. బడ్జెట్లో రూ. 11,908 కోట్లు కేటాయించారు. వెలిగొండ ప్రాజెక్టుకి కేవలం రూ.101 కోట్లు కేటాయించారు. దానికోసం ప్రకాశం జిల్లా ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. జలవనరులకు సంబంధించి తగిన ప్రాధాన్యతనివ్వలేదు.
వ్యవసాయ రంగానికి సంబంధించి...బడ్జెట్లో భాగంగా వ్యవసాయ బడ్జెట్‌ను సమర్పించారు. ఆ పుస్తకం 36 పేజీలు వుంది. మంత్రి గారి బడ్జెట్‌ ప్రసంగంలో కౌలు రైతుల గురించి కేవలం నాలుగు లైన్లు మాత్రమే ఉంది. ఈ రాష్ట్రంలో డెల్టా ప్రాంతంలో ఎనభై శాతం, మెట్ట ప్రాంతంలో అరవై శాతం కౌలు రైతులే సాగు చేస్తున్నారు. వ్యవసాయానికి రూ. ఆరు లక్షల కోట్ల రుణాలను ఇస్తే, రాష్ట్రం మొత్తంలో ఉన్న కౌలు రైతులకు కేవలం రూ. ఆరు వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇదేమి న్యాయం?
కౌలు చట్టం-2019 కౌలు రైతులకు చాలా అడ్డంకిగా ఉంది. భూయజమాని కౌలు రైతుకు తన భూమిని కౌలుకు ఇస్తున్నట్లు సంతకం చేయాలి. సంతకం ఏ భూయజమాని చేస్తాడు? అందుకే వారు రుణ అర్హత కార్డులు పొందలేకపోతున్నారు. ఈ-క్రాపింగ్‌ నమోదు చేయలేకపోతున్నారు. రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్న రైతు అంటే కౌలు రైతే. అయినప్పటికీ ఈ బడ్జెట్‌లో కౌలు రైతులకు పూర్తిగా అన్యాయం జరిగింది.
ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించిన పథకాల్లో ముఖ్యమైంది జగనన్న ఇళ్ల పథకం. ఆ పథకాన్ని మేం కూడా బలపరుస్తున్నాం. 30.2 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. పదహారు లక్షల ఇళ్లు ప్రారంభించారు. నాలుగు లక్షల ఇళ్లు పూర్తి కావస్తున్నాయని చెప్పారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు వెళ్లి ఇళ్ల కాలనీల లేఅవుట్లను చూశాను. పేద వారికి ఇళ్లు రావాలని మా కోరిక. ప్రభుత్వం ఇస్తున్న లక్షా ఎనభై వేలు, ముప్పై వేలు (ఈమధ్య డ్వాక్రా బృందాల ద్వారా ముప్పై వేలు ఇస్తున్నారు), మొత్తంగా రెండు లక్షల పది వేలు ఇస్తున్నారు (రూ. 1,50,000+30,000+30,000). అవి బేస్‌మెంటుకు కూడా సరిపోని పరిస్థితి. చాలా ఇళ్లు బేస్‌మెంట్లోనే ఆగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం తరఫు నుంచి ఇతోధిక సహాయం, వడ్డీ లేని బ్యాంకు రుణాలు ఇప్పిస్తే తప్ప ఆ ఇళ్లు పూర్తి కావు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాల్సి వుంది.
ప్రాథమిక పాఠశాల విద్యకు రూ. 29,000 కోట్లు, ఉన్నత విద్యకు రూ. 2,000 కోట్లు కేటాయించారు. విద్యరంగానికి మొత్తం రూ. 31,000 కోట్లు కేటాయించారు. శాతాల్లో చూసినప్పుడు పెరుగుదల పెద్దగా లేదు. ఇక్కడ మూడు విషయాలు ప్రస్తావించుకోవాలి.
