Nov 10,2022 06:20

సెప్టెంబరు 20న కోల్‌కతాలో జరిగిన 'ఇన్సాఫ్‌ ర్యాలీ'లో వేదికను నిర్మించుకోవడానికి నిర్వాహకులైన సిపిఎం విద్యార్ధి, యువజన విభాగాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ర్యాలీకి బ్రహ్మాండంగా హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి సిపిఎం పశ్చిమ బెంగాల్‌ కార్యదర్శి మహ్మద్‌ సలీం మాట్లాడుతూ...ప్రభుత్వం ఈనాడు వేదికను నిర్మించుకోవడానికి అనుమతి నిరాకరించవచ్చు. కానీ మనుషులను ర్యాలీకి రాకుండా ఆపలేరని వ్యాఖ్యానించారు. గత కొద్ది మాసాలుగా, వామపక్షాలు ముఖ్యంగా సిపిఎం రాష్ట్రంలో నిర్వహించే ర్యాలీలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నారు.
బెంగాల్‌లో 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత, బిజెపి దాడిని సమర్ధవంతంగా ఎదుర్కొని తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయవంతంగా నిలబడడంతో రాష్ట్రంలో ప్రతిపక్షాల హవా కొద్దిగా తగ్గింది. 2021 తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనే కాదు, స్థానిక ఎన్నికల్లో కూడా తృణమూల్‌ విజయం సాధించింది. కానీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బిజెపి ఓటు వాటా గణనీయంగా తగ్గిపోయింది. కొన్ని సందర్భాలలో వామపక్షాలు బిజెపి కన్నా అధికంగా లేదా సమానంగా ఓట్లు సాధించాయి. ఉదాహరణకు, ఈ ఏడాది మార్చిలో బాలీగంజ్‌ అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో సిపిఎం అభ్యర్ధి, బిజెపి అభ్యర్ధి కన్నా ఎక్కువ ఓట్లు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచారు.
2021 తర్వాత, పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు అసందిగ్ధ పరిస్థితిలో వున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించినా పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌ కుంభకోణాలతో పోరాడుతోంది. మరోపక్క బిజెపి తన రాజకీయ ముఖచిత్రాన్ని మార్చుకోలేకపోతోంది. ఇటువంటి పరిస్థితులు, కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి పొందేందుకు వామపక్షాలకు ఒక ఆశాకిరణాన్ని అందిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో చనిపోయిన విద్యార్ధి నేత అనీష్‌ ఖాన్‌ విషయమై సిపిఎం విద్యార్ధి, యువజన విభాగాలు ఉద్యమాలు చేస్తున్నాయి. ఇటీవల, స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియపై తలెత్తిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో వామపక్షాల కార్యకర్తలు వీధుల్లోకి వచ్చారు. నిరసనలు నిర్వహించారు.
పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నప్పటికీ, వామపక్షాలు ముఖ్యంగా సిపిఎం తన కీలకమైన మద్దతుదారులను చేరుకోవడంలో సవాల్‌ను ఎదుర్కొంటోంది. కార్మిక వర్గం, రైతులు, తేయాకు, జౌళి వంటి పరిశ్రమలతో సహా అసంఘటిత రంగాల్లోని కార్మికుల మద్దతుతో 34 ఏళ్ళ (1977-2011) పాటు పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు అధికారంలో వున్నాయి. వామపక్ష సంఘటన ఓడిపోయి, తృణమూల్‌ గెలుపొందిన ఈ పదకొండేళ్ళ కాలంలో, కార్మిక సంఘాలు దాదాపుగా కనుమరుగైపోయాయి. దీంతో కార్మికులు తమ హక్కుల కోసం పోరాడడం దాదాపుగా అసాధ్యంగా మారిపోయింది. వామపక్షాలకు మద్దతునిచ్చే వర్గంలో రైతులు కూడా గణనీయమైన భాగంగా వున్నారు. తృణమూల్‌ పాలనలో, వామపక్షాలకు రైతులపై, ఇతర వర్గాలపై వున్న పట్టు కూడా బలహీనపడింది. వ్యవసాయ సంక్షోభం నెలకొందన్న వార్తలు వున్నప్పటికీ రైతులందరినీ సమీకరించడంలో వామపక్షాలు విఫలం అయ్యాయి.
నాయకత్వ సమస్య కూడా వుంది. అనారోగ్యం కారణంగా క్రియాశీల రాజకీయాల నుండి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య వైదొలగిన తర్వాత, అటు వృద్ధులతో పాటు ఇటు యువజన వామపక్షాల కార్యకర్తలను కూడా ఆకర్షించగల, వారికి పిలుపివ్వగల ప్రజా నాయకుడు కరువయ్యారు. కొత్తవారిని తీసుకురావడానికి సిపిఎం ప్రయత్నించింది. కానీ అదేమీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కోల్‌కతా లేదా ఢిల్లీ లోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీకి చెందిన విద్యార్ధి నేతలను నిలబెట్టడం వల్ల పతాక శీర్షికల్లోకి ఎక్కి వుండవచ్చు కానీ ఇటువంటి ప్రయత్నాల వల్ల పార్టీకి ఎన్నికల ప్రయోజనాలేమీ సమకూరలేదు.
వామపక్షాలకు సంబంధించి నంతవరకు చూసినట్లైతే, ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు తమ కీలకమైన మద్దతు వర్గాన్ని - కార్మిక వర్గాన్ని కలుసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. దక్షిణ బెంగాల్‌లో జౌళి మిల్లులు మూత పడినపుడు లేదా దూర్స్‌ లోని తేయాకు తోటల్లో వేతనాలివ్వడానికి తిరస్కరించినపుడు, బర్ద్వాన్‌ లేదా హుగ్లీలో వ్యవసాయ సంక్షోభం కారణంగా రైతులు మరణించినపుడు వారు మరింత క్రియాశీలంగా వ్యవహరించాల్సిన అవస రం వుంది. పశ్చిమ బెంగాల్‌లో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసిన పనుల కు వేతనాలు రాని కార్మికులు లక్షల్లో వున్నారు. వామపక్షాలు వారి సమస్యను చేపట్టవచ్చు.
గత నాలుగైదేళ్ళుగా, పశ్చిమ బెంగాల్‌లో బిజెపి తన పట్టును విస్తరించుకోవడం ఆరంభించినప్పటి నుండి, వామపక్షాలకు ఒకటే వ్యూహం వుంది. అది, ప్రధాని మోడీని, ముఖ్యమంత్రి దీదీని ఒకేసారి లక్ష్యంగా చేసుకోవడం. రాజకీయంగా ఇటువంటి తరహా లక్ష్యాలు వుండడం తప్పు కాకున్నా, ప్రస్తుతం ఎవరు అన్నింటి కన్నా అతి పెద్ద రాజకీయ శత్రువు అన్న విషయమై తమ మద్దతుదారులకు వామపక్షాలు స్పష్టం చేయాల్సిన అవసరం వుంది.
వామపక్షాల్లో మరింత పటిష్టమైన ఐక్యత వుండాల్సిన అవసరముంది. వాస్తవానికి, మరిన్ని వామపక్షాలు ఒక తాటిపైకి వచ్చి కార్మికుల, రైతుల హక్కులపై నిలకడగా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం వుంది. 

siva

 

 

 

 


 

 'ది హిందూ' సౌజన్యంతో 

శివ్‌ సహాయ్ సింగ్‌