Oct 25,2023 22:44
  • ఇజ్రాయిల్‌ దాడులకు 6,546 మంది బలి

గాజా : గాజాపై ఇజ్రాయిల్‌ నిరంతరంగా కొనసాగిస్తున్న బాంబు దాడులు, వైద్య సరఫరాలు, సిబ్బంది, ఇంధన కొరత కారణంగా మొత్తంగా గాజాలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిందని పాలస్తీనా ఆరోగ్యశాఖ ప్రతినిధి తెలిపారు. తక్షణమే ఈ వ్యవస్థ పునరుద్ధరణకు జోక్యం చేసుకోవాల్సిందిగా ఆయన అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. ఈ పరిస్థితులపై తాము ఎన్ని హెచ్చరికలు చేసినా ప్రపంచ దేశాలు పట్టించుకోవడం లేదని అన్నారు. గాజాలో 30 శాతానికి పైగా ఆస్పత్రులు మూత పడ్డాయని ఐక్యరాజ్య సమితి ఇప్పటికే ప్రకటించింది. ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో మూడింట రెండు వంతులు మూతపడ్డాయని తెలిపింది. బాంబు దాడులతో ధ్వంసం కావడం, ఇంధన కొరత కారణంగా ఈ పరిస్థితులు తలెత్తాయని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఇజ్రాయిల్‌ బాంబు దాడులతో గాజా పొరుగు ప్రాంతాలన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. అక్కడ జీవన పరిస్థితులన్నీ అస్తవ్యస్థంగా మారాయి. ఆసుపత్రుల్లో జనరేటర్లకు అవసరమైన ఇంధనాన్ని సైతం ఇజ్రాయిల్‌ అడ్డుకుంటోంది. దీంతో ఇప్పటికే దాదాపు అన్ని ఆసుపత్రుల్లోనూ ఇంధన నిల్వలు నిండుకున్నాయి. ప్రాణాధార మందులు, పాలు, టీకాలు, వైద్య పరికరాల సరఫరాలను సైతం అడ్డుకోవడంతో గాజాలోని అన్ని ఆసుపత్రుల్లోనూ హాహాకారాలు మిన్నంటుతున్నాయి. అరకొర సదుపాయాల నడుమే ఉన్నంతలో వైద్యులు సేవలందిస్తున్నా.. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం తక్షణమే జోక్యం చేసుకొని ఇజ్రాయిల్‌ అడ్డు తప్పించాలని పాలస్తీనా విజ్ఞప్తి చేస్తోంది. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, మానవ హక్కుల సంఘాలు కూడా ఇప్పటికే అంతర్జాతీయ సాయాన్ని కోరుతూ విన్నపాలు చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఇజ్రాయిల్‌ వైమానిక దాడులను బుధవారం కూడా కొనసాగించింది. ఆసుపత్రులు, పౌరుల నివాసాలు అని తేడా లేకుండా యథేచ్ఛగా దాడులకు తెగబడుతోంది. దీంతో వందలాది మంది నేలకొరుగుతున్నారు. బుధవారానికి గడిచిన 24 గంటల్లో 756 మంది చనిపోయారు. దీంతో ఇజ్రాయిల్‌ దాడుల్లో ఇప్పటి వరకు గాజాలో చనిపోయినవారి సంఖ్య 6,546కి చేరిందని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీరిలో 2,704 మంది పిల్లలు వున్నారు. ఇప్పటివరకు 17 వేల మందికిపైగా గాయపడ్డారు.
ఇజ్రాయిల్‌ దాడుల్లో పాత్రికేయులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. పాలస్తీనా జర్నలిస్టు సయీద్‌ అల్‌ హలాబి బుధవారం ఉత్తర గాజాలో జరిగిన బాంబు దాడిలో మరణించారు. ఇప్పటివరకు 21 మంది పాలస్తీనా జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు ఇజ్రాయిల్‌, ఒక లెబనాన్‌ జర్నలిస్టు కూడా చనిపోయారు.
గాజాలో ఇజ్రాయిల్‌ సాగించే యుద్ధంలో ఎలాంటి ప్రత్యక్ష ప్రమేయం వద్దని ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతాV్‌ా అల్‌ సిసి తన మిలటరీని హెచ్చరించారు. ఆ దిశగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. సంక్షోభ సమయాల్లో హేతుబద్ధంగా, సంయమనంతో వ్యవహరించే చరిత్ర ఈజిప్ట్‌ ఆర్మీకి వుందని అన్నారు.