విద్యారంగంలో నాడు-నేడు కార్యక్రమం మొదటి దశ అయిపోయింది. రెండు, మూడో దశలు అమలుజరగాలి. అవి అమలు కావాలంటే ఎనిమిది వేల కోట్ల రూపాయలు కావాలి. తాజా బడ్జెట్‌లో రూ. 3,500 కోట్లు కేటాయించారు. చాలా స్కూల్‌ భవనాలు బేస్‌మెంట్‌, లెంటల్‌ లెవల్‌లో ఆగాయి.
జగనన్న విద్యాకానుక పథకం కింద స్కూల్‌ బ్యాగులు, బూట్లు, పుస్తకాలు, నోట్‌ బుక్కులు ఇస్తున్నారు. ఈ సంవత్సరంలో ఇచ్చిన వాటి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. తొంభై శాతం బ్యాగులు చినిగిపోయాయి, బూట్ల నాణ్యత లోపించింది. నేను కొన్ని వందల స్కూళ్లకు వెళ్లి చూశాను. విద్యార్థులు షూస్‌ ఎందుకు వేసుకొని రావడంలేదని అడిగితే చినిగిపోయాయని చెబుతున్నారు. పథకాన్ని అమలు చేయడంలో లోపాలను అరికట్టాల్సిన అవసరం ఉంది.
'జగనన్న గోరు ముద్ద' పథకంలో మార్పులు తెచ్చారు. రకరకాల మెనూలు పెడుతున్నారు. కానీ అన్నం మెత్తగా మారిపోవడం వల్ల దాదాపు డెబ్భైౖ శాతం విద్యార్థులు అన్నం తినడం లేదు. కొంతమంది విద్యార్థులు ఇంటి నుంచి అన్నం తెచ్చుకుని స్కూల్లో పెట్టే కూర కలుపుకొని తింటున్నారు. లోపాలను గుర్తించి సరిచేయాలి. విద్యారంగంలో క్షేత్ర స్థాయి పరిణామాలను గమనించాల్సిన అవసరం ఉంది.
బడ్జెట్‌కి సంబంధించి వృద్ధి రేటు 11.437 శాతం ఉందని, ఆర్థిక స్థిరత్వం ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. 'తీవ్రమైన అసంతృప్తి' అనడానికి ఒక కారణం వుంది. పదకొండో వేతన సంఘం (పి.ఆర్‌.సి) సిఫారసుల్లో ఉద్యోగులకు అన్యాయం జరిగింది. గత మూడు నాలుగేళ్లుగా ఒక్క డి.ఎ రాలేదు. సుమారు ఐదు వేల కోట్ల రూపాయల పి.ఎఫ్‌ డబ్బులు ఉద్యోగులకు రావలసి ఉంది. ముఖ్యమంత్రి గారు మౌఖికంగా ఎన్నిసార్లు చెప్పినా ఆచరణకు వచ్చేటప్పటికి కింద స్థాయిలో మంజూరు కావడం లేదు. ఇప్పుడు ఎలా వుందంటే...'అవన్నీ మాకొద్దు. నెల మొదటి రోజే మాకు జీతాలు ఇవ్వండి సంతోషిస్తాం' అనే దశకు వచ్చింది. గత ఏడెనిమిది నెలల నుంచి పదవ, పన్నెండవ, పదిహేనవ తేదీలకు కూడా జీతాలు రావడం లేదు. ఉద్యోగులకు నెలనెలా కచ్చితంగా చెల్లించాల్సిన ఇఎంఐ లు, పాల బిల్లు, కరెంటు బిల్లు తదితరాలు ఉంటాయి. రాష్ట్రంలో ఆర్థిక స్థిరత్వం ఏర్పడిందని, జీఎస్‌డీపీ వృద్ధి రేటు బాగుందని, రాష్ట్ర ఆదాయం బాగుందని ఒక వైపు చెబుతున్నారు. కానీ ఇవన్నీ అమలు జరగాలి కదా!
పదకొండో వేతన సంఘం వచ్చి ఐదేళ్లు అయింది. రాష్ట్రాల స్థాయిలో ఐదేళ్లకు ఒకసారి కేంద్ర స్థాయిలో పదేళ్లకు ఒకసారి వేతన సంఘం వేస్తారు. ఇప్పుడు పన్నెండో పిఆర్‌సి వేయాల్సిన ఆవశ్యకత ఉంది. గవర్నర్‌ ప్రసంగంలో గానీ, బడ్జెట్‌లో గానీ పన్నెండో వేతన సంఘం గురించి ఎటువంటి ప్రస్తావనా లేదు.
ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లానుకు సంబంధించిన చట్టం 2013లో చేయబడింది. అప్పుడు నేను శాసనపరిషత్‌ సభ్యునిగా ఉన్నాను. ఆ చట్టం అమలు రోజు మేమంతా మాట్లాడాం. ఆ చట్టం 2023తో అయిపోతుంది. బహుశా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేస్తుంది, త్వరలో వస్తుంది. ఈ సబ్‌ప్లాన్‌ను మరింత నిర్దిష్టంగా అమలు చేయాలి. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌, కాంపోనెంట్‌ ప్రకారంగా ఎస్‌సి జనాభా పదహారు శాతం, ఎస్‌టి జనాభా ఏడు శాతం ఉంది. మొత్తం ఇరవై మూడు శాతం ఉంది. ఇరవై మూడు శాతం నిధులను ప్రతి డిపార్ట్‌మెంట్లో ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. కానీ పన్నెండు, పదిహేను శాతం ఖర్చు పెట్టినట్లు కనిపిస్తుంది తప్ప ఇరవై మూడు శాతం ఖర్చు చేసినట్లు కనపడదు. సబ్‌ప్లాన్‌కు అనుగుణంగా అన్ని డిపార్ట్‌మెంట్లు ఖర్చు చేయాల్సిన ఆవశ్యకత ఉంది.
వెనుకబడిన తరగతులకు సంబంధించి కార్పోరేషన్లను ఏర్పాటుచేశారు. నేను 2007లో శాసనపరిషత్‌ సభ్యునిగా ఎన్నిక అయినపుడు ఆనాడు రాజశేఖర్‌ రెడ్డి గారు కొన్ని కార్పోరేషన్లను ఏర్పాటుచేశారు. ఇప్పుడు దాదాపు 56 కార్పోరేషన్లను ఏర్పాటుచేశారు. ఆ కార్పోరేషన్‌ చైర్మన్లుగా నియమితులైన వారిలో నా విద్యార్థులు, నాకు మంచి పరిచయస్తులు ఉన్నారు. వారికి నిధులు లేవు, విధులూ లేవు. అవి లేకుండా ఒట్టి కార్పోరేషన్ల చైర్మన్లుగా, అలంకారప్రాయంగా నియమించడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? బిసి, ఎస్‌సి, ఎస్‌టి వర్గాలను ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించాలి. నిధులు కూడా పూర్తిగా కేటాయించాలి.
వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, సంక్షేమం, మానవాభివృద్ధి కలిసినపుడు మాత్రమే ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. డిబిటి ద్వారా రూ.1,97,000 కోట్లు బదిలీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. కేవలం దానివల్లనే ప్రజలు సంతృప్తి చెందరు. రోడ్లు వేయాలి. ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది. ఒక ఎల్‌ఐసి ఉద్యోగి కారు కొన్నాడనుకుందాం. అతను డిబిటి గురించి ఆలోచించడు. రోడ్డు బాగుండాలని కోరుకుంటాడు. అలాంటి అవసరాలను ప్రజలకు సమకూర్చినపుడే సంతృప్తి ఉంటుంది. అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచన చేయాల్సి వుంది.

ks

 

 

 

 

 

వ్యాసకర్త:  కె.యస్‌.లక్ష్మణరావు

పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ, సెల్‌ : 9440262072